దేశం ఏమైతే నాకేమిటనే బాబు కొత్త ధోరణి 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

అమ‌రావ‌తి: ఏపీ పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమెరికా నుంచి అమరావతి వరకూ ఏ విషయంపైనైనా అనర్గళంగా మాట్లాడగలరు. తిరుపతి ఎస్వీయూలో ఎంఏ అర్థశాస్త్రం చదివినాగాని తన విస్తృత అనుభవంతో రాజకీయాలపై తనదైన శైలిలో ఆయన విశ్లేషిస్తారు. అవును, రాజకీయ నాయకులు నిరంతరం రాజకీయాలు మాట్లాడడంలో తప్పులేదు. దసరా పండగ పూట బుధవారం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాక చంద్రబాబు గారు ఇదే పనిచేశారు. రాష్ట్ర ప్రస్తుత రాజధాని అమరావతిపై పాలకపక్షమైన వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ వైఖరిపై ఆయన విరుచుకుపడుతూ ఈ విషయంపైనే తన ఆవేదన వెళ్లబుచ్చారు. సతీమణితో కలిసి మహిషాసురమర్దిని దర్శనభాగ్యం పొందిన తెలుగుదేశం అధినేతకు అమరావతి తప్ప మరో విషయం కనపడడం లేదు. ఓ పక్క ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు తన నలభై నెలల పాలనతో రోజురోజుకు జనాదరణ పెంపొందించుకుంటుండగా, చంద్రబాబు గారు మాత్రం అస్తమానం అమరావతి, 2024 అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అంటూ చాలా తొందరలో ఉన్నట్టు కనపడతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు కొత్తగా పెట్టిన జాతీయ పార్టీ భారత్‌ రాష్ట్ర సమితి (బీఆరెస్‌)పై వ్యాఖ్యానించాలని కోరగా, కేసీఆర్‌ మాజీ మిత్రుడు, 2018 డిసెంబర్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పక్షం కాంగ్రెస్‌ కూటమికి ‘ప్రచారకర్త’ అయిన టీడీపీ అధ్యక్షుడు ఒక్క మాటా చెప్పకుండా చిరునవ్వునే జవాబుగా విసిరారు. ఒకప్పుడు దేశ రాజధాని  ఢిల్లీలో ‘చక్రం తిప్పాను’ అని చెప్పుకున్న గ్లోబల్‌ లీడర్‌ చంద్రబాబు నాయుడు గారు నేడు పండగపూట కూడా ధైర్యంగా తెలంగాణ నేత పెడుతున్న పార్టీపై వ్యాఖ్యానించడానికి భయపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేసీఆర్‌ జాతీయ పార్టీ బీఆరెస్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ వైఖరి అవలంభిస్తుందోననే అలజడి ఆయనలో కనిపిస్తోంది. తోటి ప్రాంతీయపక్షం నాయకుడు కేసీఆర్‌ గారు ఎంతో ఆర్భాటంగా జాతీయ పార్టీ ఆరంభంపై ప్రకటన చేయడంపై చంద్రబాబు గారు ముచ్చటించడానికి పదాలు కరవయ్యాయి. జాతీయ రాజకీయాల్లో తనకు ఎలాంటి పాత్రా వద్దనుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి గారికి అమరావతే స్వర్గసీమ. అందుకే ఎప్పుడూ దాని గురించే ఆయన ఆరాటం, పోరాటం. దేశం ఏమైతే నాకేమిటనే కొత్త ధోరణి.

Back to Top