న‌వ శ‌కం

వరాలు కురిపించిన ఏపీ బడ్జెట్‌

రైతు సంక్షేమానికి పెద్ద పీట‌

విద్యారంగానికి అధిక ప్రాధాన్యత

పేదల కన్నీటిని తుడిచేలా బడ్జెట్

 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ను (2019-20) ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. నవరత్నాల అమలే ప్రాధాన్యంగా బడ్జెట్‌ను రూపొందించినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఇక ఏపీ బడ్జెట్‌లో రైతులకు సంక్షేమానికి పెద్దపీట వేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు,  సాగునీరు, వరద నివారణకు రూ.13,139 కోట్లు, వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ.8,750 కోట్లు కేటాయించారు. రైతు భరోసా పథకంతో 15 లక్షల మంది కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుందని ఆర్థికమంత్రి తెలిపారు. పంటల మీద కౌలు రైతులు రుణాలు పొందేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు.

 సీఎం చిత్తశుద్ధికి ఇదిగో నిదర్శనం..
టీడీపీ సర్కారు పెద్ద ఎత్తున బిల్లులను చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టడమే కాకుండా భారీ అప్పులను నూతన ప్రభుత్వానికి అప్పగించింది. ఆర్థిక వ్యవస్థ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో కలసి బడ్జెట్‌ రూపకల్పనపై సుదీర్ఘ కసరత్తు చేశారు. గత సర్కారు బకాయిల్లో కొన్నింటిని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం విశేషం. ఇందుకు ఉదాహరణ రైతులకు గత సర్కారు బకాయి పడ్డ ఇన్‌పుట్‌ సబ్సిడీని చెల్లించాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించడం. కరువు కాటకాలతో పంటలు కోల్పోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా టీడీపీ సర్కారు ఎగనామం పెట్టింది. గత సర్కారు ఎగ్గొట్టిన రూ.2,000 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయించడం అన్నదాతల పట్ల ఆయన చిత్తశుద్ధిని రుజువు చేస్తోంది. మరోపక్క  వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తెరదించుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైయ‌స్ఆర్‌ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించారు.
 

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా.. 
రైతు సంక్షేమం: 

వైయస్‌ఆర్‌ రైతు భరోసాకు రూ. 8750 కోట్లు
రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4525 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి రూ. 3 వేల కోట్లు
ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ. 2002 కోట్లు
వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ. 20677 కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ. 29329 కోట్లు
సాగునీరు, వరద నివారణకు రూ. 13139 కోట్లు
వైయస్‌ఆర్‌ రైతు బీమాకు రూ. 1163 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలకు రూ. 100 కోట్లు
విత్తనాల పంపిణీకి రూ. 200 కోట్లు
పశువుల బీమాకు రూ. 50 కోట్లు
భూసారం, ఎరువులు, విత్తనాల, పురుగుల మందు పరీక్షలకు ప్రభుత్వం వైయస్‌ఆర్‌ అగ్రిల్యాబ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇందు నిమిత్తం రూ. 109.28 కోట్లు
శీతలగిడ్డంగులు, గోదాముల అభివృద్ధి కోసం రూ. 200 కోట్లు
వ్యవసాయం, ఉద్యానవన పంటలకు మార్కెట్‌ ప్రమేయానికి వీలు కల్పించేందుకు రూ.3000 కోట్లు
పాడిరైతుల సంక్షేమానికి రూ.100 కోట్లు
చేపల వేట నిషేధ కాలం కారణంగా మత్స్యకారులు ఆదాయం కోల్పోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని రూ. 4 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతున్నాం. మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ. 200 కోట్లు
ఆక్వారైతులకు యూనిట్‌కు రూ.1.5పైసలకే విద్యుత్‌ను అందించేందుకు రూ.475 కోట్లు
మత్స్యకారులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, నెల్లూరులోని జువ్వలదిన్నె, ప్రకాశం ఓడరేవు, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో షిప్పింగ్‌ జెటీలను ఏర్పాటుకు రూ. 100 కోట్లు

