ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌కు పెద్దపీట

ఒక్క ఏడాదిలో 1.39 లక్షల ప్రీ ఆథరైజేషన్‌లు 

తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ మంది బాధితులు 

2018–19లో రూ.197 కోట్లు వ్యయం.. ఈ ఏడాది రూ.300 కోట్లు 

క్యాన్సర్‌ చికిత్సలు పెంచడంతో భారీగా పెరిగిన ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు

 అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో క్యాన్సర్‌ రోగులు పెద్దఎత్తున ఉపశమనం పొందుతున్నారు. గతంలో చికిత్సలు తక్కువ సంఖ్యలో ఉండటం, ఇతర రాష్ట్రాల్లో అనుమతి లేకపోవడం తదితర కారణాలతో రోగులు ఎక్కువగా ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించేవారు. దీనివల్ల ఆర్థిక భారంతో పేద రోగులు తీవ్రంగా చితికిపోయేవారు. కానీ, సీఎం వైయ‌స్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని పటిష్టపర్చడంతో ఒక్క క్యాన్సర్‌లోనే అదనంగా 54 చికిత్సలను చేర్చడం.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లోనూ చికిత్సకు అనుమతించడంతో బాధితులకు ఎంతో మేలు చేకూరుతోంది. ఏ ఆస్పత్రికి వెళ్లినా వైద్యం లేదనకుండా ఈ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నారు. 

ఒక్క ఏడాదిలో రూ.300 కోట్లు వ్యయం 
2018–19లో క్యాన్సర్‌ చికిత్సలకు గరిష్టంగా ఏటా రూ.197 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. కానీ, 2020–21లో సుమారు రూ.300 కోట్లు వెచ్చించారు. దీన్నిబట్టి క్యాన్సర్‌ చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో పెద్దపీట వేస్తోందో అంచనా వెయ్యొచ్చు. ఇందులో భాగంగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ కింద 38,935 మంది బాధితులు లబ్ధిపొందగా.. 1,39,701 ప్రీ ఆథరైజేషన్‌లు (కీమో, రేడియేషన్‌ వంటి వాటికి రావడం) జరిగాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 5,056 మంది బాధితులు నమోదయ్యారు. 

 

Back to Top