ప్రజలు ఆశీర్వదిస్తే చరిత్ర సృష్టిస్తా..

 అమరావతి : ‘ప్రజలు ఆశీర్వదిస్తే చరిత్ర సృష్టిస్తాం. భవిష్యత్‌ కోసం ప్రజల ఆశా,  ఆకాంక్షలే ఈ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ సీపీని గెలిపిస్తాయి. ప్రజల సుఖసంతోషాలే లక్ష్యంగా పనిచేస్తాను’అని వైయ‌స్ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ‘విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎన్నికలను ప్రభావితం చేయాలన్న చంద్రబాబు పన్నాగాన్ని ప్రజలుతిప్పికొడతారు’అని కూడా  ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ‘చంద్రబాబు ఆనాడు హైదరాబాద్‌ను నిర్మించనూ లేదు. ప్రస్తుతం అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదు’అని విమర్శించారు.

ఏ పార్టీతోనూ తమకు పొత్తుగానీ, సాన్నిహిత్యంగానీ లేదని స్పష్టం చేస్తూ ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతిస్తామని తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ‘ఇండియా టుడే’ టీవీ ఛానల్‌ కన్సల్టెంట్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్రంలో ఎన్నికలు, జాతీయస్థాయి రాజకీయాలపై తన అభిప్రాయాలను ఇలా వెల్లడించారు. ఏడాదిన్నరపాటు రోడ్డు మీదే ఉన్నారు.

మీ పాదయాత్ర జయప్రదమైంది. మీ గెలుపునకు ఎన్ని రోజుల దూరంలో ఉన్నారనుకుంటున్నారు?  14 నెలల పాటు ప్రజాసంకల్పయాత్ర చేశా. అది పూర్తి చేసిన వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాను. పాదయాత్ర మీ రాజకీయ జీవితంలో చాలా కీలకమైంది. మీనాన్న గారు చనిపోయి ఇప్పటికి పదేళ్లు అయింది. ఈ పదేళ్ల ప్రయాణం మీకు ఎలా అనిపిస్తోంది?  ప్రతి నిత్యం పోరాటమే. ప్రతిపక్షంలో ఉన్నందునక్షణ క్షణమూ పోరాటమే చేస్తున్నాం. ఇప్పుడది క్లైమాక్స్‌కు వచ్చింది.  

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : ఓదార్పు యాత్రకు అనుమతించని కాంగ్రెస్‌ పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ పూర్తిగా దెబ్బతింది. మీరు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్‌ పార్టీపై ప్రతికారం తీర్చుకోవాలనుకుంటున్నారా? 
జగన్‌మోహన్‌ రెడ్డి : నేనెందుకు ప్రతికారం తీర్చుకోవాలి ? నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నా. నేనిప్పుడు నా ప్రజలకు ఎంతమేర మంచి చేయాలన్న దాని గురించే ఆలోచిస్తాను. ప్రస్తుతం కూడా అదే  ఆలోచిస్తున్నా.  

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : చంద్రబాబు  ఇప్పటికీ మీపైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ప్రతీ శుక్రవారం విచారణ కోసం కోర్టుకు హాజరవుతున్నారని పదే పదే విమర్శిస్తున్నారు కదా? 
జగన్‌మోహన్‌ రెడ్డి :మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేను కాదు ఎంపీనీ కాదు. ఏనాడూ సెక్రటేరియట్‌కు కూడా వెళ్లలేదు. అప్పుడు నేను అసలు హైదరాబాద్‌లోనే లేను. మా పిల్లల చదువు కోసం మేము బెంగళూరులో ఉన్నాం. నా మీద కేసులకు సంబంధించి మరో విషయాన్ని గమనించాలి.  మా నాన్న జీవించి ఉన్నన్నాళ్లూ నాపై  ఎలాంటి కేసులూ లేవు. నేను కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నంతవరకూ కూడా కేసులు లేవు.  నా మీద ఈ కేసులన్నీ ఎప్పుడు వచ్చాయి...  నేను కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకొచ్చిన తరువాతే నా మీద కేసులు వేశారు. కాంగ్రెస్, టీడీపీ కలసి కుమ్మక్కై నా మీద అక్రమ కేసులు బనాయించారు. ఇవన్నీ రాజకీయ కక్షతో వేసిన కేసులే.  

