బీసీ బాబాగా చంద్రబాబు కొత్త అవతారం

 దశాబ్దాలుగా బీసీలకు అన్యాయం

బీసీలు ఒక్కరు గుర్తుకు రాలేదా 

ఆదరణ పేరుతో హడావుడి

నిన్ను నమ్మం బాబు అంటున్న బీసీలు

ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కొత్త అవతారం  ఎత్తారు.  ఇన్నాళ్లుగా అధికారంలో ఉండి వెనుకబడిన వర్గాలకు  ఏ  ఒక్క మేలు చేయని చంద్రబాబు  ఎన్నికలకు రెండు నెలల ముందు అది చేస్తాం..ఇది చేస్తామంటూ జయహో బీసీ పేరుతో మీటింగ్ పెట్టి అబద్ధాలు చెబుతున్నారు. బాబు మాటలు విన్న రాష్ట్ర ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ఇక నిన్ను నమ్మం బాబూ అంటూ ముక్త కంఠంతో నినదిస్తున్నారు. చంద్రబాబు లాంటి పచ్చి అవకాశవాది మరొకరు ఉండరేమో. అవసరాలను బట్టి అవకాశవాద పొత్తులు పెట్టుకోవడంలో ఆయనకు ఎవరూ సాటి రారు. అధికారమే పరమావధిగా ప్రజలకు హామీలు గుప్పించి.. అధికారంలోకి వచ్చాక నేనెప్పుడన్నాను అని చాలా సులువుగా మాట తప్పగల ఘనుడు చంద్రబాబు. రుణమాఫీ, కాపులకు రిజర్వేషన్లు, ఏపీకి ప్రత్యేక హోదా.. లాంటి ప్రధాన హామీల విషయంలో చంద్రబాబు అనుసరించిన వైఖరిని ఏపీ ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. ఆయా హామీల అమలు కోసం వైఎస్సార్‌సీపీ ధర్నాలు చేస్తే ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నాడో చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు మాటతప్పే విద్యను ఎల్లో మీడియా వెనకేసుకొచ్చినా.. సోషల్‌ మీడియా మాత్రం ఎప్పటికప్పుడు పోస్టుమార్టం చేస్తూనే ఉంది. బాబుకు యూటర్న్‌ అంకుల్‌ అని బిరుదు కూడా కట్టబెట్టారు. 2014లో రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకు హామీలిచ్చి మోసం చేసిన చరిత్రను ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన కులాల్లో ఒకటైన కాపుల ఓట్ల కోసం రిజర్వేషన్లు కల్పిస్తానని సాధ్యం కాని హామీ ఇచ్చాడు. గడిచిన ఐదేళ్లుగా తమ రిజర్లేషన్ల కోసం కాపులు తిరగబడుతుంటే అరెస్టులు, అక్రమ కేసులతో అణచివేయించాడు. ఈ నేపథ్యంలో రాబోయే 2019 ఎన్నికల్లో కాపుల ఓట్లు పడే అవకాశమే లేదని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే కొత్తగా బీసీ జపం మొదలు పెట్టాడు. బీసీ బాబాగా కొత్త అవతారం ఎత్తుతున్నాడు.  

దశాబ్దాలుగా అన్యాయం

ఓట్ల రాజకీయం కోసం బాబు వేసుకొన్న అనేక ముసుగుల్లో ‘సామాజిక న్యాయం’ ఒకటి. తెలుగుదేశం పార్టీ  పగ్గాలు చంద్రబాబు చేతికొచ్చాక.. సామాజిక న్యాయం ఒక నినాదంగానే మిగిలింది. 2009 ఎన్నికలకు ముందు బీసీ గర్జన పేరుతో టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి వరంగల్‌ లో ఏర్పాటు చేసిన సభలో బీసీలకు 100 సీట్లు ఇస్తానని డిక్లరేషన్‌ ప్రకటించారు. కానీ, 2009లో ఇచ్చిన మాట తప్పారు. 2014లో ఆ ఊసే లేదు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బీసీలకు నామమాత్రపు ప్రాతినిధ్యమే తప్ప.. వారి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించడం లేదు. బీసీలు మెజార్టీగా ఉన్న శ్రీకాకుళం, అనంతపురం మినహా లోక్‌సభ అభ్యర్థులుగా బీసీలకు టికెట్లివ్వడం లేదు. అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట వరకు రెండు కులాలకే లోక్‌సభ టికెట్లు కేటాయించారు. అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపుల్లో బీసీలకు మొండి చేయి చూపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వృత్తిదారులైన బీసీ కులాలు అనేకం ఉన్నాయి. వారందరికీ దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో విశాఖ జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ఎంతమంది బీసీలకు టికెట్లిస్తారో బాబు చెప్పగలరా..? 

