ఆహ్లాదకర వాతావరణంలో మొద‌టి రోజు వైయ‌స్ఆర్‌సీపీ ప్లీన‌రీ

మహానేత వైయ‌స్సార్‌ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో సీఎం వైయ‌స్‌ జగన్‌ ఘన నివాళి 

అక్కడి నుంచి తల్లితో కలిసి నేరుగా ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి

వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఆవిష్కరణ.. వైయ‌స్‌ విగ్రహానికి నివాళులు 

పార్టీ ఆవిర్భావం.. తదనంతర పరిణామాలను వివరిస్తూ సీఎం ప్రారంభోపన్యాసం 

13 ఏళ్లలో కార్యకర్తల కృషికి జగన్‌ సెల్యూట్‌ చేయడంతో శ్రేణుల్లో పెల్లుబికిన ఉత్సాహం 

చంద్రబాబుతో కూడిన దుష్టచతుష్టయం, దత్తపుత్రుడితో కూడిన గజదొంగల ముఠాపై పదునైన విమర్శలు 

పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నానంటూ వైఎస్‌ విజయమ్మ ఉద్వేగపూరిత ప్రసంగం 

 ఈ జెండా... అయాచితంగా అందుకున్నది కాదు. కుట్రలతో లాక్కున్నదీ కాదు. ఇది... ఇచ్చిన మాట కోసం... వ్యవస్థలన్నిటినీ గుప్పిట్లో పెట్టుకున్న ఈ దేశ అత్యున్నత నాయకత్వాన్ని ఢీకొట్టి నిలిచిన ఓ యువకుడికి జనమిచ్చిన గౌరవం!. ఒక్కడిగా మొదలుపెట్టి ఈ రాష్ట్రంలోని ప్రతి ఊళ్లోనూ తన సైన్యాన్ని సృష్టించుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విజయం!. అందుకే ఇది జనం ఎత్తిన జెండా!!. పన్నెండేళ్లుగా ఇంతకు ఇంతై ఎదుగుతూ... ఎగురుతున్న వైఎస్సార్‌సీపీ జెండా... శుక్రవారం ప్లీనరీ పండగలో పులకించిపోయింది. 

మూడేళ్ల కిందట ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్‌ జగన్‌... కష్టాల్లో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్‌ చేస్తూ ప్లీనరీని ఆరంభించారు. రాష్ట్రంలోని ప్రతి  గ్రామం నుంచీ హాజరైన ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు జై జగన్నినాదాలతో ప్లీనరీని హోరెత్తించేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఒంటరి పోరాటం సాగిస్తున్న తన కుమార్తెకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది కనక... తాను వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్ష పదవిని వీడుతానని వై.ఎస్‌. విజయమ్మ ప్రకటించగానే వద్దు వద్దంటూ శ్రేణులు నినదించాయి. కానీ ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ఆమె భావోద్వేగపూరితంగా వివరించిన మీదట... అంతా ఆమె నిర్ణయానికే జై కొట్టారు. ప్రజా సేవలో 45 ఏళ్ల తమ బాంధవ్యాన్ని గుర్తుచేస్తూ... వైఎస్‌ జగన్‌ గెలుపు మళ్లీ తథ్యమనే విశ్వాసం వ్యక్తం చేశారామె. 

ఇక ప్రతి ఊళ్లో బడి, ఆసుపత్రి బాగుపడుతూ భవిష్యత్తు మెరుగుపడుతుంటే ప్రతిపక్షాలు  తట్టుకోలేకపోతున్నాయని, ప్రజలకు సంక్షేమం చేకూర్చడమంటే అభివృద్ధి కాదని ఎవరైనా చెప్పగలరా అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతిపక్షాలను నిలదీశారు. సీఎం స్ఫూర్తిదాయకమైన స్వాగతోపన్యాసం కార్యకర్తలలో ఫుల్‌జోష్‌ను నింపగా నాలుగు తీర్మానాలపై తొలిరోజు నేతలు చేసిన ప్రసంగాలు ఆలోచింపజేశాయి.... రెండో రోజు కోసం ఎదురు చూసేలా చేశాయి.

వైయ‌స్ఆర్‌సీపీ ప్లీనరీ అంటే.. పార్టీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ ఎంతగానో ఎదురుచూసే కార్యక్రమం. ఇంకో మాటలో చెప్పాలంటే అత్యంత ఇష్టమైన పండుగ. ఈ వేదికపై గతాన్ని మననం చేసుకుని, వర్తమానాన్ని విశ్లేషించుకుని.. భవిష్యత్‌కు మార్గనిర్దేశం చేసుకోవడం  జరుగుతుంది. మూడేళ్ల క్రితం అధికారాన్ని చేపట్టాక తొలిసారి నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో.. తొలి రోజున ప్రతినిధుల సభకు అంచనాలకు మించి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలోని 26 జిల్లాల నుంచి కార్యకర్తలు ప్లీనరీకి పోటెత్తారు. వైయ‌స్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు గావించి.. శుక్రవారం వైయ‌స్సార్‌ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌.. అనంతరం తల్లితో కలిసి ప్లీనరీ జరిగే వైయ‌స్సార్‌ ప్రాంగాణానికి చేరుకున్నారు.