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, చంద్రబాబు మధ్య ఎన్నికల పోరు సాగింది.  ఇప్పుడు చంద్రబాబే మీకు ప్రధాన శత్రువు కదా?  
జగన్‌మోహన్‌ రెడ్డి : నాకు చంద్రబాబుగానీ కాంగ్రెస్‌ గానీ శత్రువులు కారు. నాకు ప్రజా క్షేమమే ముఖ్యం. ప్రజల సంతోషమే కావాలి. ప్రజలు ఆశీర్వదించి నాకు అవకాశం ఇస్తే గొప్పగా పనిచేస్తాను. చరిత్ర పునరావృతం అవుతుంది.  

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : చంద్రబాబు శత్రువు కాదు... ప్రధాన ప్రత్యర్థి అని ఒప్పుకుంటారా? 
జగన్‌మోహన్‌ రెడ్డి : కావచ్చు. రాష్ట్రంలో ఇప్పుడు రెండే ప్రధాన పార్టీలు ఉన్నాయి. అధికార పార్టీపైన విపరీతమైన  ప్రజా వ్యతిరేకత కన్పిస్తోంది. ఇది మాకు ఎన్నికల్లో అనుకూలిస్తుందని భావిస్తున్నాం.  

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : చంద్రబాబు తాను ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో పోరాడుతున్నాను అంటున్నారు. మీరు మాత్రం ఎన్నికల తరువాత నరేంద్రమోదీతో కలవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు అని విమర్శిస్తున్నారు కదా 
జగన్‌మోహన్‌ రెడ్డి : మాకు బీజేపీ, కాంగ్రెస్‌ రెండు సమాన దూరమే.  మా లక్ష్యం చాలా నిర్ధిష్టంగా ఉంది. ఎవరైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారో వారికే మేము మద్దతిస్తాం. దీనికి కూడా కారణం ఉంది.  రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి షరతులు లేకుండా మాకు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారు. అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసే ఆ హామీ ఇచ్చాయి. రాజధాని ఉన్నప్రాంతం తాము ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతామని అడగడం దేశచరిత్రలో అదే తొలిసారి. అంతవరకు రాజధానిగా ఉన్న   హైదరాబాద్‌ వెళ్లిపోయాక మా రాష్ట్రంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు కోసం ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అందుకే ప్రత్యేక హోదా అన్నది మాకు అత్యంత కీలకమైంది. 

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : తాము అధికారంలోకి వస్తే వారంరోజుల్లోనే  ప్రత్యేక హోదా ఇస్తామని  రాహుల్‌ గాంధీ అంటున్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే మీరు రాహుల్‌ గాంధీకి మద్దతిస్తారా?  
జగన్‌మోహన్‌ రెడ్డి : ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయాలతో సంబంధం లేదు. నాకు నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మా మద్దతు ఉంటుంది. తొలుత మా ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని నమ్మితే ఏమి చేసింది. రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టి మోసం చేసింది. ఆ తర్వాత బీజేపీ కూడా అదే విధంగా చేసింది. 
అప్పటి అధికార కాంగ్రెస్‌ పార్టీ బీజేపీతో కలసి రాష్ట్రాన్ని విభజించింది. 2014లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా  నరేంద్ర మోదీ కూడా వారి పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి అయిన తరువాత ప్రత్యేక హోదా ఇచ్చే స్థాయిలో ఉండి కూడా ఆయన మాకు వెన్నుపోటు పొడిచారు. కాబట్టి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా మా రాష్ట్రాన్ని మోసం చేశాయి. అందుకే ఇప్పుడు మేము ఎవ్వరినీ నమ్మే స్థితిలో లేం. ప్రజల మనోభీష్టం మేరకు మేము ఇప్పుడు ఒక ప్రతిపాదన పెడుతున్నాము. దేవుడి దయవల్ల పార్లమెంటులో 25 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే ... ప్రత్యేక హోదాకు సంతకం పెట్టండి... మా మద్దతిస్తాము అని కచ్చితంగా చెబుతాం.  