ఇప్పుడు కొత్తగా ‘జయహో బీసీ’ అనే కార్యక్రమం ద్వారా దగ్గర అవ్వాలని కలలు కంటున్నారు. 2014లో ఇచ్చిన హామీలు ‘బీసీ డిక్లరేషన్‌‘, ‘ప్రతి సంవత్సరం రూ. పది వేల కోట్ల నిధులతో బీసీ సబ్‌ ప్లాన్‌‘ఇంత వరకు అమలు చేయలేదు. పైగా కాపులు తమకు ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్‌ కల్పించాలని ఉద్యమాలు చేస్తే.. బీసీలకు కాపుల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహారం నడిపారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత తన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎవ్వరూ కుల సంఘాలు ఏర్పాటు చేసే మీటింగులకు, కుల సంఘాల వనభోజనాలకు వెళ్లవద్దని హుకుం జారీ చేశాడు. కులాల ద్వారా ఎవరూ అధికారం చేపట్టలేరని స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం ‘బీసీల కోసం బడుగు తేజం’ కార్యక్రమం ద్వారా ‘బీసీ డిక్లరేషన్‌‘, ‘బీసీ సబ్‌ ప్లాన్‌‘అమలు చేసే విషయాన్ని పూర్తిగా మరిచి పోయే విధంగా ఆదరణ పథకం–2 ద్వారా పనిముట్లు ఇస్తామని కబుర్లతోటే కాలక్షేపం చేశాడు. అవన్నీ జనం నమ్మడం మానేయడంతో ఎన్నికల కోసం కొత్తగా ‘జయహో బీసీ’అనే కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చాడు. 

బీసీలు ఒక్కరు గుర్తుకు రాలేదా 

2014లో అధికారంలోకి వచ్చాక జనాభాలో 2 శాతం లోపు ఉన్న తన సామాజికవర్గం వారికి 6 మంత్రిపదవులు కట్టబెట్టిన ఘనుడు బాబు. అంతేకాదు ఐదు రాజ్యసభ సీట్లు వస్తే సుజనాచౌదరి, గరికపాటి, కనకమేడల (ముగ్గురు కమ్మ కులస్తులు), సీఎం రమేష్‌ (వెలమ), టీజీ వెంకటేష్‌ (వైశ్య)లకు కేటాయించాడు. మరి ఇవ్వాళ ప్రేమ ఒలకబోస్తున్మ బీసీలు ఒక్కరు గుర్తుకు రాలేదు. జనాభాలో 2 శాతం లేని తన కులస్తులకు 15 నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టినప్పుడు బీసీలు ఎందుకు గుర్తు రాలేదు?  కేంద్రంలో రెండు మంత్రి పదవులు తీసుకున్న చంద్రబాబు.. సుజనా చౌదరికి, అశోక్‌ గజపతి రాజులకు ఇప్పించారు. సుజనా చౌదరి బ్యాంకులకు రూ. 6 వేల కోట్లు ఎగ్గొట్టాడని లుకౌట్‌ నోటీసులు వచ్చినా అలాగే చివరిదాకా కొనసాగించాడే కానీ.. రాజీనామా చేయించలేదు. తన పార్టీలోనే బీసీ ఎంపీలుగా ఉన్న సీనియర్‌ నాయకులు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్పలను కనీసం గుర్తించలేదు. పార్టీ సీనియర్‌ నేత కొడుకుగా ఎ్రరన్నాయుడి కొడుకు రామ్మోహన్‌నాయుడికి సైతం ఉత్తరాంధ్ర కోటాలోనైనా కేంద్ర మంత్రిని చేయలేకపోయాడు. బీసీల విషయంలో చంద్రబాబు వైఖరిపై బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్, మాజీ జస్టిస్‌ ఈశ్వరయ్య తీవ్రంగా విమర్శలు గుప్పించారు. 

ఆదరణ పేరుతో హడావుడి

వెనుకబడిన కులాలు ముఖ్యంగా బీసీ కులాల సామాజికంగా అభివృద్ధి సాధించాలన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారిని కేవలం కుల వృత్తి చేసుకునే వర్గాలుగా చూస్తూ చంద్రబాబు హయాంలో ఆదరణ పేరుతో ఇస్త్రీ పెట్టెలు, మోకులు, మొగతాళ్లు, సైకిళ్లు (అవి కూడా ఏమాత్రం నాణ్యత లేనివన్న విషయం అప్పట్లోనే చెప్పుకున్నారు) ఇచ్చి ఎంతో చేశానని విస్తత ప్రచారం చేసుకున్నారు. బీసీ వర్గాల్లో వృద్ధులను ఆదుకోవటానికి వైఎస్‌ పెన్షన్లు మంజూరు చేస్తే.. గతంలో చంద్రబాబు హయాంలో పెన్షనర్లలో ఒకరు చనిపోతే వారి స్థానంలో కొత్త వారికి పెన్షన్‌ ఇచ్చే విధానం అమలులో ఉండేది. 

 

Back to Top