రాష్ట్రాభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం

పొదుపు సంఘాల మహిళలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ లేఖ

తొలి రెండున్నర ఏళ్లలోనే 95 శాతం హామీలను ఈ ప్రభుత్వం నెరవేర్చింది

గత సర్కారు రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసగించింది

ఫలితంగా మహిళా సంఘాలు ఛిన్నాభిన్నం

ఇప్పుడు ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకాలతో సుస్థిర ఆర్థికాభివృద్ధికి బాటలు 

7 నుంచి 17 వరకు పది రోజులపాటు మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్సార్‌ ఆసరా ఉత్సవాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాలు 

 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పేద కుటుంబాల ఆదాయాన్ని పెంపొందించేందుకే ప్రభుత్వం నవరత్నాల ద్వారా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబం ఆదాయాన్ని పెంచడం ద్వారా రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి చెంది రాష్ట్రాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కాగలుగుతారన్నారు. ఇందుకోసం ఎంతటి కష్టాలనైనా అధిగమిస్తూ తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. గురువారం వైయ‌స్ఆర్‌ ఆసరా పథకం రెండో విడత డబ్బుల పంపిణీ సందర్భంగా సీఎం వైయ‌స్ జగన్‌ ఈమేరకు పొదుపు సంఘాల మహిళలకు నేరుగా లేఖలు రాశారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న అప్పు మొత్తాన్ని వైయ‌స్ఆర్‌ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో ఆ సంఘాల్లో సభ్యులైన మహిళలకు ప్రభుత్వం నేరుగా చెల్లిస్తున్న విషయం తెలిసిందే. 
వరుసగా రెండో ఏడాది ఈ పథకం కింద మలి విడత పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 7న సీఎం వైయ‌స్ జగన్‌ ఒంగోలులో ప్రారంభించనున్నారు. అనంతరం మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అక్టోబర్‌ 7వ తేదీ నుంచి 17 వరకు పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్ ఆసరా ఉత్సవాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. పొదుపు సంఘాల మహిళలకు ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రతులను లబ్ధిదారులకు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో ఇంతియాజ్‌ తెలిపారు. సీఎం వైయ‌స్ జగన్‌ లేఖ పూర్తి సారాంశం ఇదీ..

పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు..
మీ చల్లని ఆశీస్సులతో వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా వరుసగా రెండో సంవత్సరం ఈనెల 7వతేదీన పొదుపు సంఘాల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నామని ఎంతో సంతోషంగా తెలియచేస్తూ అక్కచెల్లెమ్మలందరికీ హృదయపూర్వక అభినందనలతో ఈ లేఖ రాస్తున్నా.

చేతల ప్రభుత్వం..
గత ప్రభుత్వాల మాదిరిగా ఇది మాటల ప్రభుత్వం కాదు. మాది చేతల ప్రభుత్వం. మేనిఫెస్టో అంటే అంకెల గారడీ కాదు. అదొక పవిత్రమైన భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి ఇచ్చిన మాటకు కట్టుబడ్డాం. హామీల అమలుకు తేదీలవారీగా క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి మొదటి రెండేళ్లలోనే 95 శాతం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న ఏకైక ప్రభుత్వం మనది.

దయనీయ పరిస్థితులను చూశా..
గత సర్కారు రుణాలు మాఫీ చేస్తామని, వాటిని కట్టొద్దని హామీ ఇచ్చి మోసగించిన నేపథ్యంలో అక్క చెల్లెమ్మలు దయనీయమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. పొదుపు సంఘాలు ఛిన్నాభిన్నమై ‘ఏ’ గ్రేడ్‌లో ఉండే సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌లలోకి పడిపోయాయి. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక ఇబ్బందులను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో స్వయంగా చూసి చలించా. ఎన్నికల రోజు వరకు పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తం ఎస్‌ఎల్‌బీసీ తుది జాబితా ప్రకారం 7.97 లక్షల సంఘాలలోని 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల అప్పు రూ.25,517 కోట్లను నాలుగు దఫాలుగా నేరుగా పొదుపు సంఘాల ఖాతాలకు అందించాలని నిర్ణయం తీసుకున్నా. దీన్ని మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలలో చేర్చాం. అంతే కాకుండా 2016లో రద్దైన సున్నా వడ్డీ పథకాన్ని మళ్లీ పునరుజ్జీవింపచేశాం.

