‘మా ఆశలన్నీ వైయ‌స్ జగన్‌పైనే.. మేము ఆంధ్రాలోనే ఉంటాం’

కొటియా ప్రజల్లో కొత్త ఆశలు

ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో సాలూరు నియోజకవర్గ పరిధిలో ఐదు గ్రామ పంచాయతీల పరిధిలోని 34 కొటియా గ్రూపు గ్రామాలపై వివాదం దీర్ఘకాలంగా ఉంది. అక్కడ దాదాపు 15 వేల మంది జనాభా ఉన్నారు. వారిలో 3,813 మంది ఒడిశాలోనూ ఓటర్లుగా ఉన్నారు. 1936వ సంవత్సరంలో ఒడిశా రాష్ట్రం ఏర్పాటైనపుడు కానీ, 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైనపుడుగానీ అక్కడ సర్వే లేదు. ఏ రాష్ట్రంలోనూ అంతర్భాగంగా గుర్తించలేదు. దీంతో ఆయా గ్రామాల కోసం ఇరు రాష్ట్రాలు 1968వ సంవత్సరం నుంచి న్యాయపోరాటం చేస్తున్నాయి.

దీనిపై విచారించిన సుప్రీంకోర్టు... ఈ వివాదాన్ని పార్లమెంట్‌లో తేల్చుకోవాలని, అంతవరకూ ఆక్రమణ చర్యలకు పాల్పడవద్దని సూచిస్తూ 2006 సంవత్సరంలో ఆదేశాలు ఇచ్చింది. కానీ వారంతా ఆంధ్రా ప్రాంతానికి చెందినవారుగా గుర్తించడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. భూమి శిస్తు చెల్లింపునకు సంబంధించిన తామ్రపత్రాలను ఇటీవల కొటియా గ్రామస్తులు ప్రదర్శించారు. వారి పిల్లలు కూడా సాలూరు మండలంలోని కురుకూటి, అంటివలస, కొత్తవలస గ్రామాల్లోనున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు.

వారికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్‌కార్డులతో పాటు ఆంధ్రప్రదేశ్‌ చిరునామాతో ఆధార్‌కార్డులు కూడా ఉన్నాయి. తమ పూర్వీకుల నుంచి ఆంధ్రా ఆచార సంప్రదాయాలను పాటిస్తున్న తమను పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారుగా గుర్తించాలని ఇటీవలే 16 గ్రామాలకు చెందిన కొటియా ప్రజలు తీర్మానాలు చేశారు.  

మేము ఆంధ్రాలోనే ఉంటాం 
మాకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. మేము ఆంధ్రులం. ఒడిశా రాష్ట్రంలో చేరబోం. ఇన్నాళ్లకు ఒడిశాతో చర్చల్లో కొటియా చేరింది. ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌తో జగన్‌మోహన్‌రెడ్డి చర్చించడం, అక్కడ సానుకూల పరిణామాలు రావడం శుభపరిణామం.  – కూనేటి గింద, కొదమ ఎంపీటీసీ, సాలూరు మండలం 

మా ఆశలన్నీ జగన్‌పైనే..
వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మా కొటియా గ్రామాల్లో సంక్షేమ పథకాలన్నీ అమలవుతున్నాయి. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మేము ఆంధ్రాలో ఉంటామని తీర్మానాలు చేశాం. వాటికి విలువ ఉంటుంది. మేము ఆంధ్రాలోనే ఉండాలన్న మా ఆశలు నెరవేర్చేది సీఎం జగన్‌ మాత్రమే.  – కూనేటి బెతురు, పగులుచెన్నేరు సర్పంచ్, సాలూరు మండలం  

ఇద్దరు సీఎంలకు ప్రత్యేక   కృతజ్ఞతలు  
ఇరు రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి నలుగుతున్న సమస్యల పరిష్కారానికి ఇద్దరు సీఎంలు చర్చలు జరపడం సంతోషదాయకం. కొటియా, జంఝావతి, శ్రీకాకుళం జిల్లాలోని నేరడి ప్రాజెక్టు సమస్యలపై సానుకూల వాతావరణంలో చర్చించారు. వీరి హయాంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా. జగన్‌మోహన్‌ రెడ్డిని ఒడిశా సీఎం సాదరంగా ఆహ్వానించడం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడుగు ముందుకు వేయడం శుభదాయకం.  – పీడిక రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే

తాజా ఫోటోలు

Back to Top