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : ఒకవేళ నరేంద్ర మోదీకి 25 సీట్లు తగ్గి.. మీ చేతిలో 25 సీట్లు ఉంటే.. ప్రత్యేక హోదాపై సంతకం పెట్టు.. మద్దతు ఇస్తానంటారు. అంతేనా?  
జగన్‌మోహన్‌ రెడ్డి : అవును. కచ్చితంగా అంతే.  

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : మీ పార్టీకి మైనార్టీల మద్దతు ఉంది. ఎన్నికల తరువాత మీరు బీజేపీతో కలిస్తే ఆ ఓటర్లు మిమ్మల్ని వీడుతారని అనుకుంటున్నారా... ఎన్నికల తరువాత ఇలాంటి అంశాలు మీ పొత్తును ప్రభావితం చేస్తాయా... లేక ప్రత్యేక హోదా ఒక్కటే మీ అంశమా...? 
జగన్‌మోహన్‌ రెడ్డి : మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. అయితే ప్రత్యేక హోదా విషయంలో మాకు మద్దతు ప్రకటించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు.  

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : బీజేపీ సిద్ధాంతాల గురించి ఏం చెబుతారు? వాటిని మీరు పరిగణలోకి తీసుకోరా?రాష్ట్రంలో మేం 25 ఎంపీ సీట్లు గెలిచి
జగన్‌మోహన్‌ రెడ్డి : ఆ బలానికి తెలంగాణ కూడా మద్దతిస్తే కలిపి 42 ఎంపీ స్థానాలతో మేం ఓ గణనీయమైన శక్తిగా ఉంటాం. అపుడు మేం ప్రత్యేక హోదా డిమాండ్‌ చేసే బలమైన శక్తిగా ఉంటాం.  

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు కదా. ప్రత్యేక హోదా కావాలి, ఈ విషయంలో మోదీ ద్రోహం చేశారు అని చెబుతున్నారు కదా? 
జగన్‌మోహన్‌ రెడ్డి : ఐదేళ్ల పాలనలో 4 ఏళ్లు చంద్రబాబు–బీజేపీ కలిసి మెలిసి ఉన్నారు. వారి ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ నాలుగేళ్లలో టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు మంత్రివర్గం తీసుకున్న చాలా నిర్ణయాల్లో భాగస్వాములుగా ఉన్నారు. అయితే వాళ్లెప్పుడూ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడనే లేదు. ఇంకా దారుణమైన అంశం ఏమంటే ఈ నాలుగేళ్లు వారు బాగా అతుక్కుపోయి ఉన్నారు.  బీజేపీ–టీడీపీ కలిసి ప్రయాణం చేశారు. ఇక వాస్తవానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను విభేదించారు. 2017, సెప్టెంబర్‌ 8న అర్థరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక హోదా లేదని చెబుతూ దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ఇస్తున్నట్లు ప్రకటించినపుడు టీడీపీ మంత్రులు ఆయన పక్కనే ఉన్నారు. జైట్లీ ప్యాకేజీ ప్రకటన చేసిన నాలుగు నెలలకు, జనవరి 27, 2018న చంద్రబాబు విలేకరుల సమావేశం పెట్టి బీజేపీ ప్రభుత్వం ఏపీకి చేసినంత మేలు చరిత్రలోనే ఎప్పుడూ చూడలేదని
పొగిడారు.  

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : మీరు అధికారంలోకి వస్తే  చంద్రబాబుపై విచారణకు ఆదేశిస్తారా? 
జగన్‌మోహన్‌ రెడ్డి : తప్పకుండా ఆయనపై విచారణ జరిపిస్తాం. నేరస్తులను జైలుకు పంపేలా కచ్చితంగా చేస్తాం.  