గత ఏడాదే రూ.6,318.76 కోట్లు చెల్లించాం..
మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ‘‘ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం’’ అన్న హామీని అక్షరాలా పాటిస్తూ ఇప్పటికే మొదటి విడతగా రూ.6,318.76 కోట్లు చెల్లించాం. తద్వారా 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూరింది. ఇప్పుడు మళ్లీ 78.76 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మరో రూ.6,439.52 కోట్లు రెండో విడతగా అందిస్తున్నాం.

ఆర్థికంగా ఎదగాలి.. 
మీ జీవితాల్లో మరిన్ని కాంతులు వెల్లివిరియాలని, మీ కుటుంబానికి సుస్ధిర ఆదాయం సమకూరాలని, మీకు మీరుగా సృష్టించుకునే వ్యాపార, జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెంది లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం.

దిగ్గజ కంపెనీలు, బ్యాంకులతో ఒప్పందాలు
మీ కాళ్ల మీద మీరు సొంతంగా నిలబడేలా చేసి జీవనోపాధి మెరుగుపర్చుకొనేలా గతేడాది అమూల్, హిందూస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్, అలానా లాంటి వ్యాపార దిగ్గజాలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నాం. ఈ ఏడాది అజియో – రిలయెన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, మహేంద్ర – ఖేతి లాంటి బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని మీకు వ్యాపార మార్గాలు చూపించి ఆసరా, చేయూత, సున్నా వడ్డీ లాంటి పథకాలతో సుస్థిర ఆర్థికాభివృద్ధికి బాటలు వేశాం.

ఈ డబ్బులు ఎలా వినియోగించుకుంటారో మీ ఇష్టం..
అక్కచెల్లెమ్మలకు అందే ఈ మొత్తాన్ని ఎలా ఉపయోగించుకుంటారన్న అంశంపై ఎలాంటి షరతులూ లేవు. మన ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని మీ కుటుంబ ఆదాయాన్ని పెంచుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మీ కుటుంబ ఆదాయం పెరగడం ద్వారా రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుంది. తద్వారా రాష్ట్ర అభివృద్దిలో మీరు భాగస్వాములు కాగలుగుతారు.  ఎంతటి కష్టాన్ని అయినా భరించి మీ తోబుట్టువుగా ఈ కార్యక్రమాలను చేస్తున్నా. జగనన్న పాలనలో రాజన్న రాజ్యం చూడాలన్న మీ కోరికను నెరవేర్చే దిశగా నా ప్రతి అడుగు వేస్తున్నా. మీ అందరి ఆశీస్సులు నాతోపాటే ఉంటాయన్న ధైర్యంతో ముందుకు సాగుతున్నా. 

కుటుంబ అభివృద్ధి మీతోనే సాధ్యం
పుట్టిన బిడ్డ నుంచి కాయకష్టం చేయలేని పెద్దల వరకూ ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి తగిన పథకాలను అమలు చేయడంతో పాటు మహిళాభివృద్ధి ద్వారానే మన కుటుంబ అభివృద్ధి జరుగుతుందని గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను. మహిళల కోసం తల్లులకు అమ్మ ఒడి పథకం, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుక,  పేదింటి ఆడపిల్లలకు అండగా ప్రభుత్వ బడుల రూపు రేఖలను మార్చేలా మన బడి నాడు– నేడు, ఇంగ్లిష్‌ మీడియం, అక్క చెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలు, అన్ని నామినేషన్‌ పోస్టుల్లో 50 శాతం మహిళలకే కేటాయించడం, వృద్ధాప్య, వితంతు పింఛన్లు, మహిళల రక్షణ కోసం దిశ, దిశ పోలీసు స్టేషన్లు లాంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.

రాష్ట్రం నుంచే ఆధునిక మహిళ
21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ సాధికారతతో ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించేందుకు అన్ని చర్యలు తీసుకుంటూ మహిళా పక్షపాత ప్రభుత్వంగా, అక్కచెల్లెమ్మల జీవితాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి కృషి చేస్తున్న మన ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మీ అండదండలూ ఉండాలని, మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ దేవుడి చల్లని ఆశీస్సులు లభించాలని నిండు మనసుతో కోరుకుంటున్నా.
మీ ఆత్మీయుడు.. 
వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ముఖ్యమంత్రి  

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top