మరోసారి బాబు బుట్టలో పడదామా? సరైన తీరుగా ఓటేద్దామా?

జాతీయ ఓటరు దినోత్సవం

ఓటెయ్యడమంటే...మన తలరాతను రాసుకోవడమే. అవును ... ఆ ఓటుతోనే కదా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడేది. ప్రభుత్వాలను బట్టే కదా వ్యవస్థలు నడిచేది. వ్యవస్థలను బట్టే కదా ప్రజాజీవితాల్లో అవస్థలో...అవస్థలో తప్పడమో జరిగేది.
ప్రజలకోసం...ప్రజలందరి చేత..ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వం ...అని ప్రజాస్వామిక స్పూర్తిని రగిలిస్తూ...అద్భుతమైన మాట చెప్పారు. కానీ, దురదృష్టవశాత్తూ ...అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని ఘనంగా చెప్పుకునే మన దగ్గర...ఓటేసేంతవరకే ఓటరు దేవుడు. అపై అంతా రాజకీయనాయకుల మయమే. వారే ప్రభువులు. పాలకులు. ప్రజలు కేవలం పాలితులే. 
ప్రజాసంక్షేమం పట్ల చిత్తశుద్ది లేకున్నా, రాష్ట్రాభివృద్దికో, దేశాభివృద్దికో నిజాయితీ పనిచేయకున్నా...అంతా నష్టమే. వ్యవస్థలు దెబ్బతినడమే. ఇక అవినీతి చీడ ప్రబలితే...ప్రజల జీవితాలు అల్లకల్లోలమే.
జాతీయ ఓటరు దినోత్సవం వేళ....
మన రాష్ట్రం గురించి కాస్త ఆలోచిద్దాం. నిజంగా ఓరకంగా పసిగుడ్డులాంటి రాష్ట్రం. విభజన తర్వాత దిక్కులు చూడాల్సిన సందర్భం దాపురించిన సమయం. పంచాయితీ పెద్దగా వ్యవహరించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలెన్నో....తర్వాత ప్రభుత్వం మారింది. ఏపీ తలరాత మారింది. దానికి తగ్గట్టే ఏపీలో ఏర్పడ్డ ప్రభుత్వం నిరంతరం రాజకీయాలను నడపడంతోనే సరిపెట్టడంతో, రాష్ట్రం పరిస్థితి ఇప్పటికీ దిక్కులు చూడటమే. ఏవైనా పనులు జరిగాయంటే అన్నీ తాత్కాలికమనుకోవాల్సిందే. మళ్లీ ఎన్నికలు ముంచుకొచ్చేసరికి...మళ్లీ తామే రావాలని...ప్రజల్ని మరింత పీడించాలనుకున్నారో ఏమో...మభ్యపెట్టే మాటలు చెబుతున్నారు. దొంగహామీలు గుప్పిస్తున్నారు. అరకొరగా తాయిలాలు పంచుతున్నారు. పని జరుగుతుందనుకుంటే...పోస్ట్‌డేటెడ్‌ చెక్కులివ్వడానికైనా రెడీ అయిపోయారు. ఇదంతా పక్కన పెడదాం. ఓటు కావాలి...గాలం వేయాలి అన్న సిద్దాంత రాజకీయాన్ని తప్పుపట్టలేం. కానీ గాలానికి చిక్కుకున్న చేప ఎలా విలవిల్లాడిపోతుందో...సరైన చోట ఓటు పడకపోతే ఓటరు పరిస్థితీ అదేగా మరి!
ఎవరి పాపమో, మరెవరి శాపమో...ఏపీ కథ మళ్లీ మొదటికొచ్చింది. మొదటి మెట్టుదగ్గర నుంచి మొదలవ్వాలన్న కనీస విచక్షణను మరిచి ...గాల్లో చక్కర్లు కొట్టడం, గ్రాఫిక్స్‌ మాయాజాలంతో కాలం నెట్టేయడంతోనే ఐదేళ్లూ సరిపోయాయి. అంటకాగిన బీజెపీ ఇప్పడు శత్రువట. ఏపీని విడదీసిన కాంగ్రెస్‌ మిత్రుడట. బాబు గారు ఏది చెబితే అదే నిజం. ఆబద్దమైనా నిజమనుకోవాల్సిందే. అనుకునేదాకా ...వదిలిపెట్టరు. ఆయన రాజకీయానికి కష్టమొస్తే...అది ప్రజల కష్టం కావాల్సిందే. ఆయన రాజకీయం లాభసాటిగా నడిస్తే మాత్రం...ప్రజల గురించి పట్టించుకోరు. రాష్ట్రానికి ఏమన్నా చేద్దాం అనుకోరు. కాకపోతే, దాదాపు నాలుగేళ్లకు పైగా ...