మోదీతో పొత్తుకు బాబు దొడ్డిదారి ప్రయత్నాలు

బీజేపీలోకి గంపగుత్తిగా చేరిన ఎంపీలు వీలైనంతగా చంద్రబాబు భజన చేస్తూ, కుల నాయుడి సాయంతో మరోసారి మోదీ ప్రాపకం సాధించి బాబు మోదీల బంధం కలిపేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. కానీ తన వందరోజుల పాలన తర్వాత కేబినెట్ విస్తరణ చేస్తున్న ప్రధాని మోదీ జంపిగ్ జపాంగ్ లకు స్థానం లేదని తేల్చేసారు. దాంతో సీఎం రమేష్, సుజనా చౌదరి పప్పులు ఉడకన‌ట్టైంది. 
వీళ్లిద్దరి సాయంతో వెంకయ్యనాయుడి సిఫార్సులతో మళ్లీ మోదికి దగ్గరవ్వాలన చంద్రబాబు ఆశలు అడియాశలే అయ్యాయి. నోటికొచ్చినట్టు తిట్టి, తన మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రధానిని విచక్షణా రహితంగా తిట్టించిన చంద్రబాబు గతాన్ని మర్చిపోయి, తన అవసరానికి కాళ్లబేరానికి వచ్చుండచ్చు. కానీ బాబును క్షమించే ఉద్దేశ్యం మోదీకి లేదని తేటతెల్లం అయిపోయింది. 
బ్యాంకు దొంగ సుజనా, బినామీ సీఎం రమేష్ లు కేసుల విముక్తి సంగతేమో కానీ బీజేపీ నేతలు చాలామంది వీరిపై గుర్రుగా ఉన్నారన్నది వాస్తవం. బీజేపీలో చేరినంత మాత్రాన నేరస్థులు సచ్ఛీలురు కాలేరంటూ ఎద్దేవా చేస్తున్నారు కమలం నేతలు. టీడీపీ నుంచి ఫిరాయించిన ఎంపీలు తమపై ఉన్న కేసులను, విచారణలను ఎదుర్కోవాల్సిందే అన్నారు బీజేపీనేత విష్ణువర్థన్ రెడ్డి.  
100 రోజుల పాలనతో మరోసారి పట్టుబిగించుకుని కేబినెట్ విస్తరణకు సిద్ధపడుతున్నారు నరేంద్రమోది. ఇప్పటికే తెలంగాణా నుంచి కిషన్ రెడ్డి కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. ఏపీకి ఇంతవకూ ప్రాతినిధ్యం లేదు. విస్తరణలో మాత్రం ఏపీకి స్థానం ఉంటున్న నేపథ్యంలో కేబినేట్ రేసులో కొందరి పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ, జీవీఎల్ నరసింహారావులకు అవకాశం దక్కచ్చని ఓ అంచనా. టీడీపీ నుంచి సుజనాకి మంత్రి పదవి ఇస్తారని టీడీపీ తెగ ప్రచారం చేయాలనుకుంది కానీ బీజేపీ నేతల నెగిటివ్ కామెంట్స్ తెలుగు తమ్ముళ్ల ఆశలకు గండి కొట్టాయి. అందుకే బాబు తన నేరచరిత ఎంపీల పేర్లు పక్కకు పెట్టి సురేష్ ప్రభు పేరు తెరపైకి తెస్తున్నాడు. ఏపీ కోటాలో రాజ్యసభ సభ్యుడైన సురేష్ ప్రభు గతంలో రైల్వే మంత్రిగా పనిచేసారు. విమానయానశాఖా మంత్రి అశోక్ గజపతిరాజు రాజీనామా తర్వాత ఆ శాఖను కూడా నిర్వహించాడు. సురేష్ ప్రభుతో పాటు రాం మాధవ్ పేరు కూడా అమిత్ షా పరిశీలనలో ఉందంటున్నారు. 
నిజానికి చంద్రబాబుకు అనుకూలంగా ఉండే సుజనాకు అవకాశం ఇవ్వకపోవడం ద్వారా బీజేపీ టీడీపీతో పొత్తుకు సిద్ధంగా లేనన్న సంకేతాలు ఇచ్చేసింది. అయితే సురేష్ ప్రభు కి మాత్రం తప్పక అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తోంది. అవ్వడానికి బీజేపీ నేతే అయినా టీడీపీకి, చంద్రబాబుకు సపోర్టర్ గానే ఉన్నారు సురేష్ ప్రభు. 2018లో మోదీతో యుద్ధం అంటూ చంద్రబాబు హడావిడి చేస్తున్న సమయంలో, తన మంత్రులతో, ఎంపీలతో ప్రధాని మోదీపై అనుచిత వాఖ్యలు చేయిస్తున్న సమయంలో కూడా సురేష్ ప్రభు విశాఖ భాగస్వామ్య సదస్సుకు వచ్చి మరీ చంద్రబాబును పొగిడి వెళ్లాడు. ఓ పక్క నాటి బీజేపీ మంత్రులు చంద్రబాబును విమర్శిస్తుండగా సురేష్‌ ప్రభు మాత్రం బాబును తెగ భజన చేసాడు. 
ఫిరాయింపు ఎంపీలతో మోదీని ఒప్పించలేమని అర్థమయ్యాకే బాబూ ఈ దొడ్డిదారి ప్రయత్నాలు మొదలెట్టాడు. తనకు సన్నిహితులైన బీజేపీ నేతల ద్వారా సంధి ప్రయత్నాలకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. అందరిదృష్టీ ఫిరాయింపు ఎంపీల మీద ఉంటుంది కాబట్టి తనకు అనకూలమైన కమలం నేతలతో పాటు, వెంకయ్యనాయుడి సారధ్యంలో మోదీని ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడు చంద్రబాబు. వీలైనంత త్వరగా ప్రధానిని ప్రసన్నం చేసుకోకుంటే తన కేసులు, తన పార్టీ ఎంపీల పై ఉన్న కేసులూ కదులి కంఠానికి బిగుసుకుంటాయన్న బెంగ చంద్రబాబును నిద్రపోనీయడంలేదు. 

Back to Top