మ‌హానేత‌.. నిను మ‌రువ‌లేం

సెప్టెంబర్ 2 డాక్టర్ వై.య‌స్.రాజశేఖర్ రెడ్డి గారి 12వ వర్థంతి సందర్భంగా వినమ్ర శ్రద్ధాంజలి

రైతు సంక్షేమానికి పెద్ద‌పీట వేసిన వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 

జ‌ల‌య‌జ్ఞంతో బీడు భూములు స‌స్య‌శ్యామ‌లం

దేశానికే ఆద‌ర్శంగా ఉచిత విద్యుత్ , ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాలు

అందుబాటులో పేద‌ల‌కు కార్పొరేట్ వైద్యం  

వైయ‌స్ఆర్ ఐదేళ్ల పాల‌న‌లో  సామాన్యుడికి చార్జీల మోత లేదు..ప‌న్నుల భారం లేదు 

సంక్షేమం, అభివృద్ధి కోసం నాన్న వైయ‌స్ఆర్ ఒక్క‌  అడుగు వేస్తే వైయ‌స్ జ‌గ‌న్ రెండు అడుగులు వేస్తున్నారు

మ‌హానేత పేరుతో అనేక సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు

అమ‌రావ‌తి: రైతు తన పంటకు మా ముఖ్యమంత్రి ఉన్నాడు అనే భరోసా, వైద్యానికి మా ముఖ్యమంత్రి ఉన్నాడని భరోసా, పిల్లల విద్యకు మా ముఖ్యమంత్రి ఉన్నాడనే భరోసా, వృద్ధాప్యంలో మా ముఖ్యమంత్రి ఉన్నాడని భరోసా ఇచ్చిన ఏకైక దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు. అభివృద్ధి, సంక్షేమము తన రెండు కళ్లుగా పాలన గావించిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వై.య‌స్.రాజశేఖర రెడ్డి గారు. నాన్న పాలనలో రైతులుగా మా ఇంట ప్రతిరోజూ ఓ సంక్రాంతి పండుగలా సాగిందయ్యా. ఆ రోజులు మరలా నీ ద్వారా రావాలని కోరుకుంటున్నాం. రైతుల గుండెలలో చిరంజీవిగా మిగిలిన ఆ మహానాయకునికి మనం మిచ్చే గౌరవం 12వ వర్ధంతి సందర్భంగా వినమ్ర శ్రద్ధాంజలి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుధీర్ఘ చరిత్రలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.య‌స్.రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినందున సెప్టెంబర్ 02,2021న 12వ వర్ధంతి సందర్భంగా వీరు చేయగలిగిన కార్యక్రమాలు ఒకసారి స్మరించుకుందాం.కేవలం 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా పని చేసిన డాక్టర్ వై.య‌స్.రాజశేఖర రెడ్డి గారు

2004 మే నెల రెండవ వారంలో వైయ‌స్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే నాటికి రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితి దారుణంగా ఉండేది. సకాలంలో వర్షాలు పడక, సకాలంలో ప్రాజెక్టుల నుండి నీరు విడుదల గాక, ఆహారధాన్యాల ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోయి ఆ పండిన ఉత్పత్తులను ఆరకొరగా పెంచిన కనీస మద్దతు ధరలకు కూడా అమ్ముకోలేక రైతులు అప్పులపాలై భూమి అమ్మి అప్పు తీరుద్దామంటే భూముల ధరలు కుప్పకూలి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆత్మహత్యలపై ఎగతాళిగా మాట్లాడిన అప్పటి ముఖ్యమంత్రి. 

ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లు ఉంటే 18 బ్యాంక్ లు దివాళ తీసిన పరిస్థితి. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం మే నెల రెండవ వారంలో ప్రమాణస్వీకారం చేస్తే జూన్ నెల మొదటి వారం ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు. అయినా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు అనాధలు కాకూడదు మేమున్నాం అని ప్రభుత్వం నుండి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో G.O.No.421 విడుదల చేసి 2 లక్షల రూపాయల పరిహారం అంతకు ముందు ప్రభుత్వం హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు కూడా పరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు.

