కథలు చెప్పిన కఠినవాస్తవాలు

జరిగిపోయినవి కథలుగా చెప్పుకోవడం తరతరాల అలవాటు. అవి పురాణాలైనా, చరిత్ర అయినా, మనుషుల గురించి అయినా కాలం ముందుకు వెళ్లిపోయినాసరే ఆ స్మృతులు కథలుగా భావితరాలకు చేరుతూనే ఉంటాయి. సంస్కృతి, నీతి, కట్టుబాట్లు, మహనీయుల జీవితాలు మాత్రమే కాదు దుర్మార్గుల అకృత్యాలు, రాక్షసుల అత్యాచారాలు, చెరపడ్డ చీకటి రోజులు కూడా కథలుగా మారి తరతరాలకు పాకుతుంటాయి. మంచి ఓ కథ అయితే చెడు మరో కథ. మంచి చెడుల కలయికలతో కథ. చెడుపై మంచి సాధించిన విజయం మరో కథ. 
సమకాలీన పరిస్థితుల్లో చూసుకుంటే వైయస్సార్ సంక్షేమ పాలన నేటికీ ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్న ఓ మంచి కథ. వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర నడుస్తున్న కథ. ఇక చంద్రబాబు పరిపాలనలో జరిగే అరాచకాలు ప్రజల నోళ్లలో కథలై నానుతూనే ఉన్నాయి. బాబు చేసిన 9ఏళ్ల పాలనను, కరువు తాండవమాడిన ఆరోజులను, బాబు నిర్లక్ష్యానికి బలైన వ్యవసాయాన్ని, కాడెనొదిలి ఉరితాళ్లను పట్టుకున్న రైతులను, విద్యుత్ బిల్లులకు ఆస్తులు అమ్ముకున్న కుటుంబాలను, బషీర్ బాగ్ మారణ కాండను కూడా ప్రజలు కథలు కథలుగా గుర్తుపెట్టుకున్నారు. ప్రజల మనసుల్లో భద్రంగా ఉండే ఆ జ్ఞాపకాల కథలను తన ప్రజా సంకల్పయాత్రలో తట్టి లేపారు వైయస్ జగన్. చంద్రబాబు ఆగడాలను కూడా కథలు కథలుగా చెప్పుకొచ్చారు. బాబు అక్రమాలను పూసగుచ్చినట్టు ఆ కథల ద్వారానే వివరించారు. బాబు బుద్ధిని ఆ కథల్లోనే వర్ణించారు. బాబు తీరును ఆ కథల్లోనే ఎండగట్టారు. యువనేత చంద్రబాబు చెప్పిన పిట్టకథలకు ప్రజల్లో విపరీతమైన స్పందన కనిపించింది. ప్రతిపక్షనేత చంద్ర బాబు మీద మరో సెటైర్ కథ ఏమి చెబుతాడా అంటూ రాష్ట్రమంతా కుతూహలంగా ఎదురుచూసింది. జగన్ చెప్పేది నిజమే సుమా...బాబు అట్టాంటి వాడే అనుకుంటూ ప్రజలు నవ్వుకోవడం కనిపించింది. వాస్తవాలను నీతికథలుగా మార్చి ప్రజలకు చేర్చడంలో వైయస్ జగన్ ప్రయత్నం సఫలం అయ్యిందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 
ఊరూరా కథలే...