 విద్యుత్‌ రంగానికి రూ. 6860 కోట్లు, 
వైద్యరంగానికి రూ. 11399 కోట్లు
విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం రూ. 32618
గృహ నిర్మాణానికి రూ. 3617 కోట్లు
సంక్షేమ రంగానికి రూ. 14142 కోట్లు
వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 1740 కోట్లు
ఆశా వర్కర్లకు రూ. 455.85 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 31,564.75 కోట్లు
రెవెన్యూ శాఖకు రూ. 9496.93 కోట్లు
ప్రణాళిక విభాగానికి రూ. 1439.55 కోట్లు
ఏపీఎస్‌ ఆర్టీసీకి రూ. 1000 కోట్లు
డ్వాక్రా మహిళల వడ్డీలేని రుణాలకు రూ. 1140 కోట్లు
పట్టణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలకు రూ. 648 కోట్లు
వైయస్‌ఆర్‌ గృహ వసతి పథకానికి రూ. 5 వేల కోట్లు 
దళితుల అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు
గిరిజనుల అభివృద్ధికి రూ. 4988 కోట్లు
వెనుకబడిన వర్గాల (బీసీ) అభివృద్ధికి రూ. 1561 కోట్లు
 

అమ్మ ఒడి పథకం
ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని తమ బిడ్డలను బాగా చదివించాలని, వారి జీవితాలను కొత్తగా నిర్మించాలనే సంకల్పం ఉన్న అమ్మలకు మన రాష్ట్రంలో కొదవలేదు. ఆ తల్లుల ప్రేరణే ఈ ప్రభుత్వానికి బలం. తమ పిల్లలను చదువుల బాట పట్టించి వారి రాతను తిరిగిరాయాలనే ప్రతి తల్లికి ఈ ప్రభుత్వం నిండు మనస్సుతో నమస్కరిస్తుంది. తన పిల్లలను విద్యావంతులను చేసేందుకు తల్లికి ప్రోత్సాహకం అందిస్తున్న ఈ ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిది. వనరులు లేమీ కారణంగా ఏ బిడ్డ పరిజ్ఞాణం అనే దాహార్తిని తీర్చుకునేందుకు వెనుకబడిపోకూడదని దృష్టిలో ఉంచుకొని జగనన్న అమ్మ ఒడి పథకం ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నా.. 
పాఠశాలకు పిల్లలను పంపే ప్రతి తల్లికి రూ. 15,000 ఇస్తాం. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు పథకం వర్తిస్తుంది. ఇందుకు రూ. 6455 కోట్లు 
ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1500 కోట్లు
మధ్యాహ్న భోజన పథకానికి రూ. 1077 కోట్లు
పాఠశాల నిర్వహణ గ్రాంటుకు రూ. 160 కోట్లు
జగనన్న విద్యా దీవెన పథకానికి రూ. 4962.3 కోట్లు
 

ప్రతి పేద కుటుంబం ప్రభుత్వం, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందాలని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం చేపట్టారు. ప్రజలు పేదరికంలో పడిపోవడానికి ఆరోగ్య ఖర్చులు ప్రాథమిక కారణాలను గుర్తించి ఆరోగ్యశ్రీ ప్రారంభించి పేదలను ఆదుకున్నారు. ఆరోగ్యశ్రీ మునుపటి వెలుగును పొందుతుందని ఈ ప్రభుత్వం హామీ ఇస్తుంది. 
వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాలకు అంటే నెలకు రూ. 40 వేల ఆదాయం కలిగిన మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. రూ. వెయ్యి మించిన అన్ని కేసులకు, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో మంచి ఆస్పత్రులను ప్రభుత్వం జాబితాలో చేర్చుతుంది. 
ఆరోగ్యశ్రీకి రూ. 1740 కోట్లు
ప్రతి మండలంలో 108 సేవలు ఉండాలని, 20 నిమిషాల్లో రోగిని చేరుకోవాలని రూ. 143.38 కోట్లతో 432 అదనపు అంబులెన్స్‌లు సేకరిస్తున్నాం. 
గ్రామ స్థాయిలో వైద్య అధికారులతో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు 104 కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రూ.179.76 కోట్లతో 676 అదనపు వాహనాలను సేకరిస్తున్నాం. 
ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిని మార్చేందుకు రూ. 1500 కోట్లు 
గిరిజన జనాభా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వీరికి ప్రభుత్వ ఆస్పత్రులే ప్రాథమిక ఆరోగ్య సర్వీసులుగా ఉంటాయి. పాడేరు, అరకు ప్రాంతాల్లో గిరిజన వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సంవత్సరానికి రూ. 66 కోట్లు 
అదనంగా ఒక్కోదానికి రూ. 66 కోట్ల ప్రాథమిక బడ్జెట్‌ కేటాయిస్తూ పల్నాడుకు సేవ చేయాలని గురజాల వద్ద, ఉత్తరాంధ్రకు సేవలందించాలని విజయనగరం వద్ద రెండు వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని, రూ. 50 కోట్లతో శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రానికి, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు యోచిస్తుంది. 
 