సహకార వ్యవస్థకు జీవం..
ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతుకు వెన్నెముక. రైతులు అప్పుల కట్టలేక సహకార సంఘాలు దివాళా తీసే పరిస్థితిలో వైద్యనాధన్ కమిటి సిఫారసులు అమలు చేసి రూ.1800 కోట్లు ప్రభుత్వం నుండి సహకార సంఘాలకు సహాయం అందించి పూర్తిగా నష్టాలలో ఉన్న సంఘాలను ప్రక్క సహకార సంఘంలో కలిపి రైతుల కోసం సహకార వ్యవస్థను కాపాడటం జరిగినది. పావలా వడ్డీకే రైతులకు పంట రుణాలు అందించడం జరిగినది.

 క‌రువు సీమ‌కు నీరందించాల‌న్న‌దే వైయ‌స్ఆర్ సంక‌ల్పం..
వైయ‌స్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ జీవితంలో మొట్టమొదటిగా చేసిన పాదయాత్ర లేపాక్షి నుండి పోతిరెడ్డిపాడు వరకు.. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను వెడల్పు, పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ నుంచి బాన‌కచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు ఉన్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువను 44,000 క్యూసెక్కులకు వెడల్పు చెయ్యకపోతే కరువు ప్రాంతమైన రాయలసీమకు నీరందించలేం అనేది ఆయన సంకల్పం.

తొలి రోజులలోనే అసెంబ్లీలో స్వయంగా నిస్సష్టంగా సాగునీటిపై ఆయన మాట్లాడిన మాట...నేను యువకుడిగా కోస్తా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ కాలువలలో పారుతున్న నీటిని చూసి కరువు ప్రాంతాలకు ఇలా నీటిని తీసుకుని వెళ్ళాలనే సంకల్పం నాలో ఏర్పడినది. చెన్నారెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉండగా రాయలసీమకు నీళ్ళివ్వమని నేను అడిగితే దోసిలి పట్టు పోస్తానని ఎగతాళిగా మాట్లాడారు. ఆ రోజున నా సంకల్పం మరింత బలపడినది అని ప్రకటించారు. ఇందులో నుండి ఉద్భవించినదే జలయజ్ఞం.

కోటి ఎకరాలకు సాగునీరందిస్తానని జలయజ్ఞం.. 
సాగునీటి వనరులు అభివృద్ధి మొదలైన కృష్ణదేవరాయల పాలన నుండి వైయ‌స్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వనరులు ఉన్న భూమి సుమారుగా 80 లక్షల ఎకరాలు మాత్రమే. ఇలాంటి పరిస్థితిలో లక్ష కోట్లతో కోటి ఎకరాలకు సాగునీరందిస్తానని జలయజ్ఞం కార్యక్రమం మొదలు పెట్టారు. ఇందులో ప్రాంతాల మధ్యన విభేధాలు రెచ్చగొట్టే వ్యక్తులు కొంతమంది ఉంటారని తెలిసిన వ్యక్తిగా అన్ని ప్రాంతాలలోని సాగునీటి ప్రాజెక్టులు మొదలుపెట్టిన పరిస్థితి. జలయజ్ఞంలో మొట్టమొదట మొదలు పెట్టిన ప్రాజెక్టు పులిచింతల అయితే మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్ ప్రాజెక్టు.

వైయ‌స్ఆర్ రాజకీయ విజ్ఞతకు ఇదే నిదర్శనం..
ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా పేర్లు పెట్టి ఏమాత్రం కూడా పనులు జరగని హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతిలకు అదే పేరులు కొనసాగించి ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతానికి జీవ నాడి అయిన వెలుగొండ ప్రాజెక్టు ను చేపట్టడం ఆ ప్రాజెక్టుకు కమ్యూనిస్టు నాయకుడైన పూల సుబ్బయ్య గారి పేరు పెట్టడం, కృష్ణా డెల్టా రైతుల చిరకాల స్వప్నం పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించి ఆ ప్రాజెక్టుకు కృష్ణా డెల్టా వాసి, ఆంధ్రప్రదేశ్ గర్వించే ప్రముఖ ఇంజనీర్ కేంద్ర మాజీ మంత్రి కె.యల్.రావు గారి పేరు పెట్టి పెద్ద ఎత్తున పనులు జరిపించడం ఆయన రాజకీయ విజ్ఞతకు నిదర్శనం.

పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను మొద‌లు పెట్ట‌డ‌మే కాదు..
పోలవరం ప్రాజెక్టు కోసం గోదావరి జిల్లా వాసులు పోలవరం సాధనా సమితి పేరుతో అనేక ఉద్యమాలు చేసి చివరికి ఈ ప్రాజెక్టు అసాధ్యం అనుకున్న తరుణంలో అన్ని అనుమతులు సాధించి రాష్ట్రానికే వరమైన పోలవరం ప్రాజెక్టును మొదలు పెట్టడమే కాదు జలయజ్ఞంలో చేపట్టిన అన్ని పనులు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 70 శాతం పూర్తి చేసిన గొప్పతనం ఆయనకే సాధ్యం. ఆయన చనిపోయిన 10 సంవత్సరములకు కూడా మిగిలిన 30 శాతం పనులు పూర్తి చెయ్యలేని తరువాత ప్రభుత్వాలు. ఈ రోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా 2014 వరకూ వైయ‌స్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి అయ్యి రాష్ట్రం మొత్తం సస్య శ్యామలమయ్యేదని అనేక మంది అనుకుంటున్న పరిస్థితి.

ఉచిత విద్యుత్ ఇవ్వాలని సంకల్పిస్తే కొంతమంది ఎగతాళి చేశారు..
 సాగునీటి వనరులకు ప్రధాన ఆధారం ఒకటి ప్రాజెక్టులయితే రెండవది భూగర్భ జలాలు. ఇప్పటికే ప్రాజెక్టుల నుండి సాగు అయ్యేదానికంటే కూడా ఎక్కువ సాగుకు ఆధారం భూగర్భ జలాలు. ఒక ప్రాజెక్టు కట్టి ఒక ఎకరానికి నీరివ్వాలంటే ప్రభుత్వానికి లక్షలలో ఖర్చు అవుతుంది. ఆ కాల్వల నిర్వహణ ప్రభుత్వమే భరించాలి. అదే భూగర్భ జలాలకైతే రైతు స్వయంగా బోరు బావి ఏర్పాటు చేసుకుంటున్నాడు. స్వంత ఖర్చుతో మోటార్లు కొనుక్కుంటున్నాడు. ఈ మోటారు కాలిపోతే రైతే ఖర్చు పెట్టుకుంటున్నాడు. రైతు ఒక ఎకరంలో పంట పండించడం ద్వారా 40 నుండి 60 పని దినాలు కల్పిస్తున్నాడు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తున్నాడు అని వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని సంకల్పిస్తే కొంతమంది ఎగతాళి చేశారు.
 
ఉచిత విద్యుత్ నేడు అనేక రాష్ట్రాల‌కు ఆద‌ర్శం..
ఇందుకు ఢిల్లీ పెద్దలు సహకరించలేదు. వైయ‌స్ఆర్‌ సంకల్ప బలం ఆయన ప్రారంభించిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఆదర్శమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలలో అమలు జరుగుచున్నది. నేడు అనేక రాష్ట్రాలకు ఆదర్శమైనది. నేడు మన రాష్ట్రంలో సుమారుగా 18.70 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 9 గం.ల ఉచిత విద్యుతకు ఇదే పునాది.

అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు..
 వ్యవసాయ పరిశోధనల సమన్వయానికి, వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికీ, వ్యవసాయ విధానాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. అందువలన కేంద్ర-రాష్ట్రాల సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలని గుర్తించి ఆయన చైర్మన్ గా పెద్దలు సోమయాజులు గారిని వైస్ చైర్మన్ గా ఉండి అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ ప్రారంభోత్సవ సందర్భంగా 2006 జనవరి 10 వ తారీఖున రాజశేఖర్ రెడ్డి గారి మాటలు
రెండవ హరితవిప్లవం, వినూతన వ్యవసాయం కేవలం నీటిపారుదల,  గిట్టుబాటు వ్యవసాయ మూలంగానే సాధ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశానికే అన్నపూర్ణగా తీర్చిదిద్దడం నా ఉద్దేశ్యం. ఒకసారి లక్ష్యంపై దృష్టి సారిస్తే ఎటువంటి అవరోధాలనైనా అధిగమిస్తామని నా నమ్మకం- ఇది ఆయన ఆత్మవిశ్వాసానికి సూచిక.

