నేను చూశాను...నేను విన్నాను. నేను ఉన్నాను..

 
ఒక నమ్మకమై..ఒక ధైర్యమై..ఒక భరోసాలా పలికిన మాటలు. వై.యస్‌.జగన్‌ పాదయాత్రలో ప్రతిధ్వనించిన మాటలు. చిన్న మాటలు..చిన్న పదాలు. అయినా సామాజిక శాస్త్రమంత విస్తృతమైనవి. లోతైనవి. గాఢమైనవి. ఇచ్చిన మాట మీద నిలబడాలన్న ఒకే ఒక విలువల కట్టుబాటు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని కదిలించింది. నడిపించింది. ప్రజాక్షేత్రంలో నిలిచి గెలిచేలా చేసింది.
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా సాగిన 3,648 కిలోమీటర్ల ప్రజాసంకల్పయాత్ర ఓ అనితరసాధ్యుడి పాదయాత్ర, రుతువులు మారిపోతున్నా...ఎండావానలు పలకరించిపోతున్నా...శీతాకాలం వణికించేస్తున్నా...అలుపెరుగని పాదయాత్ర ఆవిష్కరించిన దృశ్యాలు ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రాన్ని పట్టిచూపాయి.
విశాల ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత..విభజిత ఆంధ్రప్రదేశ్‌లో, ఐదేళ్లు ప్రజల కష్టాలే చూశారు. కన్నీళ్లే కార్చారు. కోట్లాది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నమ్మిమోసపోయినవారయ్యారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏర్పడ్డ అప్పటి కొత్త ప్రభుత్వం సాగించిన పాలనంతా అబద్దాలమయం. మోసాలపర్వం. అధికారమే పరమావధి. అందినకాడికి దోచేయడంగానే సాగింది. పాలకుల పాపం, ప్రజలకు శాపమైన వేళ...దిక్కుతోచని స్థితిలో పడ్డ ప్రజలకు  దిక్కయి...పొద్దుపొడుపై ప్రతిపక్షనాయకుడు గట్టిగా నిలబడి నేను ఉన్నాను..అంటూ ధైర్యంగా, స్థైర్యంగా ప్రజలకోసం నిలబడ్డారు.
అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాన్ని కట్టిపడేస్తుంటే, ఇక ఇలా కాదని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని...జూలు విదిల్చిన సింహంలా ముందుకురికారు వైయస్‌ జగన్‌. ప్రజల కోసం, ప్రజలందరి కోసం  అతను నడిచాడు. ప్రజాసంక్షేమమే సంకల్పం అయినప్పుడు ఇక తిరుగేమి వుంటుంది. అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వతాతల నుంచి అబాలగోపాలం వరకు జగన్‌కు ’జయహో’ అన్నారు. దారెంబడి తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు.  తమ కోసం నడిచొచ్చిన ఆత్మబంధువు చెంత కన్నీళ్ల పర్యంతమూ అయ్యారు. ’ఇక నువ్వే మా నమ్మకం’ అని లక్షలాది గుండె చప్పుళ్ల నుంచి, ఒక విశ్వాసం విశ్వమంత విశాలమై జగన్‌ను అక్కున చేర్చుకుంది.
పాదయాత్ర ఒక ఒక ప్రజానాయకుడికి మంచి పాఠంగామారి ఒక దార్శనికుడిగా మార్చింది. ఒక విజేతను చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రపాలనా పగ్గాలు అప్పగించింది.
ఒక లక్ష్యసాధనాదిశలో విలువలు, విశ్వసనీయత వీడక అలుపెరగని రీతిలో, ముందుకు నడిచిన వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు యువతకు ఓ స్ఫూర్తి. పాలకుడిగా ఎదిగి...ప్రజాసేవకుడిగా ఒదిగినవాడు. పాలనలో కొత్త చరిత్రను సృష్టించాలని పరితపిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ ’మంచిమార్పు’ సాధించే దిశలో పరితపిస్తున్నాడు.
