మనసున్న మా రాజు వైయస్‌ జగన్‌

తమిళనాడుకు తాగునీరు ఇచ్చేందుకు ఏపీ సీఎం అంగీకారం 
 

అమరావతి : రాజు మంచి వాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందంటారు. అయితే ఈ రాజు మంచితనం వల్ల తన రాజ్యమే కాదు..ఇతర రాజ్యాలు కూడా సుభిక్షంగా ఉండే పరిస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెన్నై ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతుంటే..వారికి నీరిచ్చి ఆదుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.  చెన్నై ప్రజల గొంతు తడిపి వారి కష్టాలు తీర్చాలని విఙ్ఞప్తి చేసిన తమిళనాడు మంత్రుల బృందం అభ్యర్థన పట్ల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. తాగునీటి కోసం లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు చెన్నైకి తాగునీటి విడుదలకై అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరాభావంతో మెలగాలని తమిళనాడు మంత్రుల బృందంతో సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. ఒకరి కష్టాల్లో ఇంకొకరు పాలు పంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

కాగా తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిసామి ఆదేశాల మేరకు మున్సిపల్‌ శాఖా మంత్రి గణేశన్, మత్స్యశాఖ, పాలనా సంస్కరణల శాఖా మంత్రి జయకుమార్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ మనివాసన్‌ శుక్రవారం సీఎం వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తాగునీటి కొరతతో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని మంత్రులు విఙ్ఞప్తి చేశారు. తాగడానికి నీళ్లులేక 90 లక్షల మంది చెన్నై ప్రజలు అల్లాడుతున్నారని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆయన సానుకూలంగా స్పందించడంతో తమిళనాడు మంత్రుల బృందం ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు తెలిపింది. అడగగానే మానవత్వంతో స్పందించారంటూ మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.
 

తాజా వీడియోలు

Back to Top