మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా రాష్ట్ర బీజేపీ కీలక నేత వాఖ్యలు

ఆలయాలను క్వారంటైన్ కేంద్రాలు చేస్తారా అంటూ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడటం విచారకరం. దేశమే కాదు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడేందుకు ఒక్కతాటిపైకొస్తుంటే, ఏపీలో మాత్రం కులం, మతాల పేర్లతో రాజకీయం చేయాలని కొందరు స్వార్థపరులు కుయుక్తులు పన్నుతున్నారు. ఇది అత్యంత దురదృష్టకరం.
ఆలయాలను ఎక్కడా క్వారంటైన్ కేంద్రాలుగా మార్చలేదు. కానీ కావాలనే ఉద్దేశపూర్వకంగానే కన్నా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నది స్పష్టం. ప్రతిపక్షాలుగా ఉనికి చాటుకోవడానికి ఇంత నీచానికి దిగజారవలసిన అవసరం లేదు. కాణిపాకంలో వసతి గృహాన్ని క్వారంటైన్ కేంద్రంగా చేస్తే దాన్ని ఆలయంలోనే క్వారంటైన్ చేస్తున్నారనడం దారుణం.
విపత్తు సమయంలో స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, ప్రభుత్వ భవనాలు వంటివి వినియోగించుకోవడం పరిపాటి. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు (అవి ఏ మతానికి సంబంధించినవి అయినాసరే) కూడా ముందుకొచ్చి తమ భవనాల్లో ఆశ్రయం కల్పిస్తుంటాయి. అదే విధంగా కాణిపాకంలోని యాత్రికుల వసతి గృహాన్ని వినియోగిస్తే ఆలయంలోనే క్వారంటైన్ కేంద్రం ఏర్పాటైందంటూ అసత్య ప్రచారం చేయడం, రాష్ట్రంలో ప్రజల మనోభావాలతో ఆడుకోవడం హేయమైన చర్య.
నిజానికి ఇలాంటి తప్పుడు ప్రచారంతో ప్రభుత్వంపై బురదచల్లాలనుకోవడం, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా ప్రవర్తించడాన్ని నేరాలుగా పరిగణిస్తూ, కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కనుక ఏ పార్టీ నేతలైనాసరే ఈ విషయంలో ఉపేక్ష ఉండదని గుర్తించాలి.
కష్టకాలంలో ప్రజలకు వెన్నుదన్నుగా ఉండాల్సింది పోయి నీచరాజకీయాలతో పరిస్థితిని దిగజార్చవద్దని అన్ని పార్టీల నేతలకూ సూచించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.  

 

Back to Top