ఉరిమే ఉత్సాహం.. చిరు జల్లుల ఆహ్వానం
వైయ‌స్సార్‌ ప్రాంగణానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ చేరుకోక ముందే లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. శ్రేణుల ఉరిమే ఉత్సాహం నడుమ.. చిరు జల్లుల మధ్య.. ఆహ్లాదకర వాతావరణంలో వైఎస్సార్‌సీపీ జెండాను పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. ఆ తర్వాత శ్రేణుల హర్షధ్వానాల నడుమ ప్లీనరీ వేదికపైకి చేరుకున్న సీఎం.. తల్లి విజయమ్మ, పార్టీ నేతలతో కలిసి మహానేత వైఎస్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు.

కష్టాలు గుర్తు చేసుకుంటూ.. చేసిన మేలును వివరిస్తూ..
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మహాభినిష్క్రమణం నుంచి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు అవమానాలను సహిస్తూ.. కష్టాలను భరిస్తూ తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్‌ చేస్తున్నా అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ప్లీనరీ ప్రారంభోపన్యాసాన్ని ఆరంభించారు. వైఎస్సార్‌ ఆశయాలను కొనసాగించడానికి.. అందరి ఆత్మాభిమానం కోసం ఆవిర్భవించిన పార్టీ అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో ప్రజలకు చేస్తున్న మంచిని వివరిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన ప్రసంగానికి శ్రేణుల నుంచి విశేష రీతిలో స్పందన లభించింది. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా.. అధికారమంటే ప్రజల మీద మమకారం చూపించడమేనని నిరూపిస్తూ ముందుకు సాగుతున్నామని శ్రేణులకు గుర్తు చేశారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేయడం ద్వారా పరిపాలనలో.. ప్రజల జీవన ప్రమాణాల్లో.. సామాజిక, విద్య, ఆర్థిక న్యాయం చేయడమంటే ఇలా అని.. మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేయడమంటే ఇలా అని నిరూపించామని సీఎం వివరించారు. ప్రజలకు మేలు చేస్తుండటాన్ని జీర్ణించుకోలేక.. అసూయతో చంద్రబాబుతో కూడిన దుష్టచతుష్టయం, దత్తపుత్రుడితో జాయింట్‌గా ఏర్పడిన గజ దొంగల ముఠా సాగిస్తున్న దుష్ప్రచారాలను ఎండగట్టారు. ప్రజల ఇంట ఉన్న మన గెలుపు ఆపటం వారి వల్ల కాదు కాబట్టే రాక్షస గణాలన్నీ ఒక్కటవుతున్నాయన్న పదునైన విమర్శలకు శ్రేణుల నుంచి విశేష స్పందన లభించింది. గజదొంగల ముఠా దాష్టీకాలపై మనమంతా ఆలోచన చేసి.. ప్రజలకు ఆలోచన కలుగజేసేలా చేసేందుకు ప్లీనరీలో తీర్మానాలు ఉపయోగపడతాయని చెప్పారు. మొత్తంగా వైఎస్‌ జగన్‌ ప్రసంగం శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంది.

వైఎస్‌ విజయమ్మ ఉద్వేగపూరిత ప్రసంగం..
వైయ‌స్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశానని తాను లేఖ రాయకున్నా, రాసినట్లు సృష్టించడం.. ఎవరి కుటుంబంపైనా వేయని రీతిలో తమ కుటుంబంపై నిందలేస్తూ ఎల్లో మీడియా దుష్ఫ్రచారం చేస్తోందని వైఎస్‌ విజయమ్మ ఉద్వేగ పూరితంగా ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘షర్మిలమ్మ తెలంగాణలో పోరాటం చేస్తోంది. ఆమెకు నేను అండగా నిలవాల్సిన అవసరం ఉంది. సంతోషంలో ఉన్నప్పుడు కొడుకుతో ఉంటే అక్కడ నా రక్తం పంచుకున్న బిడ్డకు అన్యాయం చేసిన దాన్నవుతా. అది నా మనస్సాక్షికి నచ్చడం లేదు. అందుకే పార్టీ నుంచి తప్పుకుంటున్నా.. ఇందుకు క్షమించాలి’ అంటూ శ్రేణులను విజయమ్మ కోరారు. ‘వేరే రాష్ట్రంలో షర్మిలమ్మకు అండగా ఉన్నా, తల్లిగా జగన్‌కు, రాష్ట్ర ప్రజల మనసులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటాను’ అని విజయమ్మ స్పష్టత ఇవ్వడం శ్రేణులను ఆకట్టుకుంది. 

