మిషన్ ఇంపాజిబుల్

రాబోయే ఎన్నికల కసరత్తు గురించి మీటింగ్ పెట్టారు చంద్రబాబు. కానీ దాని గురించి కంటే ప్రతిపక్షం మీద తన అక్కసు వెళ్లగక్కడానికే ఆ టెలీకాన్ఫరెన్సును ఉపయోగించుకున్నారు. ఏపీ అంటే మోదీకి, కేసీఆర్ కి, జగన్ కి అసూయ అని తేల్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మరి అంతటి అసూయాపరుడి పొత్తుకోసం బాబుగారు ఎందుకు వెంపర్లాడినట్టు? హరికృష్ణ శవం ముందే కేసీఆర్, కేటీఆర్ లతో పొత్తు గురించి చర్చించడం తప్పేమీ కాదంటూ సమర్థించుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ అసూయాపరుడుని అంటున్నాడు. 15ఏళ్ల ప్రత్యేక హోదా కంటే ఎక్కువే బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఇచ్చింది అన్న నోటితోనే మోదీ అసూయా పరుడు అని ఎలా పేలగలుగుతున్నాడు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన ఏ అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నేత అసూయ పడిపోవాలని బాబుగారి ఉద్దేశ్యం? అవసరానికోలా మాట్లాడే బాబు ఊసరవెల్లి తత్వం గురించి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవ్వరినడిగినా చెబుతారు.

ఇక ఫెడరల్ ఫ్రంట్ గురించి బాబు చౌకబారు మాటలు విన్న ఎవరికైనా చిరాకు తెప్పించేలా ఉన్నాయి. బీజేపీ అజెండా అమలుకే ఫెడరల్ ఫ్రంట్ అని చంద్రబాబు పదేపదే అదే అబద్ధాన్ని ప్రచారం చేయాలని తెగ తాపత్రయ పడుతున్నాడు. అసలు ఫెడరల్ ఫ్పరంట్ కు స్పందనే లేదు అంటున్నాడు. మరి మహా కూటమి అంటూ చంద్రబాబు తెలంగాణాలో హడావిడి చేసినా స్పందనలేకపోయిందని ఇదే సమయంలో ఒప్పుకోవడం లేదు. బిజేపీ వ్యతిరేక శక్తులమంటూ కాంగ్రెస్, టీడీపీ మరికొందరు కలిసిన ఫ్రంట్ ను తెలంగాణా ప్రజలు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు. రేపు ఫెడరల్ ఫ్రంట్ విషయంలోనూ ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. కూటమి రాజకీయాలు తాము మాత్రమే చేయాలని, పొత్తులు తాము మాత్రమే పెట్టుకోవాలని, వేరే ఏ పార్టీ ఆ ప్రయత్నం చేసినా అది రాజకీయ లబ్ది అని అంటాడు చంద్రబాబు. 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిళ తనపై జరిగే ట్రోలింగ్ కు కారణం తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలే అంటూ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. దీన్నిసైతం బాబు తిమ్మిని బమ్మిని చేయాలని ప్రయత్నం చేసాడు. అసలు సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసేది వైసీపీనే అంటూ వితండవాదం మొదలు పెట్టాడు. తమ పార్టీలో స్వయంగా చంద్రబాబు నుంచి మొదలు పెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల వరకూ అందరూ అసభ్యకరంగా మాట్లాడతారనే వాస్తవాన్ని పాతిపెట్టాడు. పవిత్రమైన అసెంబ్లీలో కూడా బూతులు, తిట్లు ఎత్తుకునే రౌడీయిజం, ప్రతిపక్ష మహిళా నాయకురాలిని దూషించిన చరిత్ర తమ పార్టీ నాయకులదే అన్న సంగతి మాటవరసకు కూడా ఒప్పుకోడు చంద్రబాబు. మొత్తానికి ఎలక్షన్ మిషన్ 2019 కాన్ఫరెన్సు కాస్తా చంద్రబాబు ఆందోళనలు ప్రకటించే వేదికగా మిగిలిపోయింది. 2019 మిషన్ ఇంపాజిబుల్ అని అందరికీ తెలిసిపోయింది. 
 

Back to Top