జగన్ అనే నేను

 

విత్తు ఒక్కటైతే చెట్టు ఒక్కటౌతుందా...! వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే నేను అంటూ నాడు వైఎస్సార్ చేసిన ప్రమాణం ప్రజల కోసం ప్రజల మనిషిగా ప్రజలతోనే ఉంటానని. భౌతికంగా ఆయన దూరమైనా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయారు. సంక్షేమ పాలనకు ఓ కొలమానంగా నిలిచిపోయారు. ఆ మహానేత ఆశయాలకు వారసత్వాన్ని అందిపుచ్చుకుని అందరి ముందుకూ వచ్చినిలబడ్డారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నవ్వులో నడతలో నాన్నను మరిపిస్తూ ప్రజల మనసులు చూరగొన్నారు. ఆ తండ్రిలాగే నేడు ముఖ్యమంత్రి పీఠాన్నీ అధిరోహిస్తున్నారు. ఇది ప్రజలు అందించిన అధికారం కాదు, వారికి మేలు చేసేందుకు దేవుడు ఆ రూపంలో ఇచ్చిన అవకాశం అని వినమ్రంగా చెప్పారు వైఎస్ జగన్.

అరుదైన చరిత్ర

ఓ ముఖ్యమంత్రి తనయుడు ముఖ్యమంత్రి కావడం మన దేశంలో గతంలో జరిగిందే. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇదే ప్రప్రధమం. ఒడిషాలో బిజూ పట్నాయక్ కుమారుడు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యారు. దేవె గౌడ తనయుడు హెచ్.డి. కుమారస్వామి కర్నాటక ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు. యూపీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ యువ ముఖ్యమంత్రిగా యూపీలో 2017 వరకూ కొనసాగారు. జమ్మూ కాశ్మీర్ లో ఫరూక్ అబ్దుల్లా ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రులుగా సేవలందించారు. ముఫ్తీ మహమ్మద్ కుమార్తె మహబూబా ముఫ్తీ కూడా కాశ్మీర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ముఖ్యమంత్రుల సంతానం ముఖ్యమంత్రులు కావడం చాలాకాలంగా జరుగుతున్నదే అయినా దక్షిణాదిలో అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకూ ఈ ప్రత్యేకత చోటు చేసుకోలేదు. నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి కుమారుడు వైఎస్ జగన్ ఆ ఘనత సాధించారు.

రికార్డుల వెనుక సవాళ్లు

ముఖ్యమంత్రి సంతానానికి ఆ పదవి వారసత్వం కాదు. ప్రజల మనసులు గెలుచుకుని, ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటేనే గానీ ఇది సాధ్యం కాదు. తండ్రి చేసిన మంచి చెడుల ప్రభావం రాజకీయ వారసుడిపై తప్పనిసరిగా ఉంటుంది. సానుకూల అంశాలు ఎన్ని ఉంటాయో ప్రతికూలతలు అంతకు మించి ఉంటాయి. వాటన్నిటినీ దాటుకుంటూ ప్రజారంజకంగా పాలించి గొప్ప వారసులుగా పేరు తెచ్చుకున్నవారు అతికొద్దిమందే.

కొడుకులందు కొరగాని వారు వేరయా

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నిర్విరామ పాలనను తునాతునకలు చేసి ప్రభంజనంలా వచ్చారు ఎన్టీరామారావు. తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిపై తన గర్జన గళాన్ని వినిపించారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచారు. ఓటమిని తన గెలుపుతో ఓడించిన ఆ మహానాయకుడికి సరైన రాజకీయ వారసులు లేకపోవడం దురదృష్టం. ఎన్టీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు, నాయకత్వ పటిమ లేక ఆయన కుమారులు వెనుకబడిపోయారు. వెన్నుపోటుతో ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని కబ్జా చేసిన చంద్రబాబు మూడు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసారు. కానీ ఆయనకు సైతం పార్టీని నడిపించగల సత్తా ఉన్న వారసులు లేకపోవడం ఆపార్టీ నేతలకు విచారం కలిగే అంశం.

 మంచి చేసే వారసత్వ రాజకీయాలను ప్రజలు స్వాగతిస్తున్న తరుణంలో  వైఎస్సార్ లాంటి పాలనను వైఎస్ జగన్ నుంచి ఆశించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. తండ్రి ఆశయాలను, ఆలోచనలను, సిద్ధాంతాలను నిలిపే వ్యక్తి జగన్ అని నమ్మి భారీ మెజారిటీతో ఎన్నికల్లో గెలిపించారు. జగన్ అనే నేను అంటూ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న యువనాయకుడు ఆ మహానేత అడుగుజాడల్లో నడవడమే కాదు తండ్రి కంటే రెండు అడుగులు ఎక్కువే వేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతానని కూడా ప్రమాణం చేస్తున్నారు. ఇది అరుదైన సందర్భమే కాదు. రాష్ట్ర ప్రజానీకానికి అపురూపమైన శుభసమయం కూడా. రాజన్న రాజ్యం రాకకు సూచనగా మండే మంటలను చల్లార్చుతూ వరుణ దేవుడు కరుణ కురిపించడం చూస్తే ప్రజల నమ్మకం వమ్ముకాదని అనిపిస్తోంది.

తాజా ఫోటోలు

Back to Top