‘పసుపు-కుంకుమ’లో క‌మీష‌న్ల క‌క్కుర్తి 

 చెక్కులివ్వాలంటే ముడుపులివ్వాల్సిందే

రూ. 500 నుంచి వెయ్యి వరకూ గుంజుతున్న వైనం 

అమ‌రావ‌తి:  రాష్ట్ర ప్రభుత్వం పొదుపుసంఘాల మహిళలకు రూ.10 వేలు చొప్పున అందజేసేందుకు సిద్ధమైన పసుపు-కుంకుమ పథకం అధికార పార్టీకి కల్పవృక్షంగా మారింది. చెక్కులు ఇవ్వాలంటే ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. ఇప్పటికే మూడు చెక్కులకు రూ.500 నుంచి రూ.వెయ్యిలకు పైగా వసూలు చేస్తున్న పరిస్థితి వుంది. టీడీపీ నేత‌లు వ్యవహరిస్తున్న తీరుపై పొదుపు సంఘాల మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2014కు ముందున్న గ్రూపులకే మంజూరు చేసే పసుపు-కుంకుమను ఈసారి జనవరి 25, 2019 వరకు నమోదు చేసుకున్న గ్రూపులన్నింటికి కలిపి కానుక ఇవ్వనుంది. 

గతంలో పసుపు-కుంకుమ నిధులు 2014 నుంచి నాలుగు విడతల్లో ఆయా సభ్యుల సంఘాల ఖాతాలకు జమ చేసేవారు. దీంతో చాలా వరకు నిధులు పక్కదారి పట్టాయి. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఒకరి ఖాతాకు బదులు వేరోక ఖాతాకు జమ అయ్యాయి. ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా చెక్కుల ద్వారా సభ్యుల ఖాతాకు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందు కోసం డిఆర్‌డిఎలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, చెక్కులు నమోదు చేస్తున్నారు. మెప్మా ద్వారా పట్టణ ప్రాంతాలకు సంబంధించిన మహిళా సంఘాలకు కూడా ఇక్కడే చెక్కులను సిద్ధం చేశారు. ఈ చెక్కులను యా వార్డులలో, గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి ఒకే సారి మూడు చెక్కులను అందించనున్నారు.

మొదటి చెక్కును ఫిబ్రవరి 1న రూ.2500, రెండో చెక్కు మార్చి 5న రూ.3500, మూడో విడత ఏప్రిల్‌ 8న రూ. 4 వేలు మార్చుకునేలా ఇస్తారు. పసుపు కుంకుమ కింద ఎక్కువ మహిళా సంఘాలు గత పదేళ్ల నుంచి ఉన్నా, వీరిలో చాలా వరకు సంఘాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. దీంతో ఆన్‌లైన్‌లో నమోదు కాని సంఘాలకు నిధులు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జిల్లా కేంద్రం నుంచి పసుపు-కుంకమ చెక్కులను మండలకేంద్రాలకు తరలించారు. మండలాల్లో కూడా ఈ చెక్కులను అందజేసేందుకు క్షేత్రస్థాయిలోని సిబ్బంది ఒక్కొ సంఘం నుంచి రూ.వెయ్యికు పైగా వసూలు చేస్తున్న పరిస్థితి వుంది. నంద్యాలలో పొదుపు సంఘాల మహిళల నుంచి క్షేత్రస్థాయి డబ్బులు డిమాండ్‌ చేస్తుండడంతో ప్రతిఘటించారు.  

పోస్టు డేటెడ్ చెక్కులు ఇవ్వ‌డం ప‌ట్ల మ‌హిళ‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. కేవ‌లం ఒక్క విడ‌త మాత్ర‌మే డ‌బ్బులు డ్రా చేసుకునే వీలుంటుంద‌ని, రెండో విడ‌త లోగా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌వుతుంది. దీంతో చెక్కు డ్రా చేసుకోవడానికి ఎన్నిక‌ల కోడ్ అడ్డు ప‌డుతోంది. ఇక మూడో విడ‌త లోగా ఈ ప్ర‌భుత్వం అస‌లే అధికారంలో ఉండ‌దు. కాబ‌ట్టి ముష్టి రూ.2500 కోసం క‌మీష‌న్లు ఇవ్వాలా అని మ‌హిళ‌లు ప‌చ్చ పార్టీ నేత‌లను నిల‌దీస్తున్నారు. ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందేందుకే చంద్ర‌బాబు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నార‌ని డ్వాక్రా సంఘాల స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి ఎన్ని వేషాలు వేసినా చంద్ర‌బాబును న‌మ్మ‌మ‌ని మ‌హిళా లోకం నిన‌దిస్తోంది. చంద్ర‌బాబుకు ఇక ఓట‌మి ఖాయ‌మే.

 

Back to Top