ఏడు రోజుల పాటు చెరువు వ‌ద్దే ఎమ్మెల్యే చెవిరెడ్డి

 రాయల చెరువుకు మరమ్మతులు పూర్తి అయ్యే వ‌రకు అక్క‌డే మ‌కాం 
 
చెరువు కట్ట లీకేజీల మరమ్మతులకు సీఎం వైయ‌స్‌ జగన్ చొరవ 

చిత్తూరు:   ‘నాయకుడంటే కుర్చీలో కూర్చుని సిద్ధాంత చర్చ చేసేవాడు కాదు. నాయకుడంటే జనాన్ని ఊపేసే ఉపన్యాసాలు దంచేవాడు కాదు. సంవత్సరానికి రెండు ధర్నాలు, మూడు మీటింగులు, ఆరు సభలు నిర్వహించినంత మాత్రాన జనం నీ వెంట నడువరు, నువ్వు జనంలో కలిసిపోవాలి, నిత్య పోరాటమయంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి, అనునిత్యం ఆదర్శప్రాయమైన జీవితాన్ని సాగించాలి.’’ ఇదే సిద్ధాంతాన్ని న‌మ్ముతారు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి.  నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు క‌ష్టం వ‌చ్చిందంటే ప‌రిష్క‌రించే వ‌ర‌కు ప‌ట్టు వీడ‌ని నిజ‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. దానికి తాజా ఉదాహ‌ర‌ణ ఇది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి రాయల చెరువు కూడా పరవళ్లు తొక్కింది. అయితే లీకేజీలు ఏర్పడడంతో దిగువ ప్రాంతాన ఉన్న గ్రామాల ప్రజలు హడలిపోయారు. భారీ విస్తీర్ణంలో ఉన్న చెరువు కావడంతో, తెగిందంటే ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోతాయి.

ఈ నేపథ్యంలో వైయ‌స్ఆర్‌ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాయల చెరువు లీకేజీలకు మరమ్మతు చేయించడాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా భావించారు. ఈ క్రమంలో ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా రాయల చెరువు వద్దనే ఉంటూ మరమ్మతులు పూర్తి చేయించారు.  పనులన్నీ పూర్తి కాగా, ఏడు రోజుల తర్వాత ఆయన ఇంటికి చేరుకున్నారు. అది కూడా, నిర్వాసితులందరూ ఎంతో భరోసాతో ఇళ్లకు చేరుకున్న తర్వాతే ఆయన తన ఇంటికి బయల్దేరారు.

రాయల చెరువు లీకేజీల మరమ్మతు సందర్భంగా మొదటి రోజు నుంచి చెవిరెడ్డి చెరువు కట్టపైనే శిబిరంలో బస చేశారు. లీకేజీలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసే క్రమంలో ఆయన ప్రతి పనిని పర్యవేక్షించారు. మరమ్మతులు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పశువులతో సహా పునరావాస కేంద్రాలకు వెళ్లిన రామచంద్రాపురం మండల పరిధిలోని 25 గ్రామాల ప్రజలు తిరిగి ఇళ్లకు రావాలని విజ్ఞప్తి చేశారు.

రాయల చెరువు కట్ట లీకేజీల మరమ్మతులకు సీఎం వైయ‌స్‌ జగన్ ఎంతో చొరవ చూపించారని, వైయ‌స్ జగన్ ఆదేశాలతో చెన్నై, తిరుపతి ఐఐటీల ప్రొఫెసర్లు, నీటిపారుదల రంగ నిపుణులు తమ సేవలు అందించారని చెవిరెడ్డి వెల్లడించారు. అందరి సహకారంతో రాయల చెరువు మరమ్మతులు నిర్వహించామని, సమస్యను గుర్తించి లీకేజీలకు అడ్డుకట్ట వేశామని తెలిపారు. 120 మంది నిపుణులు, 453 మంది కార్మికులు వారం రోజుల పాటు రేయింబవళ్లు శ్రమించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేశామని వివరించారు.

కాగా, పనులు పూర్తయిన పిమ్మట చెవిరెడ్డి చెరువుకు పూజలు నిర్వహించి ఇంటికి బయల్దేరారు. దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉన్న రాయలచెరువు ఏపీలో ఉన్న అతి భారీ చెరువుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top