పిపిఎల పునః సమీక్షకు మార్గం సుగమం

రాష్ట్ర ప్రభుత్వ వాదనను సమర్ధించిన హైకోర్టు
 

అమరావతి: పిపిఎలు అంటే చంద్రబాబు పాపపుణ్యాల అటెండెన్సు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పిపిఎల విషయంలో బాబు చేసిన పాపాల భాగోతాలన్నీ బట్టబయలయ్యాయి. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పునఃసమీక్ష అన్న రోజు నుంచీ చంద్రబాబు ఉలికులికి పడుతూనే ఉన్నాడు. అలా ఎలా చేస్తారంటూ అల్లరల్లరి చేసాడు. ఇక కేంద్రం కూడా పిపిఎల పునః సమీక్ష చేస్తే పెట్టుబడిదారులు రారంటూ అడ్డుపుల్ల వేసే ప్రయత్నాలే చేసింది. కానీ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గడం లేదు. చౌక ధరలకు విద్యుత్ లభించే అవకాశం ఉన్నా అత్యధిక ధరల్లో విద్యుత్ కొనుగోళ్లను జరిపి, ఖజానాకు 2600 కోట్లు ఎందుకు భారం పెట్టాలి అని ప్రశ్నిస్తున్నారు. 
విద్యుత్ సంస్థలకు షాక్
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునః సమీక్షకు అవకాశమే లేదని కోర్టుకు వెళ్లాయి విద్యుత్ కంపెనీలు. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాదననే హైకోర్టు సమర్థించింది. విద్యుత్ నియంత్రణమండలికి వెళ్తామన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు అనుమతినిచ్చింది. విద్యుత్ ఒప్పందాల పునః సమీక్షపై వాదనలు ఏమున్నా ఏపీ ఈఆర్‌సీ ఎదుటే వినిపించమని హైకోర్టు విద్యుత్ సంస్థలకు సూచించింది. విద్యుత్ నియంత్రణా మండలి తీసుకునే నిర్ణయాలు తాము నిర్థారించలేమని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఆరునెలల్లోగా ఈ అంశంపై పరిష్కారం సూచించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలిని ఆదేశించింది. ఈలోపు మధ్యంతర చెల్లింపులు కింద యూనిట్ కు రూ.2.43 నుంచి, 2.44 పైసలు చెల్లిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనకు హైకోర్టు అంగీకరించింది. అలాగే ప్రభుత్వం నోటీసు ఇచ్చి చట్టప్రకారం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయచ్చని కూడా తెలియజేసింది. అయితే ఇప్పటికే ఉత్పత్తి చేసి ఉన్న విద్యుత్ ను మాత్రం తిరిగి తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రెగ్యులేటరీ కమీషన్ వద్ద ఇరుపక్షాలు వాదనలు వినిపిస్తుంన్నందున గతంలో జారీ చేసిన జీవోను పక్కన పెడుతున్నట్టు హైకోర్టు ప్రకటించింది. విద్యుత్ కంపెనీలకు ఒప్పందంలోని ప్రకారం కాకుండా కుదించిన లెక్కల ప్రకారం తాత్కాలిక చెల్లింపులు జరుపవచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులచ్చింది. 
బాబు చేసిన విద్యత్ మాయ
దేశంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ధరలు తగ్గాయి. కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది కూడా. 2010లో యూనిట్ రూ.18 ఉన్న సౌర విద్యుత్ ధర 2018లో రూ.2.18 పైసలకు చేరింది. పవన్ విద్యుత్ ఉత్పత్తి ధర సైతం మూడేళ్లలోనే గరిష్టంగా తగ్గి యూనిట్ రూ.4.20 నుంచి రూ.2.43 కు చేరింది. ఈ విషయాన్నిపార్లమెంట్లో ప్రస్తావించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 3వేల మెగావాట్ల పవన్ విద్యుత్ ను యూనిట్ రూ. 4.84 లకు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. అది కూడా ధర్మల్, హైడ్రో పవర్ తక్కువ ధరకే లభిస్తున్నప్పుడు కూడా ఇంత అధికంగా ప్రైవేటు సంస్థలకు ఎందుకు చెల్లించేలా నిర్ణయాలు తీసుకున్నారో బాబుగారికే తెలియాలి. చంద్రబాబు చర్యల వల్ల ప్రభుత్వ డిస్కంలు నష్టాల్లో కూరుకుపోయాయని, రోజుకు 7 కోట్లు నష్టం వస్తోందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసి చూపించారు. అధిక ధరల విద్యుత్ వల్ల పారిశ్రామిక రంగానికి భారంగా ఉందని తెలియజేసారు. 
హైకోర్టు తాజా నిర్ణయంతో విద్యుత్ ఒప్పందాలపై సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. విచ్చలవిడి ఖర్చులతో ఖజానాను ఖాళీ చేసిన చంద్రబాబు తుగ్లక్ నిర్ణయాలను నేడు వైయస్ జగన్ ప్రభుత్వం ఎన్నో శ్రమలకు ఓర్చి సరిదిద్దుతోంది. కేంద్రం, పెట్టుబడి సంస్థల ఒత్తిడులను అధిగమిస్తూ పిపిఎల పునః సమీక్షకు మార్గం సుగమం చేసుకున్న సీఎం పంతం రాష్ట్రానికి గుదిబండగా మారిన ఖర్చులనుంచి ఉపశమనం కలిగించిందంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు. 

Back to Top