పోటెత్తిన పార్టీ శ్రేణులు
ప్లీనరీ తొలి రోజున ప్రతినిధుల సభ.. మహిళా సాధికారత–దిశ చట్టం, విద్య, నవరత్నాలు–డీబీటీ, వైద్య రంగాల్లో గత మూడేళ్లలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై చర్చించింది. ఆ నాలుగు అంశాలపై తీర్మానాలను ఆమోదించింది. ప్రతినిధుల సభకు 1.50 లక్షల మంది వస్తారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అంచనా వేయగా, అంతకంటే ఎక్కువగా శ్రేణులు తరలివచ్చాయి. ప్లీనరీ ప్రాంగణంలో వేసిన కుర్చీలన్నీ నిండిపోవడంతో పెద్ద సంఖ్యలో జనం వెలుపల.. గుంటూరు–విజయవాడ జాతీయ రహదారి వరకు మైదానంలో కిక్కిరిసిపోయారు. వేదిక చుట్టూ ఇసుకేస్తే రాలనంతగా కార్యకర్తలు పోటెత్తడంతో వేదిక మీదకు నాయకులు చేరుకోవడం కష్టమైంది. అంచనాలకు మించి ప్రతినిధుల సభకే వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పోటెత్తడంతో పార్టీలో నూతనోత్సాహం నింపింది. 

తొలిరోజు ప్లీనరీ ఇలా..
 వైయ‌స్ఆర్‌సీపీ 3వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ఉదయం ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున వర్సిటీ సమీపంలోనివైయ‌స్ఆర్  ప్రాంగణం ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా మొదటి రోజు కార్యక్రమాలు ఇలా సాగాయి..
ఉదయం 7.00 : వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులు వేదిక వద్దకు చేరుకోవటం ప్రారంభమైంది. 
8.00: పార్టీ ప్రతినిధుల నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. తమ పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున క్యూ కట్టారు. 
9.00 :  సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి.
11.36:వైయ‌స్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలను పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కార్యకర్తల కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం వారిరువురూ చేతులు జోడించి సభకు విచ్చేసిన అందరికీ నమస్కారం చేశారు. 
11.39: మహానేత వైయ‌స్సార్‌ విగ్రహానికి వైఎస్‌ విజయమ్మ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జగన్‌కి వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ఆకుపచ్చ కండువా కప్పారు.  పార్టీ మహిళా నేతలు, మంత్రులు తానేటి వనిత, విడదల రజనీ, మాజీమంత్రి పాముల పుష్పశ్రీవాణి సీఎం జగన్‌కు శాలువ కప్పారు. అనంతరం బాలికలు వందేమాతరగీతం ఆలపించారు. 
11.42:  పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్లీనరీని ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగిస్తారని ప్రకటించారు. 
11.45: పార్టీ శ్రేణుల హర్షధ్వానాల మధ్య సీఎం జగన్‌ ఉద్వేగపూరిత ప్రసంగం ప్రారంభించారు. ఆయన ప్రసంగిస్తున్నంతసేపు ఈలలు, చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. 
12.13: సీఎం జగన్‌ తన ప్రసంగాన్ని పూర్తిచేశారు. 
12.15:  పార్టీ గౌరవాధ్యక్షురాలు హోదాలో వైఎస్‌ విజయమ్మ తన ప్రసంగం ప్రారంభించారు. హ్యాపీబర్త్‌డే.. హ్యాపీబర్త్‌డే వైఎస్సార్‌ అని ఆమె అన్నప్పుడు సభలో ఈలలు, కేకలు ప్రతిధ్వనించాయి. 
12.50: విజయమ్మ బాధాతప్త హృదయంతో తన గౌరవాధ్యక్ష స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం తన స్థానంలో ఆశీనులయ్యారు, ఈ సమయంలో కన్నీటిపర్యంతమైన తన తల్లి విజయమ్మను సీఎం వైఎస్‌ జగన్‌ సముదాయించి, ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పార్టీ జమా ఖర్చుల ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. తర్వాత మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్‌సీపీ సిద్ధాంతం–రాజ్యాంగ నిబద్ధత అనే అంశంపై ప్రసంగించారు. ఆ తర్వాత వివిధ అంశాలపై సాయంత్రం వరకు చర్చలు జరిగాయి.  నాలుగు అంశాలపై తీర్మానాలు చేశారు.  
కార్యకర్తలకు పేర్ని నాని సముదాయింపు 
వేదికపైకి వైఎస్‌ విజయమ్మ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వస్తారనగా.. కార్యకర్తలు పెద్దఎత్తున వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో మాజీమంత్రి పేర్ని నాని రంగంలోకి దిగి ఒక్కొక్కరిని బుజ్జగిస్తూ గ్యాలరీలకు తరలించారు. కార్యకర్తల కోరిక మేరకు వారితో ఒక సెల్ఫీ దిగటం వారిని చేయిపట్టుకుని గ్యాలరీలలో వదలటం ఆసక్తికరంగా మారింది.  

తాజా వీడియోలు

Back to Top