 గిట్టుబాటు వ్యవసాయం: 
ఆంధ్ర ప్రదేశ్లో వ్యవసాయ ఉత్పత్తి వ్యయం ఎక్కువ. రైతుకు ఆదాయం తాను పండించిన పంటను లాభసాటి ధరకు అమ్ముకుంటేనే వస్తుంది. కానీ అనేక పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. ఈ ధరలు పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా లేవని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళడం ద్వారా 2004 నుంచి 2009 వరకు పెంచిన మద్దతు ధరలే ఇందుకు నిదర్శనం. ఉదాహరణకు 1999 నుండి 2004 వరకు రాష్ట్రంలో ఎక్కువగా సాగు జరిగే ధాన్యంకు పెరిగిన మద్దతు ధర కేవలం రూ.60 (12.5%) రూ.490 నుండి రూ.550. అదే 2004 నుండి 2009 వరకు వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెరిగిన మద్దతు ధర రూ.450 (82.5%) రూ.550 నుండి రూ.1000. అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు పెరిగినాయి. ఆ మద్దతు ధరల కంటే ఎక్కువకు రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకున్నారు. 

 రుణమాఫీ: 
ఈ సమయంలోనే రాజశేఖరరెడ్డి గారి ప్రోద్బలంతోనే కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించినది ఇందులో లబ్ది అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ కి వచ్చినది. అది గాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో సకాలంలో బకాయిలు చెల్లించిన రైతులకు లబ్ధి జరగలేదని గ్రహించి, రైతు సంఘాలు కూడా లేవనెత్తక ముందే, 36 లక్షల మంది రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున రూ.1800 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. దేశంలోనే ఇలా చేసిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మాత్రమే. 8. సన్న,చిన్నకారు రైతులు, కౌలు రైతులు ఆర్థిక సంక్షోభంలోనికి నెట్టివేయబడటానికి మరికొన్ని కారణాలు, పిల్లల విద్య, కుటుంబంలోని వ్యక్తుల వైద్యం ఖర్చు. గ్రామీణ ప్రాంతాలలో ఈ సంక్షోభం ఎక్కువగా ఉందని గ్రహించి గొప్ప పధకాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు

రీయింబర్స్ మెంట్, 108 మరియు 104 పథకాలు అమలు..

రాష్ట్రంలో సరాసరి 65 శాతం మంది రైతుల భూకమతాల పరిమాణం 1.05 సెంట్లు మరో 22 శాతం మంది రైతుల పరిమాణం 3.45 ఎకరాలు మాత్రమే అంటే 87% మంది రైతులకు తెల్ల రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు, బలహీనవర్గాల గృహాలు కేటాయింపు చేసి ఈ వర్గాలను కాపాడటం జరిగింది. 90 శాతం రాయితీతో పెద్ద ఎత్తున బిందుసేద్య పరికరాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు రైతుల సంక్షేమం కోసం డాక్టర్ వై.య‌స్.రాజశేఖర రెడ్డి గారు చేపట్టడం జరిగింది.

ప్రకృతి ప్రేమికులు పాలకులుగా ఉంటే ప్రకృతి మాత సహకారం ఉంటుంది. ఇందుకు నిదర్శనం ఆయన పాలన ఐదు సంవత్సరాలు సకాలంలో వర్షాలు, సకాలంలో ప్రాజెక్టుల నుండి నీటి విడుదల ఉచిత విద్యుత్ కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తులు గణనీయంగా పెరిగినాయి. వాటి మద్దతు ధరలు పెరగడమే కాదు, మద్దతు ధరకు మించి రైతు తమ ఉత్పత్తులను అమ్ముకున్నాడు. సామాన్యుడికి సంబంధించి ఆర్టీసీ బస్చార్జీలు, విద్యుత్ చార్జీలు పెంచలేదు. ఒక్క రూపాయి పన్ను పెంచలేదు, ఒక్క రూపాయి కొత్త పన్ను వెయ్యలేదు. సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందినాయి. భూములమ్ముకోవలసిన అవసరం రాలేదు. రైతులకు ఆదాయం పెరగడంతో వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారులు, చిరువ్యాపారుల ఆదాయం పెరిగి గ్రామాలలో సంపద పెరిగి వ్యవసాయ భూముల ధరలు పెరిగినాయి.