ఆయన నడకలో...నడతలో..మాటలో ఒక ’టచ్‌’ ఉంది. టచ్‌...ఆ ఆత్మీయస్పర్శ కోట్లాది ప్రజల మనస్సుల్ని గెలిచింది.
వైయస్‌ జగన్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలిరోజున ’యువకుడు, ఉత్సాహవంతుడు. మీకు సేవ చేయాలని వచ్చాడు. నా కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని ఆశీర్వదించండి’ అంటూ వైయస్సార్‌ తనయుడిని ప్రజలకు పరిచయం చేశారు. ఆ తండ్రి ఆశీర్వాదబలం..తండ్రి మాట నిలబెట్టాలన్న తనయుడి సంకల్పబలం..నేటి రాజకీయాల్లో ’కొత్తచరిత్ర’కు శ్రీకారం చుట్టాయి.
అందుకే ’వైయస్‌ జగన్‌ అనే నేను...’ మాట ప్రజల గుండెగొంతుకల నినాదమైన సమయం, సందర్భం ఇది.
ప్రజాసంకల్పయాత్ర  పేరిట వైయస్‌ జగన్‌ చేసిన 3648 కిలోమీటర్ల సుదీర్ఘపాదయాత్ర ఆయన జీవితాదర్శాల్ని, ఆలోచనల్ని, తాత్వికధోరణిలో మార్పులు తేవడంతో పాటు, నవ్యాంధ్రకు సరికొత్త రూపురేఖలు దిద్ది అటు ప్రజాజీవితాల్ని, ఇటు ప్రగతిపనుల బరువుబాధ్యతలను ఆయన భుజస్కందాలపై మోపింది. పాదయాత్ర సందర్భంగా అనేక సందర్భాల్లో సంకల్పాక్షరాలుగా ఆయన రాసుకున్న మాటలు గమనిస్తేనే, ఆయన ప్రజాసేవకు సంబంధించిన విలువలకు, విశ్వసనీయతకు గట్టిగా కట్టుబడిపోయారని అర్థమైపోతుంది. ఆరోజున ఆయన మాటలివి....
’బాధ్యతారహిత పాలనవల్ల కష్టాల్లో వున్న ప్రజలకు ఓ నమ్మకం, ఓ ధైర్యం, ఓ భరోసా ఇవ్వాలనే నేను పాదయాత్రను మొదలుపెట్టాను. పల్లెల్లోని అక్కలూ, చెల్లెళ్లు, అన్నలూ, తమ్ముళ్లూ, అవ్వలూ, తాతలు, ఎండావానా, చలిగాలి అన్న తేడా లేకుండా నన్ను చూడ్డానికి, ఆశీర్వదించడానికి వస్తున్నారు. వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు, ఆనందాలు, అనుభూతులు, ఆప్యాయతలలో నన్ను భాగస్వామిని చేస్తున్నారు. వారికి నేను ఓ భరోసాగా నిలబడాలి...అదే నా బాధ్యత’....
చిత్తశుద్ది వున్న నాయకుడు ఆడినమాట తప్పడు అన్నదానికి నడుస్తున్న జగన్‌ పాలనకన్నా నిదర్శనం ఏం కావాలి? ఈరోజు అందించిన అమ్మ ఒడి పథకం నుంచి గత ఏడెనిమిది నెలలుగా ప్రతిరోజు...ప్రజల కోసమే ఆలోచిస్తూ...ప్రజాశ్రేయస్సుకు సంబంధించిన నిర్ణయాలే తీసుకుంటూ ముందుకుసాగుతున్న జగన్‌ మనిషితనం...మానవత్వం మూర్తీభవించిన నేటితరం కొత్తనాయకుడు. నడుస్తున్న జగన్‌ పాలన నవశకానికి శ్రీకారం. నవరత్నాలు నాందీవాచకాలు.

Back to Top