అనంతపురం జిల్లా రాప్తాడులో ప్రజాసంకల్పయాత్ర బహిరంగ సభలో వైయస్ జగన్ చెప్పిన దొంగకొంగ కథ రాష్ట్రం మొత్తంలో పెద్ద దుమారాన్నే రేపింది. అబద్ధాలు, మోసాలతో ప్రజలను మోసం చేసిన బాబు పాలన గురించి నీతిలేని కొంగ చంద్రబాబు దొంగ అంటూ చెప్పిన కథకు ప్రజలనుంచి విశేషమైన స్పందన వచ్చింది. పుట్టపర్తిలో పిట్టల దొర కథనూ ప్రజలు అలాగే ఆదరించారు. రెయిన్ గన్లు అంటూ పిట్టలదొరలా వచ్చిన చంద్రబాబు అవిగో నీళ్లు, ఇవిగో పంటలు అని గొప్పలు చెప్పి వెళ్లిపోయాడని, చివరకు రైతుకు కన్నీళ్లు తప్ప నీళ్లు రాలేదని, బడాయి బాబు మాటలు గారడి మూటలు అని వైయస్ జగన్ చెప్పిన కథ వాస్తవాన్ని కళ్లకు కట్టిందన్నారు తెలుగు ప్రజలు. 
నమ్మిన వాళ్లనే దగాచేసి, నయవంచనతో నాశనం చేసే కొండచిలువ కథను కూడా బాబుకు అన్వయించి చెప్పారు ప్రతిపక్ష నేత వైయస్ జగన్. దయ తలచి కొండచిలువకు చోటిస్తే కోళ్లను మేకలను మింగి మనిషి మీద ప్రేమ నటిస్తూ చుట్టి మింగేయాలని చూసినట్టే, బాబు కూడా ప్రేమ ఒలకబోస్తూ రాష్ట్రం మొత్తాన్నీ మింగేసాడని చెప్పారు వైయస్ జగన్. చిత్తూరు జిల్లా కలికిరి సభలో ఇలాంటిదే మరో నీతికథ చెప్పారు వైయస్ జగన్. ముసలి పులి కడియం ఆశచూపి జనాల్ని తిన్నట్టే బాబు తన హామీల ఆశ చూపి ఓట్లేయించుకుని, ఇప్పుడు ప్రజలను కాల్చుకు తింటున్నాడని తెలియజేసారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైయస్ జగన్ చెప్పిన దేవతా వస్త్రాలు కథ రాష్ట్రమంతా మారుమోగిపోయింది. మూర్ఖులకు తప్ప కనిపించవని చెప్పగానే లేని దుస్తులు ఉన్నాయని భ్రమించి వాటిని తొడుక్కున్న రాజు, ఆ రాజుకు వంత పాడే వంది మాగధులు కథ ప్రజలను బాగా ఆకట్టుకుంది. అచ్చం బాబు ఆయన చెప్పినట్టల్లా ఆడే ఛానళ్లులాగే ఉందీ కథ అనుకున్నారు ఆంధ్రాప్రజలు. 
రాజోలు సభలో ప్రతిపక్ష నేత చెప్పిన మరో కథ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. పరీక్షా హాల్లో చంద్రబాబు లాంటి విద్యార్థి పరీక్షా సమయాన్నంతా వ్యర్థం చేసి మరోసారి అవకాశం ఇవ్వండి బ్రహ్మాండంగా రాస్తాను అన్నాడట అంటూ జగన్ చెప్పిన కథకు యువత అంతా ఫిదా అయ్యింది. తల్లీ తండ్రులను చంపి న్యాయస్థానంలో జడ్జీముందు అమ్మానాన్నా లేరని సింపతీకోసం ఏడిచే నిందితుడి కథను కూడా చెప్పారు ప్రతిపక్ష నేత వైయస్ జగన్. తానే నాశనం చేసిన రాష్ట్ర భవిత గురించి సభలు పెట్టి మరీ ఏడవడం బాబుకే చెల్లిందని ఎద్దేవా చేసారు. కేంద్రంతో అధికారం పంచుకున్నన్నాళ్లూ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా వదిలేసి, ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రం వల్లే అన్యాయం జరిగిపోయిందని మొసలి కన్నీరు కార్చే బాబు కథను కళ్లకు కట్టినట్టు వివరించారు జననేత. 
