పేదలకు పక్కా ఇళ్లు

ఏపీలో పేదల ఇళ్ల కోసం ఏకంగా 68,677 ఎకరాలు పంపిణీ 

కేంద్ర హౌసింగ్‌–పట్టణ వ్యవహారాల శాఖ ప్రశంసలు 

దేశంలో ఇంత పెద్ద ఎత్తున మరే రాష్ట్రంలోనూ ఇళ్ల స్థలాలివ్వలేదు.. 30 లక్షలకు పైగా మహిళా లబ్ధిదారుల పేరుతో పట్టాలు 

ఇళ్ల నిర్మాణంలోనూ ఉత్తమ విధానాలు 

కొత్తగా 17,005 జగనన్న కాలనీలు 

ఇప్పటికే 21.25 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం.. తద్వారా ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహం  

కోవిడ్‌ అనంతర ఆర్థిక పునరుద్ధరణకు దోహదం.. తాపీ, వడ్రంగి వంటి 30 వృత్తిపర వర్గాలకు భారీగా ఉపాధి 

కాలనీల్లో మౌలిక వసతులకు పెద్ద పీట 

సబ్సిడీపై స్టీలు, సిమెంట్, ఉచితంగా ఇసుక   

ట్రాన్స్‌జెండర్లకు కూడా ఇళ్ల స్థలాలతో వివక్ష నుంచి విముక్తి  

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చక్కటి ప్రణాళికతో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఆయా కాలనీల్లో అవసరమైన రోడ్లు, కాలువలు, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపా­యాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. లబ్ధిదారులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ ముందుకు సాగుతోంది. 
– కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  

 
అమరావతి: పేదలకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని  కేంద్ర గృహ నిర్మాణ–పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 30 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను సేకరించి.. ఏకంగా 68,677 ఎకరాలు పంపిణీ చేసిందని కొనియాడింది. ఇళ్ల స్థలాల పట్టాలన్నీ మహిళల పేరుపై మంజూరు చేయడం ద్వారా వారి సాధికారతకు తోడ్పడుతోందని మెచ్చుకుంది.

అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలన్న బృహత్తర లక్ష్య సాధన కోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లోనూ ఇంత పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ జరగలేదని, వారందరికీ ఇళ్ల నిర్మాణం కోసం కొత్తగా ఏకంగా 17,005 జగనన్న కాలనీలను నిర్మిస్తోందని వివరించింది. దేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ‘సరసమైన గృహాలు–ఉత్తమ పద్ధతులు’ అంశంపై అధ్యయనం చేసిన కేంద్ర గృహ నిర్మాణ – పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ఇటీవల నివేదికను విడుదల చేసింది.

దీనిని హౌసింగ్‌– పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన హౌసింగ్‌ మిషన్‌ డైరెక్టరేట్‌ ఇతర రాష్ట్రాలకు అందజేసింది. ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను అనుసంధానం చేసి, లబ్ధిదారులకు ప్రయోజనాలు అందిస్తోందని ఆ నివేదికలో పేర్కొంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనతో గృహాలకు ఎల్‌పీజీని, ప్రధానమంత్రి సహజ బిజిలీ హర్‌ ఘర్‌ యోజన కింద విద్యుత్, జలజీవన్‌ మిషన్‌ కింద తాగునీరు, జన్‌ ధన్‌ యోజన కింద బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అండగా నిలిచిందని వెల్లడించింది. వీటితో పాటు మహిళా సాధికారతలో భా­గంగా అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా ఆర్థిక సాయం చేస్తూ.. పిల్లలను చదివించేందుకు తల్లులకు అధికారం కల్పించే పథకాన్ని అమలు చేస్తోందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ నివేదికలో ఇంకా ఏముందంటే.. 

భారీ ఉపాధి, ఆర్థిక ప్రగతికి దోహదం 
► రెండు దశల్లో 30 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తొలి దశలో 15 లక్షలకు పైగా (ప్రస్తుతం టిడ్కోఇళ్లతో కలిపి 21.25 లక్షలకు పైగా) ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇంత పెద్ద ఎత్తున గృహా­ల నిర్మాణంతో ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహం ఇస్తోంది.  