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : చంద్రబాబుపై మీరు చేస్తున్న అధికార దుర్వినియోగం, ఆయన ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపైన వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తారా? మీపై  కేసులు చంద్రబాబు పెట్టించారు కనుక మీరు చంద్రబాబుపై అలాగే కేసులు పెట్టి ఆయన్ను బాధ్యునిగా చేసేందుకు ప్రయత్నిస్తారా? 
జగన్‌మోహన్‌ రెడ్డి : మీరే చెప్పండి నేనేం చేయాలో.... ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపుల సాక్షిగా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు.  కోట్లాది రూపాయల నల్లధనం ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి చంద్రబాబు.  నల్లధనంతో ప్రలోభపెడుతూ దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాంటి వ్యక్తిని విడిచిపెట్టాలా?  అదెలా సాధ్యం? ... ఇలా అడ్డంగా దొరికిన ముఖ్యమంత్రి అసలు తన పదవికి రాజీనామా చేయలేదు. ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు. ఆయన్ను జైలుకూ పంపలేదు. మరి అలాంటి ఆయనపై కేసు పెట్టి విచారించాలి కదా.  

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్, అసదుద్దీన్‌ ఒవైసీ ఓ విధమైన ఎన్నికల ముందస్తు పొత్తుతో ఉన్నారని భావించాలా?  అందరూ కలిస్తే 42 సీట్లు అవుతాయని మీరంటున్నారు కనుక అలా అనుకోవాలా? 
జగన్‌మోహన్‌ రెడ్డి : మా మధ్య ఎలాంటి పొత్తూ లేదు. అయితే మా మధ్య ప్రజల ఉమ్మడి ప్రయోజనాలున్నాయి. జాతీయ స్థాయిలో మేం కోరుకునేదేమిటంటే మా మొర ఆలకించడానికి, మా వినతులు పట్టించుకోవడానికి ఎవరో ఒకరుండాలి. పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను ఇవ్వక పోతే ఇక ప్రజాస్వామ్యం ఎటు పోతుందనుకోవాలి?  

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : కేంద్రంలో ఎవరు ఉంటే మీకు బాగుంటుందనిపిస్తోంది? కాంగ్రెస్‌ సారథి రాహుల్‌ గాంధీనా?  బీజేపీ సారథి నరేంద్ర మోదీనా? 
జగన్‌మోహన్‌ రెడ్డి : మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని సంతకం చేసే వారు ఎవరైనా సరే మాకు బాగానే ఉంటుంది. కేంద్రంలో ఎవరికీ మెజారిటీ రాని పరిస్థితి ఉండాలి. అక్కడ ఫలితాలు ఏకపక్షంగా ఉండ కూడదని కోరుకుంటున్నాను. 

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : అంటే మీరు హంగ్‌ పార్లమెంటు ఏర్పడాలని కోరుకుంటున్నారా? 
జగన్‌మోహన్‌ రెడ్డి : అవును, మేం హంగ్‌ పార్లమెంటు రావాలని కోరుకుంటున్నాం.  

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : హంగ్‌పార్లమెంటు కావాలనే విషయంలో స్పష్టంగా ఉన్నారన్న మాట? 
జగన్‌మోహన్‌ రెడ్డి : కచ్చితంగా హంగ్‌ పార్లమెంటు కావాలనుకుంటున్నాను. అలా కాకుంటే పార్లమెంటులో ఇచ్చిన హామీకి దిక్కు లేకుండా పోతుంది. ఆరోజు పార్లమెంటులో అధికారపక్షం, ప్రతిపక్షం రెండూ కూడా మాకు ప్రత్యేక హోదా ఇస్తామన్నాయి . ఆ షరతుపైనే విభజించారు. పార్లమెంటులో ఇచ్చిన హామీ అమలు కాక పోతే ప్రజాస్వామ్యం నవ్వులపాలు అవుతుంది కదా! 

