డేటా చోర్‌.. బాబు సర్కార్‌

ఓటర్ల మాస్టర్‌ డేటా చోరీలో లోకేశ్‌ సన్నిహితుడు కిలారి పాత్ర!

గోప్యంగా ఉండే ఓటర్ల మాస్టర్‌ డేటా

కలర్‌ ఫొటోలతో టీడీపీ సేవామిత్ర యాప్‌లో ప్రత్యక్షం

ప్రజాసాధికార సర్వేతో పాటు ఆర్టీజీఎస్‌ డేటా దుర్వినియోగం

ఫైబర్‌ గ్రిడ్‌ కూడా ఇందులో భాగమే

సేవామిత్ర యాప్‌లో నిక్షిప్తం చేసిన వివరాల ఆధారంగా ఎన్నికల ముందు ఓట్ల కొనుగోళ్లకు టీడీపీ వ్యూహం

అమరావతి: ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టైన ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడమే కాకుండా ఈవీఎంలను చోరీ చేసిన కేసులో నిందితుడైన సీఎం చంద్రబాబు సన్నిహితుడు వేమూరు హరిప్రసాద్‌తోపాటు నారా లోకేశ్‌కు ఆప్తుడైన కిలారి రాజేశ్‌ ఇప్పుడు ఏకంగా రాష్ట్రానికి చెందిన మూడున్నర కోట్ల మంది ఓటర్ల మాస్టర్‌ డేటా జాబితాను అపహరించినట్లు వెలుగులోకి వస్తోంది. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ కనుసన్నల్లోనే సాగిందని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారం అండతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఓటర్ల మాస్టర్‌ డేటా జాబితాను చోరీ చేశారనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు సన్నిహితుడైన హరిప్రసాద్‌ ప్రస్తుతం ఫైబర్‌గ్రిడ్, ఆర్టీజీఎస్‌ల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఎలక్ట్రోరల్‌ రోల్స్‌కు సంబంధించిన డేటా ఉండడం నేరమని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

టీడీపీ యాప్‌లోకి ఓటర్ల మాస్టర్‌ డేటా..
ఓటర్ల మాస్టర్‌ డేటా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉండదు. కేవలం ఓటర్ల పేర్లు, వారి చిరునామాలు మాత్రమే ఉంటాయి. ఓటర్ల కలర్‌ ఫొటోలతో కూడిన మాస్టర్‌ డేటాను బయటకు వెల్లడించరు. అలాంటిది ఓటర్ల కలర్‌ ఫొటోలతో కూడిన మాస్టర్‌ డేటా టీడీపీ సేవామిత్ర యాప్‌లోకి చేరిపోవడంపై నివ్వెరపోతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను పోలింగ్‌ కేంద్రాల్లో ఈసీ అందుబాటులో ఉంచుతుంది. కలర్‌ ఫొటోలతో కూడిన మాస్టర్‌ డేటాను ఎన్నికల సమయంలో కూడా బయటపెట్టదు. గతంలో ఓటర్ల జాబితాకు 90 శాతం మేర ఆధార్‌ను అనుసంధానం చేశారు. ఆ తరువాత సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆధార్‌ అనుసంధానాన్ని నిలుపుదల చేయడంతో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కూడా ఆధార్‌ వివరాలు అందుబాటులో ఉండవు. కేవలం మాస్టర్‌ డేటాలోనే ఆధార్‌ వివరాలు ఉంటాయి. ఇప్పుడు టీడీపీ సేవా మిత్ర యాప్‌లో ఆధార్‌ వివరాలతో కూడిన ఓటర్ల జాబితా ఉండటాన్ని బట్టి ఓటర్ల మాస్టర్‌ డేటా జాబితాను కచ్చితంగా చోరీ చేసినట్లేనని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు.

పెదబాబు, చినబాబుల కనుసన్నల్లో..
రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం అందచేసే ఓటర్ల జాబితాల్లో ఆధార్‌ వివరాలు ఉండవు. అలాంటప్పుడు ఆధార్‌ డేటాతో కూడిన మాస్టర్‌ ఓటర్ల జాబితా టీడీపీ సేవా మిత్ర యాప్‌లోకి ఎలా చేరిపోయిందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ మాస్టర్‌ డేటాలోని 910 మంది ఓటర్ల వివరాలను ఒక్కో సేవామిత్రకు, పార్టీ బూత్‌ కన్వీనర్‌కు సేవామిత్ర యాప్‌లో అందుబాటులో ఉంచారు. దీని ద్వారా ఓటర్‌ ఏ కులానికి చెందిన వారనే వివరాలను సేవామిత్ర సేకరించాలి. ఓటర్లు ఆ ఊరులో ఉంటున్నారో లేదో తెలుసుకుంటున్నారు. ఎవరికి ఓటు వేస్తారో సేవా మిత్రలు ఆరా తీసి ఐటీ గ్రిడ్‌కు సమాచారం అందిస్తున్నారు. ఇతర పార్టీలకు ఓటు వేస్తామని చెప్పిన వారి ఓట్లను తొలగించేందుకు ఆన్‌లైన్‌లో పెద్దఎత్తున ఫామ్‌ 7లను సమర్పిస్తున్నారు.

ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ కనుసన్నల్లోనే కొనసాగుతోందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఐటీ గ్రిడ్‌ ఎండీ అశోక్‌ కేవలం నిమిత్తమాత్రుడని, చంద్రబాబు, లోకేశ్‌ చెప్పినట్లు చేస్తారని పేర్కొంటున్నాయి. అశోక్‌ ఎక్కువ సమయం ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్‌ దగ్గరే ఉంటారని, పలుసార్లు సచివాలయంలోని సీఎం కార్యాలయానికి వస్తుంటారని అధికార వర్గాలు తెలిపాయి. అశోక్‌కు సీఎంసన్నిహితుడైన వేమూరి హరిప్రసాద్‌ ఈ వ్యవహారాలను అప్పగించారని సమాచారం.

తాజా వీడియోలు

Back to Top