వైయస్‌ఆర్‌ గృహ నిర్మాణ పథకం 
ఒక నీడ అంటూ లేని దురదృష్ట పరిస్థితి నిరుపేదది. జానెడు జాగ కోసం జీవితం అంతా కష్టపడుతున్నారు. 
వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభిస్తూ రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వం 25 లక్షల ఇళ్లను నిర్మిస్తుంది. ఈ సంవత్సరం ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తాం. ఈ కార్యక్రమానికి రూ. 8615 కోట్లు
ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినట్లుగా 300 చదరపు అడుగుల వరకు గల గృహాలకు సంబంధించి పట్టణ గృహ నిర్మాణ లబ్ధిదారులకు రుణాన్ని మాఫీ చేస్తుంది. 
 

యువత, ఉపాధి 
నిరుద్యోగులకు కంటితుడుపు భృతికన్నా.. పని కల్పించడం అవసరం అని ఈ ప్రభుత్వం భావిస్తుంది. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఇంటి ముందుకువస్తాయి. ఈ లక్ష్య సాధనకు గ్రామ, వార్డు వలంటీర్ల నియామకం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 2 లక్షల మంది. పట్టణ ప్రాంతాల్లో 81 వేల మంది ప్రజా స్ఫూర్తి కలిగిన యువ వలంటీర్ల సేవలను వినియోగించుకుంటాం. 2019 ఆగస్టు 15 నుంచి వలంటీర్ల నియామకాలను ప్రారంభిస్తాం. 
విలేజ్‌ సెక్రటేరియట్స్‌ 12671, వార్డు సెక్రటేరియట్స్‌ 3710 మొత్తం 16381. 
పది మంది ఉద్యోగులతో సుమారు 2 వేల జనాభా కలిగిన గ్రామ సెక్రటేరియట్, 5 మంది ఉద్యోగులతో సుమారు 5 వేల మంది జనాభాకు వార్డు సచివాలయం నెలకొల్పుతాం. గ్రామ సచివాలయం 1 లక్ష కొత్త ఉద్యోగులు, వార్డు సచివాలయంలో 15 వేల కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మహాత్మాగాంధీ జయంతిన ప్రారంభిస్తున్నాం. 
 

పౌరసరఫరా
ప్రభుత్వం రేషన్‌ సరుకుల డోర్‌ డెలవరీ సౌకర్యం కల్పిస్తున్నాం. నాణ్యమైన సరుకులు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సరుకులు ఇంటింటికీ అందజేస్తాం. రూ.3750 కోట్లు కేటాయిస్తున్నాం. 
మహిళల ఔన్నత్యం వారి సంకల్ప బలంలోనే ఉంటుంది. మహిళాభృద్ధి ద్వారా సుస్థిర పాలన సాధించగలం అని ప్రభుత్వం విశ్వసిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాల కోసం వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇందుకు రూ. 1140 కోట్లు.
షెడ్యుల్డ్‌ కులాలు, షెడ్యుల్డ్‌ తెగలు 
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను ప్రభుత్వం అమలు చేస్తుంది. మాల, మాదిగ, రెల్లి, ఇతర కమ్యూనిటీల కోసం కొత్త కార్పొరేషన్‌ ఏర్పాటు. షెడ్యుల్డ్‌ కులాల ఉప ప్రణాళిక కింద సంక్షేమ, అభివృద్ధి కోసం రూ. 15 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించింది. షెడ్యుల్డ్‌ తెగల ఉప ప్రణాళిక కింద రూ. 4988.53 కోట్లు కేటాయించింది.
పాదయాత్రలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తులను పరిశీలించి 15.62 లక్షల ఎస్సీ కుటుంబాలకు 348.65 కోట్లు, 4.78 షెడ్యుల్డ్‌ తెగల కుటుంబాలకు రూ. 81.07 కోట్లు కేటాయిస్తూ షెడ్యుల్డ్‌ కులాలు, షెడ్యల్డ్‌ తెగల ఉచిత విద్యుత్‌ యూనిట్లను 100 నుంచి 200కు పెంచాలని ప్రతిపాదించడం జరిగింది. 
డాక్టర్‌ వైయస్‌ఆర్‌ గిరిజన విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ. 50 కోట్లు. 