ఒంగోలు మార్కాపురంలో జగన్ చెప్పిన క్రికెట్ కథ సైతం తెలుగువారిని ఆకట్టుకుంది. క్రికెట్ మాచ్ లో ఓ ఆటగాడు ఫిక్సింగ్ చేస్తే ఆ జట్టు కెప్టెన్ ఆట నాశనం కాకుండా కాపాడతాడు. కెప్టెనే ఫిక్సింగ్ చేస్తే ఆ జట్టును ఎవరు కాపాడతారు? బాబు కూడా రాష్ట్రాన్ని నడిపించమని కెప్టేన్సీ కట్టబెడితే లాలూచి పడి ఆంధ్రప్రదేశ్ అనే టీమ్ ను అలాగే ఔట్ చేసేసాడు అని చెప్పారు వైయస్ జగన్. ప్రత్యేక హోదా కోసం సైనికుడు పోరాడుతున్నప్పుడు, నకిలీ బుల్లెట్లు ఇస్తే ఎలాంటి ఫలితం వస్తుందో హోదా కోసం ప్రజలు పోరాడుతున్నప్పుడు చంద్రబాబు లాంటి అధికారం ఉండీ ఉపయోగం లేని నాయకుడు ఉంటే అలాంటి ఫలితమే వస్తుందని చేతగాని బాబు సంగతి ఎంతో చక్కగా వివరించారు యువనేత. ప్రత్యేక హోదా డిమాండ్ ను నోరు నొక్కి, పీక పిసికి చంపేసిన వాళ్లు నేడు హోదా కావాలంటే నమ్మేదెవరు? అంటూ మరో  కథతో సూటిగా ప్రశ్నించారు వైయస్ జగన్.

సూటిగా ఘాటు వాఖ్యలు...
ఇలాంటి పిట్ట కథలే కాదు రాష్ట్రంలో అవినీతి, అధర్మ పాలనను వాడైన మాటలతో చీల్చి చెండాడారు వైయస్ జగన్. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అని రాష్ట్రంలో ఇది కాకుండా ఖీSఖీ అంటే తెలుగుదేశం సర్వీస్ టాక్స్, ఇంకా ఓSఖీ అంటే కోడెల సర్వీస్ టాక్స్ అనీ కొనసాగుతున్నాయి అని బాబు పాలనలోని అక్రమ వసూళ్లపై చురకలంటించారు వైఎస్ జగన్. ఎక్కడైనా Mఔఅ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ మన రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం మామూళ్లు, లంచాలూ తీసుకునే అబ్బాయిగా దాని అర్థం మార్చేసారన్నారు యువనేత. తణుకు సభలో మాట్లాడుతూ బాబుకు ఉంగరు వాచీ ఉండవుగానండీ వేల కోట్ల ఆస్తులు ఉంటాయండీ  అంటూ గోదావరి యాసలో చమత్కారంగా మాట్లాడుతూనే నిజాలను ప్రజలకు తెలియచెప్పారు. అచ్చెన్నాయుడు తాటికాయంత ఉంటాడు ఈతకాయంత పనికూడా చేయలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పుట్టబోయే బిడ్డకి తన పేరు చెప్పమంటున్నాడు, ఇసుకాసురుడు, రావణాసురుడు, బకాసురుడు అని బాబు అసలు పేర్ల గురించి తప్పుకుండా చెప్పండి అంటూ బాబు ప్రచార పిచ్చికి వాతలు పెట్టారు. 
ఇలా ప్రజాసంకల్పయాత్ర లో అడుగడుగునా అవినీతి ప్రభుత్వానికి చెమటలు పట్టేలా, ప్రజల్లో చైతన్యం పెల్లుబికేలా కథలనే ఆయుధాలుగా చేసుకున్నారు వైయస్ జగన్. నీతికథలు మంచి మార్గాన్ని చూపుతాయి. జగన్ చెప్పిన  కథలు వాస్తవాలను బయటపెడుతున్నాయి అంటున్నారు తెలుగు ప్రజలు. 
 

Back to Top