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : అంటే మీరు, కేసీఆర్, నవీన్‌ పట్నాయక్, మమతా బెనర్జీ, ఫెడరల్‌ ఫ్రంట్‌ లాంటివి (కేసీఆర్‌ చెబుతున్న విధంగా) వంటివి ఉంటే రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు, మరింత స్వయం ప్రతిపత్తి లభిస్తుందని భావిస్తున్నారన్న మాట.   
జగన్‌మోహన్‌ రెడ్డి : నేను కచ్చితంగా అలాంటి పరిస్థితే కావాలని కోరుకుంటున్నాను. నా రాష్ట్రం, నేను ప్రత్యేక హోదా విషయంలో ద్రోహానికి గురయ్యాము. మోసపోయాము కాబట్టి అలా కోరుకోవడంలో తప్పేమీ లేదనుకుంటున్నా.  

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : ఏపీ రాజకీయాల్లో డబ్బు  కూడా కీలక పాత్ర పోషిస్తోంది కదా. ఎన్నికల్లో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టగలిగే పార్టీయే గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడంలో మీరు చంద్రబాబుతో పోటీ పడగలరా?  
జగన్‌మోహన్‌ రెడ్డి : ఎన్నికల్లో డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుందని నేను భావించడం లేదు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతే ఎక్కువగా ఓటింగ్‌ను ప్రభావితం చేస్తుంది. చంద్రబాబు  ఈ ఐదేళ్ల పాలనలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు.  ఆయన ఎన్నికల్లో డబ్బు వెదజల్లి అందర్నీ అవినీతిపరులను చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక్కో ఓటుకు రూ.3వేలు కూడా ఇవ్వడానికి సిద్ధపడతారు. కానీ భవిష్యత్‌ కోసం ఆశ, ఆకాంక్షలే ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేసేలా చేస్తాయి.  

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : బీజేపీ మీకు డబ్బులు ఇస్తామనడం లేదా? ఎన్నికల తరువాత వారికి మద్దతివ్వాలనే షరతుతో ఇప్పుడు మీకు ఎన్నికల్లో డబ్బు సహాయం చేస్తామనడం లేదా...? 
జగన్‌మోహన్‌ రెడ్డి : బీజేపీగానీ కాంగ్రెస్‌ గానీ మాకు డబ్బులు ఏమీ ఇస్తామనడం లేదు. మాకు వారి డబ్బు వద్దు కూడా.   

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : ఈ ఎన్నికల్లో పవన్‌ కీలకంగా మారారు కదా? 
జగన్‌మోహన్‌ రెడ్డి : ఆయన గత ఎన్నికల్లో టీడీపీతో ఉన్నారు. టీడీపీ తరపున ప్రచారం చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడానికి ఆయన కూడా దోహదపడ్డారు.  ఈ ఐదేళ్లలో  నాలుగున్నరేళ్లు ఆయన  పూర్తిగా టీడీపీతోనే కలసి ఉన్నారు కూడా. రాష్ట్రంలో టీడీపీ ప్రజావ్యతిరేక పాలనలో ఆయన కూడా భాగస్వామి.  ప్రభుత్వ వైఫల్యాలకు ఆయన బాధ్యత కూడా ఉంది.
  
రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : మీరు సీఎం అయితే సింగపూర్‌వంటి అంతర్జాతీయ నగరంగా  అమరావతిని నిర్మించాలన్న చంద్రబాబు కలను కొనసాగిస్తారా?  
జగన్‌మోహన్‌ రెడ్డి : రాజ్‌దీప్‌ అసలు నిజం ఏమిటంటే... రాజధాని అమరావతిలో చూస్తే  ఏం కనిపిస్తోంది. శాశ్వత రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు ఒక్క ఇటుకు కూడా వేయ లేదు. అక్కడ ఉన్నది అంతా తాత్కాలికమే. 