బీజేపీనే అంటిపెట్టుకున్న ఆయన ఇప్పుడు...ఈరోజు దాకా మనకేమీ ఇవ్వలేదంటున్నారు. ఏమీ ఇవ్వలేదన్నది తెలుసుకోవడానికి...నలభైఏళ్ల సీనియారిటీకి ఇంతకాలం పట్టిందా? లేక తన చాపకిందకు నీళ్లు వస్తున్నాయని తెలిశాకే...ప్రజలకు ఆ బూచి చూపించేయడం చేస్తున్నారా? ఆలోచించాల్సింది ప్రజలే. ఇప్పుడు ఏపీ ప్రజలకు కావల్సింది. తమకు గురించి ఆలోచించేవారు. రాష్ట్రం గురించి ఆలోచించేవారు. విభజన సమయంలో చెప్పినవాటిని అడిగి తెచ్చేవారు. సాధించేవారు. ఇప్పటిదాకా అవేవీ చేయలేకపోవడానికి కేంద్రమే కారణమని, అయినా...తానొక్కడే రోబోలాగో...సూపర్‌మేన్‌లాగో బండిని ఇంతకాలం లాక్కొచ్చానని బాబుగారు చెబుతున్నారు. ఆయనను అలాగే లాగనిస్తే...మరో పదిహేను ఇరవై ఏళ్లలో రాష్ట్రాన్నే నెంబర్‌ వన్‌ చేస్తారట. హతవిధీ...పదిహేనేళ్లలో అగ్రగామి రాష్ట్రంగా మార్చే సత్తా వున్న నాయకుడు...ఈ నాలుగేళ్ల తొమ్మిదినెలలుగా ఎందుకంత తాత్కాలిక కట్టడాలతో,...వైఎస్‌ హయాంలో ఎనభైతొంభైశాతం పనులు పూర్తయిన ప్రాజెక్టుల అరకొరపనులు కానిచ్చేసి...అదే చాలా గొప్పని చెప్పుకుంటున్నారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించేసి, 108, 104లను షెడ్డులకు తోలేసి, విద్యాలోకాన్ని ఫీజురీయింబర్స్‌మెంట్‌ గుబులుపుట్టించేసి, ప్రభుత్వ పాఠశాలలను నీరు గార్చేసి, సంక్షేమ హాస్టళ్లు కునారిల్లిపోయేలా చేసి...ప్రభుత్వపాఠశాలల్ని మూతేయిస్తూ.....రైతుల్ని నట్టేట ముంచి, అతివృష్టి, అనావృష్టి బాధిత రైతులను గాలికొదిలేసి...చక్కర్లు కొట్టేస్తూ గడిపిన బాబు చేయగలిగినన్ని అప్పులు రాష్ట్రం నెత్తిన మోపారు. తన వందిమాగధసందోహాన్ని, అనుచరగణాన్ని రాష్ట్రం మీదకు వదిలేసి...కోట్లకు పడగలెత్తేలా చేసేశారు. భూముల విషయంలో పేద, దళిత అన్న తేడాలేకుండా గద్దల్లా వాలిపోయి తన్నుకుపోయేలా చేశారు. ఆ కష్టం ఎందుకనుకుంటే...తనే ఆయా పథకాల పేరుతో పందేరం చేశారు. ఏరకంగా చూసినా...బాబుగారి పాలనంతా ప్రజల గురించి పెద్దగా ఆలోచించినట్టు కనిపించదు. అభివృద్ది చేయాలని, ఆ ఫలాలు ప్రజలకు అందించాలని తాపత్రయపడినట్టూ కనిపించదు. గాల్లో దీపాల్లా వేలాడుతున్న సంక్షేమ పథకాల సాక్షిగా....బాబు పాలన కాలం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యకాలం. ఆయన రాజకీయాల్లో దిట్ట కావచ్చు కానీ...ప్రజాపాలనలో ఏమాత్రం కాదన్నది ఏ సామాన్యుడి సణుగుడులోనైనా ధ్వనించే సత్యం. 
ఈ జాతీయ ఓటరు దినోత్సవం రోజు సాక్షిగా.....
ఏపీ ఓటరు అటు అధికారపక్ష నేత పనితీరు బేరీజు వేయాలి...ఇటు విపక్షనేత గురించి ఆలోచించాల్సిన తరుణమిది. వ్యక్తిత్వాలు బేరీజు వేయాలి. విలువల తూకం వేయాలి. విశ్వసనీయతను కొలవాలి. మార్పును కోరితీరాలి. మంచిమార్పును స్వాగతించాలి. నిజమైన ప్రజాప్రభుత్వం...మనందరి ప్రభుత్వం కోసం.... మన విజ్ఞతను ఓటేసేరోజు ప్రకటించాలన్న చురుకైన ఆలోచన చేయాలి ఏపీ ఓటరు. ఇది కలనైనా మరవకూడని కర్తవ్యం.  
 

Back to Top