వెనుకబడిన తరగతుల సంక్షేమం
బీసీల సంక్షేమం, అభివృద్ధి కార్యకలాపాల నిమిత్తం రూ. 15,061 కోట్లు
నాయీ బ్రాహ్మణులు, రజకులకు రూ. 10 వేల ఆదాయ మద్దతు ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నాం. రూ. 200 కోట్లతో 23 వేల మంది నాయీ బ్రాహ్మణులకు, 1.92 లక్షల మంది రజకులకు ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తున్నాం. 
దర్జీలకు ప్రతి సంవత్సరం రూ. 100 కోట్లు కేటాయింపుతో రూ. 10 వేల ఆదాయ మద్దతు ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తుంది. 
ప్రతి చేనేత కార్మికుల కుటుంబానికి రూ. 20 వేలు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. చేనేతలు గౌరవ ప్రదమైన ఆదాయం అర్జించేందుకు అవసరమైన మార్కెటింగ్‌ సహాయం, ఇతర సబ్సిడీలు అందించడం జరుగుతుంది. 
వెనుకబడిన తరగతుల కోసం 139 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తుంది. వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని ఈ కార్పొరేషన్ల ద్వారా వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం

మైనార్టీ సంక్షేమం..
ఈ ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డులకు చెందిన స్థిరచరాస్తుల సర్వే నిర్వహించి అట్టి ఆస్తుల మైనార్టీ సామాజికవర్గానికి చెందిన ప్రజల అభ్యున్నతికి ఉపయోగించేలా చూసేందుకు స్థిరాస్తుల రికార్డులను డిజిటలైజ్‌ చేస్తాం. 
ఇమామ్‌ల గౌరవ వేతనం రూ. 10 వేలు నెలకు, మౌజన్‌ల గౌరవ వేతనం రూ. 5 వేలకు పెంచాలని ప్రతిపాదించడం జరిగింది. అదే విధంగా పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు అందజేస్తాం. 
బడ్జెట్‌లో చేర్చిన మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి రూ. 2106 కోట్లు 
బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల రాజకీయ అభ్యున్నతికి, దేవాలయాల ట్రస్టుబోర్డులు, మార్కెట్‌యార్డు కమిటీలు, నామినేషన్‌ పోస్టులు, కార్పొరేషన్లకు సంబంధించి 50 శాతం రిజర్వేషన్లు తీసుకురావాలని ప్రభుత్వం ప్రదిపాదిస్తుంది. కాంట్రాక్ట్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు. 

కాపు సంక్షేమం
కాపు సామాజిక సంక్షేమం, అభివృద్ధి కోసం రూ. 2 వేల కోట్ల కేటాయింపు

బ్రాహ్మణ సంక్షేమం..
బ్రాహ్మణ సంక్షేమానికి రూ. 100 కోట్లు
2 వేలు జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి రూ. 30 వేలు, 5 వేలు జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి 60 వేలు, 10 వేలు జనాభా కలిగిన పంచాయతీలకు రూ. 90 వేలు, 10 వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.1.20 లక్షలతో దూపదీప నైవేద్యాల సమర్పణకు రూ. 234 కోట్లు 

వైయస్‌ఆర్‌ బీమా 
18 నుంచి 60 సంవత్సరాల మధ్య గల వ్యక్తి సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి రూ. లక్ష అందించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. 
బీసీ, ముస్లిం, క్రిస్టియన్‌ సామాజికవర్గాలకు చెందినవారు సహా ఎవరైనా వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల సాయం
వైయస్‌ఆర్‌ బీమా పథకానికి రూ.404.02 కోట్లు కేటాయిస్తున్నాం..

వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక
పాదయాత్ర సమయంలో పెన్షన్‌ లబ్ధిదారులు ఎదుర్కొంటున్న దురావస్థను చూశారు. రూ. వెయ్యి పెన్షన్‌ పొందుతున్నారు. ఇది స్వల్పపెన్షన్‌ గౌరవప్రద జీవితాన్ని సాగించేందుకు సరిపోదు. అవ్వాతాతల మనవడిగా సీఎం వైయస్‌ జగన్‌ రూ. 2250కి పెంచుతూ దాన్ని నాల్గవ సంవత్సరానికి రూ. 3 వేలకు పెంచుతూ మొదటి సంతకం చేశారు. వయో పరిమితిని 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. 
డయాలసిస్‌ రోగుల కోసం నెలకు ఒక్కరికి రూ. 10 వేలకు పెంచడం జరిగింది. దీనికి రూ.15746.58 కోట్లు 

వైయస్‌ఆర్‌ ఆసరా
నవరత్నాల అమలులో భాగంగా 2019 ఏప్రిల్‌ 11 వరకు 27,168 కోట్లు మిగిలిన బ్యాంకుల రుణమొత్తాన్ని వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించి నాలుగు వాయిదాలతో రియంబర్స్‌చేయాలని నిర్ణయించాం. 

వైయస్‌ఆర్‌ చేయూత 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, అల్ప సంఖ్య వర్గాల, ఇతర సంక్షేమ ఆర్థిక సంస్థలను సమీక్షించి ఈ సంవత్సరం పునరుద్ధరించాలని ప్రతిపాదించడం జరిగింది. పునరుద్ధరించిన తరువాత ఈ సంస్థలు లబ్ధిదారులను గుర్తింపును ఈ సంవత్సరంలోనే చేపట్టడం జరుగుతుంది. గ్రామ, వార్డు వలంటీర్ల సహకారంతో సంబంధిత కార్పొరేషన్‌ ద్వారా దీన్ని అమలు చేస్తాం. వచ్చే సంవత్సరాల నుంచి ప్రయోజనాలను పొందుపర్చుతాం. 

వైయస్‌ఆర్‌ కల్యాణ కానుక..
వైయస్‌ఆర్‌ కల్యాణ కానుక ద్వారా బీసీ కులాలకు చెందిన వధువులకు రూ. 50 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. ఎస్సీ, ఎస్టీ, అల్పసంఖ్యలకు చెందిన వధువులకు రూ.లక్షా కల్యాణ కానుక ఇవ్వడం జరుగుతుంది. 
ఇతర సంక్షేమ పథకాలు 
టెక్నాలజీ ఆధారిత అంతరాలు, సాంప్రదాయ వృత్తులకు ప్రమాదకరం. ఆటో రిక్షాలు, ట్యాక్సీలను సొంతంగా కలిగి ఉన్న డ్రైవర్లు ఓలా, ఊబర్‌ వంటి యాప్‌ వారితో పోటీపడలేకపోతున్నారు. బీమా, ఫిట్‌నెస్‌ మరమ్మతులు, ఇతర అవసరాల నిమిత్తం ఏడాదికి రూ. 10 వేలు సాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుంది. సొంత ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల ప్రయోజనాలకు బడ్జెట్‌లో రూ. 400 కోట్లు
న్యాయవాదులకు ప్రాక్టీసు మొదటి మూడు సంవత్సరాల కాలంలో రూ. 5 వేల నెలవారి వేతనాన్ని సమకూర్చడానికి ప్రతిపాదిస్తుంది. ఇందుకు రూ. 10 కోట్లు, అంతేకాకుండా రూ.100 కోట్లతో న్యాయవాదుల సంక్షేమం కోసం ట్రస్టు ఏర్పాటు 

అగ్రిగోల్డ్‌..
అగ్రిగోల్డ్‌ సంస్థ యాజమాన్యం ప్రజల నుంచి అధిక వడ్డీ రేటును, లేదా దానికి బదులు భూమిని రిజిస్టర్‌ చేస్తామని డిపాజిట్లు స్వీకరించాయి. అయితే కంపెనీలు డిపాజిట్లు చెల్లించడం, భూమి రిజిస్టర్‌ చేయడం జరగలేదు. పొదుపులను కోల్పోయిన లక్షలాది మందిలో విషాదాన్ని నెలకొల్పింది. ఏపీలో అగ్రిగోల్డ్‌ స్కామ్‌లో 11.05 లక్షల బాధితులు ఉన్నారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధిత సమస్యను పరిష్కరించేందుకు రూ.1150 కోట్లు 

