వారికి ఉత్తరాంధ్ర ‘ఫీవర్‌’ 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి: నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి కుల రాజగురువు రాముకి ఈ వానాకాలంలో రెండు రకాల జ్వరాలు పట్టిపీడిస్తున్నాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు . ఒకటి ఎన్నికల జ్వరం అయితే, రెండోది ‘ఉత్తరాంధ్ర ఫీవర్‌’ అని అభివ‌ర్ణించారు. ఎన్నికల ఫీవర్‌ రెండు నెలల ముందే మొదలైంది. ఉత్తరాంధ్ర జ్వరం మాత్రం ఈమధ్యనే ఆరంభమైంది. విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్‌ కార్యనిర్వాహక రాజధానిని చేస్తామని పాలకపక్షం వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు పదేపదే చేస్తున్న ప్రకటనలు టీడీపీని, చంద్రబాబును బెంబేలెత్తిస్తున్నాయి. అదే జరిగితే తమ పార్టీకి ఉత్తరాంధ్రలో పుట్టగతులుండవనే భయం మాజీ సీఎం బాబు గారికి పట్టుకుంది. అందుకే, విశాఖ నగరంలో సాధారణ భూక్రయవిక్రయాలను ‘కుంభకోణాలు’ అంటూ టీడీపీ అనుకూల మీడియా రాముకుల పత్రిక "ఈనాడు" అబద్ధాలు, అర్థ సత్యాలతో కట్టుకథలు ప్రచారంలో పెడుతోంది. తమ నగరం కార్యనిర్వాహక రాజధాని అవుతుందనే ఆనందంలో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని భయభ్రాంతులను చేసేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు వర్గీయులు. అందుకే, ఈమధ్య విశాఖలో భూముల కొనుగోళ్లు భారీగా జరిగాయంటూ ఈ క్రయవిక్రయాలను నేరుగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి టీడీపీ అనుకూల పత్రికలు. ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తూ పాలకపక్ష నేతలు వివరణ ఇచ్చేటప్పటికి జనం వాస్తవాలు తెలుసుకున్నారు. టీడీపీ మాత్రం తన అబద్ధాల ప్రచారం ఆపదలుచుకోలేదు. ఈ పార్టీ అధినేత చంద్రబాబు గారే స్వయంగా ఉత్తరాంధ్రపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. అంతేగాదు, విశాఖలో జరిగిన ‘అక్రమాల’ గురించి వాకబు చేయడానికి తాను ఈ నగరంలో 3 రోజులు మకాం చేస్తానని కూడా చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. మరి ఈ మూడు రోజుల క్యాంపులో టీడీపీ చిట్టచివరి ముఖ్యమంత్రి గారు ఎన్ని ‘లావాదేవీలకు’ తెర లేపుతారో చూడాలి.

నిన్నటి దాకా ఎన్నికలని, ఇప్పుడు ‘ముందస్తు–ముందస్తు’ అంటూ కలవరిస్తున్నారు! 
గత రెండు నెలలుగా చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ తన పార్టీ నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు ‘ముందస్తు ఎన్నికలకు రెడీగా ఉండాలంటూ బుధవారం ఆయన పిలుపినిచ్చారు. ప్రస్తుత ఏపీ శాసనసభకు ఇంకా ఏడాదిన్నర పదవీకాలం ఉండగా వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ ‘ముందస్తు’కు ఎందుకు తొందరపడుతుందో రాజకీయ ఎన్నికల మాంత్రికుడు నారా వారు వివరిస్తే అఖిలాంధ్ర ప్రజానీకం సంతోషిస్తారు. కాలం గడిచేకొద్దీ జనంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని భయపడే పాలకపక్షం మాత్రమే ‘ముందస్తు’కు పోతుందిగాని, రోజురోజుకు జనాదరణ పెంచుకుంటున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు అసెంబ్లీ రద్దుచేయిస్తుంది? అనే ప్రశ్న టీడీపీ మెదడుకు తట్టడం లేదు. రాష్ట్రమంతటా ‘ఎన్నికలు ఎప్పుడు వస్తాయా?’ అనే ఒకే మూడ్‌ ఉందని టీడీపీ చెబుతోంది. తమకు నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగే మేలు, అందుతున్న సంక్షేమం గురించే ప్రజలు ఆలోచిస్తారు. అంతేగాని, ఎన్నికల జ్వరంతో జనం బాధపడరు. ఎన్నికల తేదీల కోసం వేచిచూడరు.

Back to Top