రైతులు పేద, బడుగు బలహీన వర్గాల మహిళలు, విద్యార్ధులు, వృద్ధుల సంక్షేమం, అభివృద్ధి కోసం నాన్న ఒక అడుగు వేస్తే నేను ఆయన వారసుడుగా రెండు అడుగులు వేస్తాను అని ప్రకటించిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.య‌స్.జగన్ మోహన రెడ్డి గారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.య‌స్.రాజశేఖర రెడ్డి గారు రైతు సోదరులకు చేసిన సేవలకు గుర్తింపుగా..

1. రైతులకు ఉత్పత్తి వ్యయం తగ్గాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 సంవ్సరాలలోనే రైతులకు రూ.13,101 కోట్లు అందించిన రైతు భరోసా పథకానికి వై.య‌స్.ఆర్.రైతు భరోసా-పీఎం.కిసాన్‌గా నామకరణం చేయడం జరిగినది.

2. డా|| వై.యస్.ఆర్. ఉచిత పంటల బీమా పథకం

3. డా॥ వై.యస్.ఆర్. సున్నా వడ్డీ పథకం

4. డా|| వై.యస్.ఆర్. మత్స్య‌కార భరోసా పథకం

5. డా॥ వై.యస్.ఆర్. కాపరి బంధు పథకం

6. డా॥ వై.యస్.ఆర్. పశు నష్ట పరిహారం పథకం

7. డా॥ వై.యస్.ఆర్. జలకళ పథకం

8. డా॥ వై.యస్.ఆర్. ఉచిత విద్యుత్ పథకం
 
9. డా॥ వై.యస్.ఆర్. జగనన్న ఇళ్ళ పట్టాలు పథకం

10. డా॥ వై.యస్.ఆర్. ఆసరా పథకం

11. డా॥ వై.యస్.ఆర్. చేయూత పథకం

12. డా॥ వై.యస్.ఆర్. కాపునేస్తం పథకం

13. డా॥ వై.యస్.ఆర్. వాహనమిత్ర పథకం 
14. డా॥ వై.యస్.ఆర్. లా నేస్తం పథకం

15. డా॥ వై.యస్.ఆర్. ఆరోగ్య శ్రీ పథకం

16. డా॥ వై.యస్.ఆర్. పెన్షన్ కానుక పథకం

17. డా॥ వై.యస్.ఆర్. నేతన్న నేస్తం పథకం

18. డా॥ వై.యస్.ఆర్. కళ్యాణ కానుక పథకం

19. డా॥ వై.యస్.ఆర్. కంటి వెలుగు పథకం

20. డా॥ వై.యస్.ఆర్. సంపూర్ణపోషణ పథకం

21. డా॥ వై.యస్.ఆర్. గిరి పుత్రిక పథకం

22.వై.యస్.ఆర్. చిరునవ్వు పథకం

23. డా॥ వై.యస్.ఆర్.ఈబీసీ నేస్తం

ఇంకా అనేక సంక్షేమ పథకాలు వేలాది కోట్లతో, లక్షలాది మందికి లబ్ది జరిగే కార్యక్రమాలకు డా॥ వై.యస్.ఆర్ పేరుతో నామకరణం చేసి అమలు చెయ్యడం జరుగుతున్నది. G.O.Ms.No.69, తేది.06.07.2020 ద్వారా రైతు భరోసా కేంద్రాలను Dr.Y.S.R రైతు భరోసా కేంద్రాలుగా నామకరణం చేయడం జరిగింది. ప్రజల గుండెలలో చిరంజివీగా మిగిలిన దివంగత ముఖ్యమంత్రి శ్రీ డాక్ట‌ర్‌ వై.యస్. రాజశేఖర రెడ్డి గారి 12వ వర్థంతి సందర్భంగా వినమ్ర శ్రద్ధాంజలి.

 యం వీ యస్ నాగిరెడ్డి 
అధ్యక్షుడు 
రైతు విభాగం, వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ

Back to Top