విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’

 స్కూలు పిల్లలకు రూ.600 కోట్లతో  కిట్లు

జూన్‌ నాటికి సిద్ధం చేసేలా కార్యాచరణ

ప్రభుత్వ యాజమాన్య, ఎయిడెడ్‌ స్కూళ్లలో చదివే ప్రతి విద్యార్థికి పంపిణీ

రాష్ట్రంలో 40 లక్షలకు పైగా పిల్లలకు ప్రయోజనం

అమరావతి: ‘మీ పిల్లల మేనమామగా..’ అంటూ రాష్ట్రంలోని నిరుపేద బడుగు బలహీన వర్గాల అక్కచెల్లెమ్మల పిల్లల చదువుల బాధ్యత తనదిగా పేర్కొన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆ పిల్లలకు మరింత భరోసా కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పిల్లలకు అందించే దుస్తులు పాఠ్యపుస్తకాలతో పాటు వారి చదువులకు అవసరమయ్యే మరికొన్ని వస్తువులను కూడా చేర్చి ‘కిట్‌’ రూపంలో అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, ఎయిడెడ్‌ పాఠశాలలు, ఎయిడెడ్‌ మదర్సాల్లో చదువుకొనే విద్యార్థులందరికీ ఈ కిట్లను అందించనున్నారు. ‘జగనన్న విద్యా కానుక’ పథకం కింద రాష్ట్రంలోని దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు రూ.600 కోట్ల వ్యయంతో ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. 

పాఠశాలలు తెరిచే నాటికే పంపిణీ
వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలు తెరిచే నాటికి ఈ కిట్లను సిద్ధం చేసి విద్యార్ధులందరికీ పంపిణీ చేయనున్నారు. రెండు జతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించడంలోనూ గత ప్రభుత్వం విఫలమైంది. పాఠ్యపుస్తకాలు డిసెంబర్‌ వరకు, దుస్తులు అయితే ఏకంగా ఏప్రిల్‌ వరకు కూడా పంపిణీ అయ్యే పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాఠశాలలు తెరిచే నాటికే పిల్లలకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చారు. రెండు జతల దుస్తులను మూడు జతలకు పెంచారు. 3 జతల దుస్తుల వస్త్రంతో పాటు నోట్‌ పుస్తకాలు, ఒక జత షూ, 2 జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగును కిట్‌ రూపంలో అందించనున్నారు. ఇందుకు సంబంధించి విద్యా శాఖ టెండర్లను కూడా ఆహ్వానించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు తరగతుల వారీగా ఈ కిట్లను అందిస్తారు. వీటికి సగటున ఒక్కో విద్యార్థికి రూ.1,350 నుంచి 1,550 వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 40 లక్షల మంది విద్యార్థులకు వీలుగా అంచనా వేస్తున్నా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల కారణంగా ఈ సంఖ్య మరో 3 నుంచి 4 లక్షల వరకు పెరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. గతంలో కిట్ల రూపంలో రెసిడెన్సియల్‌ స్కూళ్లలోని 7 నుంచి 8 లక్షల మంది పిల్లలకు వీటిలో కొన్ని వస్తువులను మాత్రమే పంపిణీ చేసేవారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, ఎయిడెడ్‌ స్కూళ్లు, ఎయిడెడ్‌ మదర్సాల్లో చదువుకొంటున్న పిల్లలందరికీ వీటిని పంపిణీ చేయించేలా ఆదేశాలు ఇచ్చారు.  

అమ్మఒడి, ఇంగ్లిష్‌ మీడియం, నాడు–నేడుతో ప్రోత్సాహం
నవరత్న హామీల్లో కీలకమైన ‘అమ్మ ఒడి’ పథకాన్ని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలన్న తేడా లేకుండా పిల్లలను చదువుకోవడానికి పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు అందించే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఈ ఏడాది రాష్ట్రంలోని 43 లక్షల మంది తల్లులకు రూ.6,500 కోట్ల వరకు పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్రపంచంలో ఎలాంటి పోటీనైనా ఎదుర్కొని ఉద్యోగ ఉపాధి అవకాశాలను దక్కించుకోవడానికి వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్‌ మీడియంలో బోధనకు శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు 45 వేల ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చేందుకు మనబడి నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడేళ్లలో దాదాపు రూ.12 వేల కోట్లతో  అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. పాఠశాలల ప్రస్తుత పరిస్థితిపై ఫొటోలు తీయించారు. రూపురేఖలు మార్చాక కొత్త, పాత ఫొటోలను ప్రజల ముందుంచనున్నారు.

Back to Top