వైయ‌స్ జగనే సీఎం

ఇండియాటుడే సర్వేలో మరోసారి ముందంజలో వైయ‌స్‌ జగన్‌

అమరావతి: వైయ‌స్‌ జగన్‌ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి కానున్నారని ‘ఇండియాటుడే’ టీవీ చానెల్‌ తేల్చి చెప్పింది. తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు జాతీయ చానెల్‌ ఇండియా టుడేలో ప్రసారమయ్యే ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజి’ (పీఎస్‌ఈ) కార్యక్రమం వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో మారుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులు, ఓటర్ల మనోగతంపై ఇది ఎప్పటికపుడు విడతలవారీగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తుంటుంది. చానెల్‌ యాంకర్‌ రాహుల్‌ కమల్‌ ఈనెల 18వ తేదీన నిర్వహించిన ఈ కార్యక్రమం(లైవ్‌షో)లో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిస్థితులపై పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. తాజాగా ఫిబ్రవరిలో ‘యాక్సెస్‌ మై ఇండియా’ ద్వారా నిర్వహించిన సర్వేలో ‘మీ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు?’ అన్న ప్రశ్నకు 45 శాతం మంది వైయ‌స్‌ జగన్‌వైపు స్పష్టంగా మొగ్గు చూపారు. 36 శాతం మంది నారా చంద్రబాబు సీఎంగా కొనసాగాలని కోరుకున్నారు. గత సెప్టెంబర్‌తో పోలిస్తే వైయ‌స్‌ జగన్‌కు మద్దతిస్తున్న వారు 2 శాతం పెరగగా, సీఎం చంద్రబాబు పట్ల ఆదరణ 2 శాతం క్షీణించడం గమనార్హం. ప్రస్తుతం సీఎం చంద్రబాబుతో పోలిస్తే ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ 9 శాతం ఆధిక్యతతో ఉన్నారు. 

వైయ‌స్ జగన్‌కు రెండు శాతం ప్లస్‌.. బాబుకు రెండు శాతం మైనస్‌
ఇదే సంస్థ గత సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వేలో కూడా వైయ‌స్ జగన్‌ స్పష్టమైన ఆధిక్యతలో ఉండటం గమనార్హం. గత సెప్టెంబర్‌లో వైయ‌స్ జగన్‌ సీఎం కావాలని 43 శాతం మంది ప్రజలు కోరుకోగా, చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని 38 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి జగన్‌కు మరో 2 శాతం మద్దతు పెరగడంతో బలపరిచే వారి శాతం 45 శాతానికి చేరుకుంది. మరోవైపు చంద్రబాబుకు 2 శాతం మద్దతు తగ్గడంతో 36 శాతానికి పడిపోయింది. 2014 ఎన్నికల్లో మాదిరిగానే 2019లో కూడా వైయ‌స్ఆర్‌ సీపీ, టీడీపీ మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొన్నట్లు ఈ సర్వేలో విదితం అయింది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలనుకునే వారి శాతం క్రమంగా పడిపోతోందనేది సర్వేలో వెల్లడైంది. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం పవన్‌ ముఖ్యమంత్రి కావాలనుకునే వారు 5 శాతం మంది ఉండగా ఫిబ్రవరి వచ్చే నాటికి ఇది 4 శాతానికి పరిమితమైంది.
 
నిరంతరం ప్రజల్లోనే వైయ‌స్ జ‌గ‌న్‌..
ప్రస్తుత సర్వే డేటా ప్రకారం సీఎం చంద్రబాబుతో పోలిస్తే ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ 9 శాతం ఆధిక్యతతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొందని, వారి దృష్టిలో వైయ‌స్ జగన్‌ పరిణితి చెందిన నాయకుడిగా నిలబడ్డారనేది ఈ సర్వే ద్వారా తెలుస్తోందని లైవ్‌షోలో పాల్గొన్న కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి కుమారుడిగా గుర్తించారని, ఇప్పుడు ఆయన్ను రాటుదేలిన నేతగా పరిగణిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. సుదీర్ఘ పాదయాత్రతో పాటు నిరంతరం ప్రజల్లోనే గడపటం వైయ‌స్ జగన్‌కు బాగా కలిసి వచ్చాయని దక్షిణ భారత రాష్ట్రాల రాజకీయాల విశ్లేషణ నిపుణుడు వీరరాఘవ్‌ పేర్కొన్నారు. దివంగత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి గతంలో చేసిన పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి దోహదం చేసిందని, వైయ‌స్‌ కృషి వల్లనే కేంద్రంలో కూడా అధికారం ఎన్డీఏ  చేతి నుంచి జారిపోయి యూపీఏకు పగ్గాలు లభించేలా చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కూడా జగన్‌ చేసిన పాదయాత్ర ఏపీలో అదే మాదిరిగా సత్ఫలితాలను ఇవ్వబోతోందన్నారు. గత ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ సీపీ స్వల్ప తేడాతో ఓటమి పాలైందని, అప్పట్లో సంస్థాగత వైఫల్యాలే ఆ పార్టీని అధికారానికి దూరం చేశాయని రాఘవ్‌ విశ్లేషించారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ – కాంగ్రెస్‌ల  పొత్తు వికటించిందని, ఆ జంకుతోనే ఏపీలో అవి రెండూ పొత్తు పెట్టుకునే అవకాశం ఉండదన్నారు. ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని నారా లోకేష్‌ స్వయంగా తనకు చెప్పారని ఈ సందర్భంగా రాహుల్‌ కమల్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ – కాంగ్రెస్‌ మధ్య పొత్తు లేకపోయినా రాహుల్‌గాంధీతో చంద్రబాబు సన్నిహితంగా మెసలటాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్రాన్ని విభజించి తమకు అన్యాయం చేసిన కాంగ్రెస్‌పై ఏపీ ప్రజల్లో ఆగ్రహం చల్లారలేదన్నారు. ఆ పార్టీ ఏపీలో కోలుకోవడానికి మరిన్ని ఎన్నికలు అవసరమన్నారు. డేటా వివరాల ప్రకారం ఏపీలో మెజారిటీ ప్రజలు జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, చంద్రబాబు కన్నా ఆయన బాగా ఆధిక్యతలో ఉండటమే ఇందుకు నిదర్శనమని ఇండియా టుడే విశ్లేషకుడు కౌశిక్‌ జగ్గా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు స్పష్టమైన రాజకీయ వైఖరిని తీసుకోలేక అయోమయంలో ఉన్నారని, కానీ జగన్‌ మాత్రం సమైక్యాంధ్ర విధానానికే తొలి నుంచి కట్టుబడ్డారని రాహుల్‌ కమల్‌ చెప్పారు. 

 

తాజా ఫోటోలు

Back to Top