జలయజ్ఞం..
కృష్ణా, గోదావరి ఆయకట్టును స్థిరీకరిండం, రాయలసీమ, ఉత్తరాంధ్రప్రాంతాలను హరితాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దడం మహానేత వైయస్‌ఆర్‌ దార్శనికత. ఆయన కలను సహకారం చేసేందుకు పోలవరం జూన్‌ 2021 నాటికి అధిక ప్రాధాన్యంతో పూర్తి చేయడానికి, తగిన బడ్జెట్‌ను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మానవతా దృక్పథంతో ప్రాజెక్టు ప్రభావిత కేటాయింపును, పునరావాసాన్ని పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. 
ఒక సంవత్సర కాలంలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు స్వరంగం పూర్తికి కట్టుబడి ఉన్నాం. దీన్ని వలన 1.19 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చు. మిగిలిన ఆయకట్టు ఏర్పాటు చేయడానికి రెండు సంవత్సరాల కాలంలోపు రెండో దశ పూర్తి చేస్తాం. 
అవుకు స్వరంగాన్ని పూర్తి చేస్తూ ఒక సంవత్సరంలో గాలేరు–నగరి ప్రాజెక్టు ఒకటవ దశను పూర్తి చేసేందుకు గండికోట రిజర్వాయర్‌లో నీటి నిల్వ, కడప జిల్లాలోని ఆయకట్టు దారులకు నీటి సరఫరా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.
కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 1.98 లక్షల ఎకరాలకు సాగునీరు కల్పించేందుకు హంద్రీనీవా సృజల స్రవంతి ఒకటవ దశను పూర్తి చేసేందుకు చర్యలు. 
అనంతపురం, చిత్తూరులోని చెరువులను నింపేందుకు రెండవ దశను పూర్తి చేయడం జరుగుతుంది. 
వెనుకబడిన జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సత్వర సాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు వంశధార, సర్దార్‌ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. 
సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో పాటు రాష్ట్రంలో సరస్సులు, చెరువులను పునరుద్ధరించేందుకు చర్యలు. 2019–20 సంవత్సరంలో ప్రాజెక్టుల కొరకు రూ. 13139.13 కోట్లు 

పరిశ్రమ, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాలు
ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల ద్వారా ఉద్యోగ కల్పన ముఖ్య ఉద్దేశంగా ప్రత్యేక హోదా సాధించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. హోదా లేకుండా కూడా పారిశ్రామిక, మౌలిక సదుపాయల అభివృద్ధి ద్వారా ఉద్యోగాల కల్పన కూడా కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఉపయోగించుకునే పరిశ్రమలు స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును తీసుకువచ్చే ప్రక్రియ ఉంది. 
అమరావతి రాజధాని కోసం రూ. 500 కోట్లు. 
కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఈ సంవత్సరం శంకుస్థాపన ముఖ్యమంత్రి చేస్తారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం రూ. 250 కోట్లు. 
ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మధ్యంతర భృతిని 27 శాతం ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సర్వీస్‌ క్రమబద్ధీకరణ, అనుంబంధ విషయాలను అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 

సీపీఎస్‌ నుంచి పాత పెన్షన్‌ పథకానికి మారేందుకు విధి విధానాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. 
ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం గురించి వివిధ అంశాలను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు. 
ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం వివిధ చర్యలు తీసుకుంటుంది. 

ఆశా వర్కర్లకు రూ. 3 వేల నుంచి రూ. 10 వేల వేతనం పెంచడం జరగింది. గిరిజన సామాజిక, ఆరోగ్య కార్యకర్తలకు రూ. 400 నుంచి 4000 చేశాం. మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్లకు రూ. 12 వేల నుంచి రూ. 18 వేలు చేశాం. సెర్ప్‌ గ్రామ వ్యవస్థ సహాయకుడిగా, మెప్మా రిసోర్స్‌ పర్సన్లకు నెలకు రూ. 5 నుంచి 10 వేలు చేశాం. హోంగార్డులకు రూ. 18 వేలు ఉంటే 21,300 పెంచాం. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ. వెయ్యి నుంచి రూ. 3 వేలకు పెంచాం. అంగన్‌వాడీ వర్కర్లకు రూ. 10,500 నుంచి రూ.11,500లు పెంచాం. అంగన్‌వాడీ హెల్పర్లకు రూ. 6 నుంచి రూ. 7 వేలకు పెంచాం.

 

Back to Top