► తాపీ పని, వడ్రంగి వంటి 30 వృత్తిపరమైన వర్గాలకు చెందిన వ్యక్తులకు భారీగా ఉపాధి కలుగుతుంది. ప్లంబింగ్, ఇ­తర తక్కువ ఆదాయ వర్గాలు, రోజువారీ వేతనాలు, అనధి­­కారిక రంగ వలస కార్మికులకు ఉపాధి లభిస్తుంది. 

ఉత్తమ విధానాలతో నిర్మాణంలో వేగం 
► ఇళ్ల నిర్మాణం వేగంగా సాగడానికి ఏపీ ప్రభుత్వం ఉత్త­మ విధానాలను అమలు చేస్తోంది. అర్హులైన లబ్ధిదారులందరికీ సబ్సిడీ ధరలపై స్టీలు, సిమెంట్‌ను సరఫరా చేయడంతో పాటు ఇసుకను ఉచితంగా అందజేస్తోంది.  
► బ్యాంకులతో లబ్ధిదారులను అనుసంధానం చేయడం ద్వా­రా వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించింది. పట్టణ ప్రాం­తాల్లో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు ఇ­చ్చే­లా జగనన్న కాలనీల లే–అవుట్‌లను రూపొందించింది. 

► ఇళ్ల లబ్ధిదారులకు అవసరమైన నాణ్యమైన గృహోపకరణాలను తయారీ దారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా మార్కెట్‌ ధర కంటే తక్కువ ధరకు అందిస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఇళ్ల నిర్మాణాలకు పూర్తి సహకారం ఉండటంతో ఏపీలో ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. 

ట్రాన్స్‌జెండర్లకు కూడా ఇళ్లు 
► చిత్తూరు నగరంలో వీధి వ్యాపారాలు చేస్తున్న 17 మంది ట్రాన్స్‌జెండర్లకు గృహాలను మంజూరు చేసింది. తద్వారా వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో ఇబ్బందిని అధిగమించేలా చేసి.. వివక్ష నుంచి విముక్తి కలిగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అన్ని సౌకర్యాలతో వారు సొంత ఇళ్లు నిర్మించుకుంటున్నారు. 

► సొంత ఇంటి రూపంలో ఆస్తి సమకూరడంతో స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు మరింత మెరుగైన జీవనోపాధి పొందేందుకు అవకాశం లభించింది. వీరిలో కొందరు ప్రభుత్వ సహాయంతో చిన్న చిన్న దుకాణాలు, టైలరింగ్‌ నిర్వహిస్తున్నారు.   

తాటి ఆకుల గుడిసెల్లో ఉండే వారికి పక్కా ఇళ్లు 
► గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్ల­టూరు పంచాయతీ ఎస్సీ, ఎస్టీ కాలనీలో 111 మందికి రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేసింది. వీరందరూ మట్టి, వెదురు కర్రలు, తాటి ఆకులతో రూపొందించిన గుడిసె తరహా ఇళ్లలో నివసించే వారు. వారికి ఇళ్లు మంజూరు చేయడంతో కొత్త ఇంటి స్థలంలో ఇళ్లు నిర్మిస్తున్నారు.  

► ఇళ్ల నిర్మాణ పనుల కోసం స్థానిక పంచాయతీ 15 నీటి కనెక్షన్లు ఇచ్చింది. కొత్త ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక శాశ్వత విద్యుత్‌ కనెక్షన్లతో పాటు వీధి లైట్ల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశారు.  

► నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తొలి దశలో 27,888 నివాస యూనిట్లు చేపట్టారు. ఇందులో వెంకటేశ్వరపురంలో 4,800 యూనిట్లు పూర్త­య్యాయి. 3,000 యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. రెండవ దశ కింద 18,864 యూనిట్లతో 70 శాతం పూర్తయ్యాయి. కనీస మౌలిక సదుపాయాల పనులు ప్రారంభించారు. మూడవ దశ కింద 5,464 యూనిట్లు నిర్మిస్తున్నారు.  

Back to Top