మే 31న ఉద్యోగ క్యాలెండర్‌

ఖాళీల భర్తీకి కసరత్తు

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా చేయనున్న ప్రభుత్వం

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శాఖల వారీగా క్యాలెండర్‌.. మే 31న విడుదల

అన్ని శాఖల్లో ఖాళీల లెక్క తేల్చాలని సీఎస్‌ ఆదేశాలు

అన్ని శాఖలు ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌కు వివరాలు త్వరగా పంపాలి

డైరెక్టర్‌ ఆఫ్‌ పోస్ట్స్‌ అండ్‌ పర్సనల్‌ విభాగంలో వివరాల నమోదు

ఈ ప్రక్రియ పూర్తయితే.. పదోన్నతుల ఖాళీల వివరాలు ఆన్‌లైన్‌లో చూసే అవకాశం

 అమరావతి: ప్రభుత్వ శాఖలు, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసి, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అవసరమైన ఉద్యోగాల భర్తీకి శాఖలు, విభాగాల వారీగా క్యాలెండర్‌ రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో ఉద్యోగాల ఖాళీల వివరాలను తేల్చాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆదేశించారు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఖాళీల భర్తీకి సంబంధించి సీఎస్‌ ఇటీవల అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో ఎప్పటికప్పుడు ఖాళీల వివరాలను, అవసరమైన పోస్టుల భర్తీ వివరాలను డైరెక్టరీ ఆఫ్‌ పోస్ట్స్‌ అండ్‌ పర్సనల్‌ విభాగంలో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టులు ఎన్ని ఉన్నాయి.. అందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కలు తేల్చాలని స్పష్టం చేశారు. ఆ లెక్కలు ఆధారంగా అవసరమైన పోస్టులను దశల వారీగా భర్తీ చేసేందుకు ప్రణాళిక బద్ధంగా క్యాలెండర్‌ రూపొందించి మే 31న విడుదల చేస్తారని చెప్పారు. ఇందుకోసం గ్రూప్‌ 1, 2, 3, 4 కేటగిరీల్లో పోస్టుల ఖాళీలను లెక్క తేల్చాలని సూచించారు. అనంతరం సంబంధిత శాఖ కార్యదర్శి ఆమోదంతో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సీఎస్‌ ఇంకా ఏం చెప్పారంటే.. 
 
లోతుగా పరిశీలించి వివరాలు ఇవ్వాలి

  • గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు బాధ్యతలు, అధికారాలను వాటికి బదిలీ చేయనున్న నేపథ్యంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టుల భర్తీ ఆవశ్యకత గురించి లోతుగా పరిశీలించాలి. 
  • రాష్ట్ర విభజన అనంతరం కొన్ని శాఖలు, విభాగాల్లో క్షేత్ర స్థాయిలో సిబ్బందికి పని తక్కువైన నేపథ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 
  • విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో ఖాళీల వివరాలను హెచ్‌ఆర్‌ఎంఎస్‌లో పొందు పరచాలి. బ్యాక్‌లాగ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టుల ఖాళీలను కూడా పొందుపరచాలి.  
  • ఖాళీగా ఉన్న డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టుల్లో ప్రాధాన్యత క్రమంలో ఏ ఏ పోస్టులు ఎన్ని భర్తీ చేయాలో  సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు సూచించాలి.  
  • అన్ని శాఖలకు చెందిన పోస్టులు, ఖాళీలు, భర్తీ వివరాలన్నీ కూడా ఒకే చోట తెలిసేలా డైరెక్టర్‌ ఆఫ్‌ పోస్ట్స్‌ అండ్‌ పర్సనల్‌ డాస్‌బోర్డ్‌లో లభ్యమవ్వాలి.  
  • ఈ ప్రక్రియ పూర్తయితే పదోన్నతుల రూపంలో ఎన్ని ఖాళీలున్నాయనే వివరాలను ఆన్‌లైన్‌లో నేరుగా చూసే అవకాశం ఉంటుంది.    
     
Back to Top