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : వైఎస్‌ జీవించి ఉన్నప్పుడు మీరు ఈస్థాయిలో ఉంటానని ఎప్పుడైనా అనుకున్నారా?  
జగన్‌మోహన్‌ రెడ్డి : అస్సలు అనుకోలేదు.  ఇటువంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. ఆయన కాంగ్రెస్‌లో చాలా పెద్ద నాయకుడు.  అంతా సవ్యంగా సాగుతున్న సమయం..  

 

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : రాజకీయాల్లోకి రావాలని ఎందుకు  నిర్ణయం తీసుకున్నారు? 
జగన్‌మోహన్‌ రెడ్డి : మా నాన్న జీవించి ఉండగానే ఆయన ప్రోద్భలం వల్లే నేను రాజకీయాల్లోకి వచ్చాను.  2009లో ఆయన నన్ను రాజకీయాలలోకి తీసుకువచ్చారు.  నీకు మంచి మనసు ఉంది. నీలాంటి వాళ్లు తప్పక రాజకీయాల్లోకి రావాలన్నారు. దురదృష్టవశాత్తు ఆ తర్వాత వంద రోజులకు ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. దాంతో ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉండాల్సి వచ్చింది. మా నాన్న హెలికాఫ్టర్‌ కూలి చనిపోయిన ప్రాంతాన్ని చూశా. ఒక్కసారి మాట ఇస్తే వెనుకడుగు వేయని మా నాన్నకు ప్రజలతో ఉన్న అనుబంధం ఏమిటో తెలిసింది.  దుర్ఘటన జరిగిన ప్రాంతంలో జరిగిన సంతాప సభను చూసిన తర్వాత ఆయన కోసం మరణించిన వారి అన్ని కుటుంబాలను స్వయంగా పరామర్శిస్తానని నిర్ణయం ప్రకటించాను. వాళ్లందరూ నా కుటుంబ సభ్యులుగా భావించా. అందుకే ఆ మాట ఇచ్చాను. అది సెంటిమెంట్‌తో కూడిన అంశం. అదే విషయాన్నే కాంగ్రెస్‌ నాయకులకు చెప్పా. నేను రాజకీయాలకు కొత్త. అందువల్ల, అటువంటి మాట ఇచ్చేటప్పుడు నేను వాళ్ల అనుమతి తీసుకోవాలని కూడా తెలియదు. సోనియా గాంధీని మూడుసార్లు కలిసి ఆ విషయమే చెప్పా. ఈ విషయమై అహ్మద్‌ పటేల్‌ను ఆరేడు సార్లు కలిశా. మా నాన్న కోసం కన్నుమూసిన వారి కుటుంబాలన్నింటినీ పరామర్శించేందుకు అనుమతి ఇమ్మని పదేపదే కోరా. కారణమేమిటో తెలియదు గాని వాళ్లు నాకు అనుమతి ఇవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో నేను ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అలా ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న నిర్ణయమే నా గమ్యాన్ని మార్చేసింది.  

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : తాను హైదరాబాద్‌ నిర్మించాను. అమరావతి నిర్మిస్తాను అని చంద్రబాబు అంటున్నారు కదా?
జగన్‌మోహన్‌ రెడ్డి : చంద్రబాబు  హైదరాబాద్‌ నిర్మించారా...!?... మీకు కావాలంటే చంద్రబాబు ప్రభుత్వంలో హైదరాబాద్‌ అభివృద్ధి, నాన్నగారి ప్రభుత్వంలో హైదరాబాద్‌ అభివృద్ధికి సంబంధించిన గణాంకాలు, వివరాలు అన్నీ ఇస్తాను. హైదరాబాద్‌ అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రమాణాలు కూడా నాన్న ప్రభుత్వ హయాంలో కంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తక్కువగానే ఉన్నాయి. ఆయన అప్పుడు హైదరాబాద్‌ను నిర్మించ లేదు. ఇప్పుడు ప్రపంచస్థాయి అమరావతి రాజధానిని నిర్మించడమూ లేదు. 

 

తాజా ఫోటోలు

Back to Top