అమరావతి: రాష్ట్రంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) పెట్టుబడులు వాస్తవ రూపంలోకొస్తున్నాయి. బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో ఈ ఏడాది జనవరిలో 4 చమురు బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభించిన ఓఎన్‌జీసీ తాజాగా అయిదో బావి నుంచి చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. కేజీ డీ–5 బ్లాక్‌లోని క్లస్టర్–2లోని ఐదో బావి నుంచి విజయవంతంగా చమురును వెలికి తీసినట్లు ఆదివారం స్టాక్ ఎక్చసైంజ్ లకు తెలిపింది. ముడి చమురును వెలికి తీయడమే కాకుండా దాన్ని పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తులుగా రిఫైనరీ చేసి ఫ్లోటింగ్ ప్రొడక్షన్, స్టోరేజ్, ఆఫ్ లోడింగ్ వెజల్ (ఎఫ్‌పీఎస్‌వో) ద్వారా సముద్రం నుంచి తీరానికి చేరుస్తోంది. ఇందుకోసం ఆర్మదా స్టెర్లింగ్–వీ ఫ్లోటింగ్ రిఫైనరీని ఓఎన్‌జీసీ అద్దెకు తీసుకుంది. క్లస్టర్–2లో అభివృద్ధి చేస్తోన్న ఈ బావులు ద్వారా 23.52 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు, 50.70 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు ఉత్పత్తి అవుతుందని ఓఎన్‌జీసీ అంచనా. ఓఎన్‌జీసీ కేజీ బేసిన్‌లో మొత్తం చమురు సహజ వాయువు అన్వేషణ కోసం 26 చోట్ల డ్రిల్లింగ్ చేసింది. అందులో 13 చమురు బావులు, 7 సహజ వాయువు బావులను అభివృద్ధి చేస్తోంది. రిలయన్స్ కేజీడీ–6 బ్లాక్‌కు కూత వేటు దూరంలోనే ఓఎన్‌జీసీ కేజీ–డీ5 బ్లాక్‌ను అభివృద్ధి చేస్తోంది. తీరానికి 35 కి.మీ దూరంలో 300–3,200 మీటర్ల లోతులో వీటిని అభివృద్ధి చేస్తోంది. బావులను 3 క్లస్టర్లుగా విభజించిన ఓఎన్‌జీసీ మొదటి రెండు క్లస్టర్‌ల్లోని బావులను అభివృద్ధి చేస్తోంది. అక్టోబర్ నాటికి గ్యాస్ బావులతో పాటు మార్చి, 2025కి మొత్తం బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభించాలన్నది లక్ష్యం. ఇందుకోసం రూ.42,081 కోట్లను వ్యయం చేస్తోంది. గత ప్రభుత్వ అండతో.. తూర్పు తీర ప్రాంతంలో తన పట్టును పెంచుకునేందుకు ఓఎన్‌జీసీ కృష్ణా గోదావరి బేసిన్‌పై ప్రధానంగా దృష్టి సారించింది. జగన్ సీఎం అవగానే కేజీ–డీ5 బ్లాక్ అభివృద్ధికి మద్దతి వ్వాల్సిందిగా ఓఎన్‌జీసీ అధికారులు కోరారు. నవంబర్1, 2019లో ఓఎన్‌జీసీ ఈడీ ఏజే మార్బుల్ నేతృత్వంలోని బృందం అప్పటి సీఎం వైయస్ జగన్‌ను కలిసి కేజీ–డీ5 ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుందని చెప్పడమే కాకుండా వేగంగా అనుమతులు మంజూరు చేయడంతో పనులు శరవేగంగా జరిగాయి. 2021కే ఉత్పత్తి ప్రారంభించాలని ఓఎన్‌జీసీ లక్ష్యంగా పెట్టుకోగా కోవిడ్ పరిణామాలతో పనులు ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత ఓఎన్‌జీసీ చైర్మన్ సుభాష్ కుమార్, కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్‌తో కలిసి సెప్టెంబర్22, 2021న నాటి సీఎం జగన్‌ను కలిసి కేజీ బేసిన్‌లో జరుగుతున్న పనులను వివరించారు. దీంతో 2024 ప్రారంభం నుంచి ఒకొక్క బావి నుంచి ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వస్తున్నాయి.