లక్ష్మణుడూ వెళ్లిపోయాడు.....

వైయస్‌ చెప్పిందే వివేకాకు వేదం

కడప జిల్లాలో వైయస్‌ఆర్‌ పేరు వినపడగానే జంటగా వివేకానంద పేరు వినిపించేది. 

పిలిస్తే పలికే నాయకుడిలా పేరు

 కడప జిల్లాల్లో ఇంటింటికి తెలిసిన వ్యక్తి ఎవరంటే వై.ఎస్‌. వివేకానందరెడ్డి అంటారు. ఇంకాసేపు మాట్లాడితే...వాళ్ల అన్న వెంట లక్ష్మణుడులా నిలిచాడప్పా! అంటారు. నిజమే. అనేకానేక సందర్భాల్లో ఆ అన్న వైయస్‌ఆర్‌లేని లోటును తలచుకుంటూ కళ్లతడిపెట్టిన సందర్భాలు చూసినవారు వున్నారు. ఆ ఇద్దరి అనుబంధం అలాంటిది. వైయస్‌ చెప్పిందే వివేకాకు వేదం. అనుంగు తమ్ముడు. అన్న కోసం అన్నివేళలా సిద్దంగా వుండే తమ్ముడు. 

వైఎస్‌ రాష్ట్రవ్యాప్త నాయకుడయ్యారు. విశాలాంధ్ర అంతా ఆయన పరిధే. మూడుప్రాంతాల్లోనూ ఆయన తిరగాలి. కడపలో వివేకానందరెడ్డి అన్నకోసం అన్నీ అయ్యాడు. అన్న కడప గురించి, పులివెందుల గురించి పడాల్సిన కష్టంలో తాను సగంపైగానే మోసారు. 

ఆ అన్నకు తమ్ముడంటే అంతే ప్రేమ. అన్న ఆదేశించడం ఆలశ్యం పనిచేసుకుపోవడమే తెలిసిన వివేకానందరెడ్డి....1989, 1994లో రెండుసార్లు పులివెందుల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో వైయస్సార్‌ కడప ఎంపీ. 1999లో కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. 2004లోనూ కడప ఎంపీగా మునుపటికన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచారు. వైఎస్‌ పులివెందుల ఎమ్మెల్యే. విశాలాంధ్ర ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆ విధంగా కడప జిల్లాలో వైయస్‌ఆర్‌ పేరు వినపడగానే జంటగా వివేకానంద పేరు వినిపించేది. 

వ్యక్తిగతంగా వివేకానందుడు చాలా సౌమ్యుడు. ఎంత సౌమ్యంగా కనిపించేవారో అంతే పట్టుదలగా వుండేవారు. మంచిమనిషే కాదు మహా ధైర్యవంతుడు కూడా. అర్థరాత్రి అపరాత్రి అన్నది లేకుండా కార్యకర్తల కోసం కదిలిపోయేవాడు. ప్రజలకోసం, ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు ధర్నాలు చేశారో లెక్కేలేదు. అగ్రికల్చరల్‌ బీఎస్సీతో పాటు, మరిన్ని పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌డిగ్రీలు కూడా చేసిన విద్యాధికుడు, ప్రజల సమస్యలపై మరీ ముఖ్యంగా కడప జిల్లా సమస్యలపై స్పష్టమైన అవగాహన వున్నవారు. స్వతహాగా వ్యవసాయం, తోటల పెంపకంపై ఆసక్తి పెంచుకున్న వివేకానంద సమయం చిక్కితే, తన వ్యవసాయక్షేత్రాల్లోకి వెళ్లిపోయేవారు. ఆ మమకారమే రైతు సమస్యలపై వెంటనే స్పందించే లక్షణాన్ని ఆయన వ్యక్తిత్వంలో భాగం చేసింది. 

ఎక్కడికైనా ఒంటరిగానే వెళ్లిపోయే సాహసి. ఎక్కడైనా నిలబడి టీ తాగేసే మనిషి. కడప జిల్లాలో అది ఇది ఏమని, అన్ని ప్రాంతాల్లో  వైఎస్‌ వివేకానందరెడ్డి ఎక్కడైనా ఎప్పుడైనా కనిపించవచ్చు. ఏ టీ కొట్టుదగ్గరో గబగబా టీ తాగేసి, మరింత ప్లాస్కులో పోయించుకుని అలా వెళ్లిపోయేవారు. డాబు, దర్పం అసలు కన్పించని ఆయన నిరాడంబరుడు. కడపలో పిలిస్తే పలికే నాయకుడిలా పేరు తెచ్చుకున్నారు. వివేకానందరెడ్డి లేరన్న వార్త అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ’ఆయనకా ...ఇలా...’ అని కంటతడిపెడుతున్నారు. 

నిన్నటి దాకా వైఎస్సార్‌సీపీ ప్రచారంలో జిల్లాలో తిరిగిన వైఎస్‌ వివేకానందరెడ్డి ఈరోజు లేరన్న వార్త నిజంగా ఆ కుటుంబసభ్యులకూ, ఆయన గురించి తెలిసినవారందరికీ చాలా బాధాకరం. ఆ నడకలో వేగం....శాశ్వతంగా ఆగిపోయింది. 

వివేకం సార్ ను చంపేశారు.

 

 

Back to Top