రాజధాని భూములు తాకట్టు!

బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్ల అప్పు తీసుకోవాలని నిర్ణయం 

సీఆర్‌డీఏ కమిషనర్‌కు అధికారాలు కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ  

ఇప్పటికే సీఆర్‌డీఏ బాండ్ల పేరుతో రూ.2,000 కోట్ల అప్పులు చేసిన సీఆర్‌డీఏ

అమ‌రావ‌తి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూసమీకరణ పేరిట రైతుల నుంచి లాక్కున్న వేలాది ఎకరాల భూములను తాకట్టు పెట్టి, బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని భూములను తాకట్టు పెట్టి, అప్పులు తీసుకునే అధికారాలను సీఆర్‌డీఏ కమిషనర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌ శుక్రవారం జీవో 27 జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే భూములను తాకట్టు పెట్టే అధికారం సీఆర్‌డీఏ కమిషనర్‌కు సంక్రమించింది. అలాగే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులైన రహదారులు, మంచినీటి సరఫరా, సీవరేజ్, పార్కులు, ఇతర ప్రాజెక్టులకు అవసరమైన భూములను కాంట్రాక్టు సంస్థలకు కేటాయించే అధికారాన్ని కూడా సీఆర్‌డీఏ కమిషనర్‌కు ఈ జీవో ద్వారా ప్రభుత్వం కట్టబెట్టింది. 

అప్పులు తెచ్చుకోవాలంటున్న ముఖ్యమంత్రి 
రాజధాని భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టడంతోపాటు సెక్యూరిటీగా పెట్టి సీఆర్‌డీఏ అప్పులు చేయనుంది. ఈ విధంగా భూములను తాకట్టు పెట్టి, రూ.వేల కోట్ల అప్పులు చేయాలని నిర్ణయించడంపై అధికార వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో ఏ రంగం, ఏ శాఖలో చూసినా అప్పు అనే పదం తప్ప మరొకటి వినిపించడం లేదని, ఆస్తులను తాకట్టు పెట్టేసి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచిస్తున్నారని, దీంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిపోతోందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా ఆర్థిక శాఖ అనుమతితోనే ప్రభుత్వ శాఖలు అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఏకంగా గంపగుత్తగా ఆ అధికారాన్ని సీఆర్‌డీఏకు అప్పగించడం సరైంది కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

సీఆర్‌డీఏ సమావేశాలకు ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తున్నారని, సొంతంగా నిర్ణయాలు తీసేసుకుని సంబంధిత శాఖలు, ఆర్థిక శాఖకు పంపిస్తున్నారని, ఇలా చేయడం బిజినెస్‌ రూల్స్‌కు విరుద్ధమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు బ్యాంకుల నుంచి సీఆర్‌డీఏ రూ.10,000 కోట్ల అప్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. అయితే, ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినప్పటికీ ఆస్తులను చూపించకపోతే అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి తీసుకున్న వేలాది ఎకరాల భూములను తాకట్టు పెట్టి లేదా సెక్యూరిటీగా చూపించి అప్పులు చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ఇప్పటికే సీఆర్‌డీఏ బాండ్ల పేరుతో రూ.2,000 కోట్ల అప్పులు చేసింది. ఇప్పుడు మరో రూ.10,000 కోట్ల అప్పులు తెచ్చుకునేందుకు సన్నద్ధమైంది.  

 

Back to Top