ఇది మానవత్వం ఉన్న ప్రభుత్వం

ఈ దిశగానే పాలన సాగుతుంది.

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి

 

అన్నం పెట్టే రైతన్నకే...అన్నం కరవైతే...పురుగుల మందే పెరుగన్నమైతే..దేవుడా ఎంత కష్టం..ఎంత నష్టం?! రైతు ఆత్మహత్య వార్త విన్న ప్రతిసారీ మనసున్న మనిషికి కలిగే స్పందన ఇది. ఈ పాపం ఎవరిది అని ప్రశ్నించుకుంటే...ప్రకృతిదా? పాలకులదా? అన్న ప్రశ్నలు ఎదురొస్తాయి. నిస్సందేహంగా అది ప్రభుత్వాలది. ప్రభుత్వాలను నడిపే పాలకులదే. వ్యవసాయంలో నష్టాలు ఊపిరాడకుండా చేస్తే, ఊపిరితీసేసుకునే రైతన్నకు బంధువంటే అది ప్రభుత్వమే. ఆదుకోవాల్సిన, చేయూతనివ్వాల్సిన ఆ ప్రభుత్వమే బండరాయిగా మారి, రైతుపట్ల, ఆ రైతుకుటుంబం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే...అది నిస్సందేహంగా పాలకుల పాపమే. 
రైతుల ఆత్మహత్యల వార్తలు వెలువడిన ప్రతిసారీ...సమాజంలో ఒక్కోరీతిలో స్పందనలు వెలువడుతుంటాయి. సాటి మనుషుల స్పందనలు పక్కనబెడితే, భరోసాగా నిలవాల్సిన ప్రభుత్వాల స్పందన మాత్రం మానవీయకోణాన్ని ప్రదర్శించాల్సిందే. మానవత్వం చూపాల్సిందే. ఇంటిపెద్దదిక్కున కోల్పోయిన ఆత్మహత్యచేసుకున్న రైతు కుటుంబానికి ...నేనున్నానని భరోసా ఇవ్వాల్సిందే. ఆ ఇంటికి దిక్కుగా నిలబడాల్సిందే. అంతకు మించిన పరమకర్తవ్యం మరొకటి లేదన్నది ఏలికలు తెలుసుకోవాల్సిన విషయం. గతంలో కొన్ని సందర్భాల్లో...ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం ఇస్తూపోతే...ఇక రైతులు పరిహారం కోసమే ఆత్మహత్యలు చేసుకుంటారని వాగిన రాక్షసపాలకులూ ఉన్నారు. అదీ కాకపోతే, ఆత్మహత్యవెనుక అసలు కారణాలు వేరే అని వాగిన నాయకులూ ఉన్నారు. అది పక్కన బెడితే..చనిపోయిన రైతు వ్యవసాయం చేశాడా? వ్యవసాయం దెబ్బకు ఎంత నష్టపోయాడు?ఎంత అప్పుల భారం మీద పడింది? దినదినగండంలా ఆ రైతు జీవితం నడిచిందా? లాంటి ఆలోచనల దిశలో సాగి, రైతు సాయానికి చేయూతనిద్దామన్న ఆలోచనే లేని నాయకులను కూడా చూశాం. 
ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, నకిలీవిత్తనాలు, ఎరువుల పాపం అన్నీ రైతును పిండిపిప్పి చేసేవే. కళ్లముందు ఎదిగొచ్చిన బిడ్డలు, మరోవైపు ఎదిగొచ్చిన బిడ్డలు...దిక్కుతోచని స్థితిలో ఏ రైతు ఆలోచననైనా సాగేది బలవన్మరణం వైపే. ఎందుకంటే రైతు ఆత్మాభిమానం మెండుగా వుండే మనిషి. రైతుకు అండాదండగా ప్రభుత్వాలు నిలిస్తే...రైతన్న గడపలో కన్నీటికి చోటు వుండదు. రైతు కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ వుండవు. 
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మానవత్వమే నా మతం అంటున్న ప్రభుత్వం వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రైతుల గురించి, వ్యవసాయరంగ సంక్షోభాన్ని మటుమాయం చేయడానికి నిరంతరప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశలో పల్లెగడపల్లో వెలుగులు నింపే ఎన్నో పధకాలను అమల్లోకి తెస్తున్నారు. జులై పదిన కల్లెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి స్పందన...మానవత్వం వున్న ప్రతివారి మన్ననలు పొందే రీతిలో ఉంది. 2014–2019 మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం చెల్లించడంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపరాదని, జాప్యం చేయరాదని ముఖ్యమంత్రి గట్టిగా దిశానిర్దేశం చేశారు. 
గత ఐదేళ్లలో డీసీఆర్‌బీ లెక్కల ప్రకారం 1,513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో 391మందికే పరిహారం అందినట్టు లెక్కలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం మిగిలినవారికి ఇవ్వలేదని అర్థమవుతోంది. అందరికీ పరిహారం అందివ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. బాధిత రైతు కుటుంబాలను ఆదుకోవాలని, ఆత్మస్థైర్యం నింపాలని కోరారు. రైతుకుటుంబాలకే నేరుగా చెక్కులు అందచేయాలని, ప్రభుత్వసాయం ఆ కుటుంబానికి ఉపయోగపడాలన్నది సీఎం ఆకాంక్ష. 
మనిషే చనిపోయాక మనం కూడా తోడుగా లేకపోతే ఎలా? ఇది మానవత్వం ఉన్న ప్రభుత్వం. ఆ దిశలోనే పాలన సాగుతుందని...గట్టిగా చెప్పారు ముఖ్యమంత్రి.ఆ తీరుగా ప్రజల ముఖ్యమంత్రిగా తన పాలనా రీతిని అధికారులకు స్పష్టం చేశారు సీఎం..

Back to Top