పోలీసుల ఓవ‌రాక్ష‌న్‌

వైయ‌స్ఆర్‌సీపీ నేత సాయినాథ శర్మ ఇంటిలో అర్థరాత్రి పోలీసుల సోదాలు

కమలాపురం : కమలాపురం నియోజకర్గ వైయ‌స్ఆర్‌సీపీ నేత సాయినాథ శర్మపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాయినాథ శర్మతో పాటు ఆయన కుమారుడు, అనుచరులపై హత్యాయత్నం, కిడ్నాప్‌ తదితర కేసులను పాత తేదీలతో నమోదు చేసిన పోలీసులు సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన ఇంటిని సోదా చేశారు.  స్థానిక ఎస్‌ఐ ప్రతాప్‌ రెడ్డి ఇద్దరు పోలీసులతో కలిసి ఎలాంటి సెర్చ్‌ వారెంట్‌ లేకుండా కమలాపురం పట్టణంలోని సాయనాథ శర్మ ఇంటిలో సోదాలు జరిపారు. ఆ సమయంలో ఇంటిలో ఆయన సతీమణితో బాటు, ఆయన చెల్లెలు, కూతురు, మరో పెద్ద వయసు ఉన్న మహిళ మాత్రమే ఉన్నారు. కాగా మంగళవారం ఉదయం వారిని నిర్బంధిస్తూ వారి ఇంటి వద్ద మహిళా పోలీసును కాపలాగా ఉంచారు. 

కుటుంబ సభ్యులను నిర్బంధించారు  
సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో పోలీసులు తమ ఇంటి ముందు కారు దిగి వేగంగా పరుగెత్తుకుంటూ ఇంట్లోకి ప్రవేశించారని సాయినాథ శర్మ కుటుంబ సభ్యులు తెలిపారు. తాము ఇంటి వరండాలో కూర్చుని మాట్లాడుకుంటుండగా తమ అనుమతి లేకుండా ఇంటిలో ప్రవేశించారని, ఇంట్లో సాయినాథ శర్మ గానీ , ఆయన కుమారుడు గానీ లేక పోవడంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లారని తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటలకు మహిళా పోలీసును తమ ఇంటి వద్ద కాపలా పెట్టారని, తమ కుటుంబ సభ్యులు ఎవరూ బయటకు వెళ్లకూడదని ఆంక్షలు విధించారన్నారు. సాయినాథ శర్మ సొంత బావ సాంవత్సరీకాలు జరుగుతున్నా తమను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయినాథ శర్మ కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్లాలన్నా తమ అనుమతి తీసుకోవాలని ఎస్‌ఐ సూచించినట్లు మహిళా పోలీసు తెలిపారన్నారు. తాము ఏమి తప్పు చేశామని పోలీసులు తమ కుటుంబాన్ని ఇంతగా వేధిస్తున్నారని వారు ప్రశ్నించారు. తమ మీద పెట్టిన కేసులే తప్పుడు కేసులని, ఆ కేసుల్లో ఇంత వేధింపులు ఎందుకని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


పోలీసుల వేధింపులు తగదు 
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ నాయకులపై పోలీసుల వేధింపులు అధికమయ్యాయని కమలాపురం మాజీ శాసన సభ్యుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర నేత రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. మంగళవారం కడప నగరంలోని రవీంద్రనాథ్‌ రెడ్డి స్వగృహంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కమలాపురం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు సాయినాథ్‌శర్మపై కమలాపురం పోలీసులు వేధింపులకు దిగుతున్నారని చెప్పారు. సాయినాథ్‌శర్మతోపాటు ఆయన కుమారుడు, అనుచరులపై హత్యాయత్నం, కిడ్నాప్‌ తదితర కేసులు పాత తేదీలతో నమోదు చేశారన్నారు. అధికార పార్టీ నాయకులను సంతప్తి పరచడానికి పోలీసులు శ్రమిస్తున్న తీరు ప్రజలను విస్మయపరుస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీకి విధేయులుగా పనిచేస్తున్న అధికారులపై కోర్టును ఆశ్రయించి వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు.  

Back to Top