ప‌ల్లెకు పండ‌గొచ్చింది

జులై 8న వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా రైతు దినోత్స‌వం

వేడుక‌ల‌కు సిద్ధ‌మైన రైతులు

అదే రోజు  వైయ‌స్ఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ

అమ‌రావ‌తి:  రైతుకు మళ్లి మంచి రోజులు వ‌చ్చాయి. సంక్షోభంలో ఉన్న వ్య‌వ‌సాయాన్ని పండుగ చేసిన దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకొని జులై 8న రైతు దినోత్స‌వం నిర్వ‌హించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైయ‌స్ఆర్‌ జయంతి అయిన జూలై 8న రైతు దినోత్సవంగా నిర్వహిస్తామని సీఎం వైయ‌స్ జగన్  ఇటీవ‌ల నిర్వ‌హించిన‌ కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. పంటల బీమా, రైతులకు వడ్డీలేని రుణం తదితరాలకు చెందిన చెల్లింపుల అంశాలను ఆ రోజుకు సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా వైయ‌స్ఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఆ రోజు పండగలా నిర్వహించాలని సూచించారు. రైతులకు ప్రభుత్వ రాయితీలు, పెట్టుబడి రాయితీ, పంటల బీమా తదితర సంక్షేమ పథకాల ఫలాలు పక్కాగా అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని వైయ‌స్ జగన్ నొక్కి చెప్పారు.  రైతు దినోత్సవం కోసం నియోజకవర్గానికి రూ.లక్ష విడుదల చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు దినోత్సవం మార్గదర్శకాలనూ విడుదల చేసింది. 

రైతు దినోత్సవం వేడుకలను సీఎం వైయ‌స్‌ జగన్ పులివెందులలో ప్రారంభిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతులకు భరోసా కల్పించే ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు. పులివెందులలో అరటి పరిశోధన కేంద్రానికి సీఎం వైయ‌స్ జగన్‌ శంకుస్థాపన చేస్తారన్నారు. రైతు బీమా పథకంలో భాగంగా ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే రూ. 7లక్షల బీమా చెల్లిస్తామన్నారు. పలు ప్రాంతాల్లో రైతులకు అవసరమైన యంత్రాలు పంపిణీ చేస్తామన్నారు.

పాదయాత్రలో వైయ‌స్ జగన్‌ ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం వేరుశనగకు క్వింటాల్‌కు రూ. 1500 మద్దతు ధర ప్రకటించినట్లు కన్నబాబు తెలిపారు. వేరు శనగ విత్తనాల కొరతను సరిదిద్దామన్నారు. 3.13లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సరఫరా చేశామన్నారు. ఉత్తరాంధ్రలో సరిపడ వరి విత్తనాలు సరఫరా చేసినట్లు తెలిపారు. రైతు దినోత్సవం నాడు రైతుల సమస్యలకు సంబందించిన ఫిర్యాదులను కూడా స్వీకరిస్తామని తెలిపారు.

రైతు బంధు వైయ‌స్ఆర్‌
సుదీర్ఘ పాదయాత్ర అనంతరం 2004 ఎన్నికల్లో విజయం సాధించిన వైయ‌స్ రాజశేఖర రెడ్డి.. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారు. జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఆయన.. రైతు బంధుగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయన జయంతిని రైతు దినోత్సవంగా జరపడం సరైందేనని వైయ‌స్ఆర్‌సీపీ సర్కారు నిర్ణయించింది. రైతు దినోత్స‌వాన్ని పండుగ‌లా నిర్వహించనుండటం ఏపీ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. 
 

Back to Top