నేటి నుంచి రెండో విడత ఆసరా

ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్‌

7.97 లక్షల పొదుపు సంఘాల్లో సభ్యులైన 78.76 లక్షల మంది మహిళలకు లబ్ధి

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నాటికి వారి పేరిట ఉన్న బ్యాంకు అప్పును భరిస్తున్న ప్రభుత్వం 

ఈ పథకం ద్వారా నాలుగు విడతల్లో చెల్లింపు

రెండో విడతగా ఇప్పుడు రూ.6,439.52 కోట్లు పంపిణీ

గత ఏడాది తొలి విడత డబ్బులతో కలిపి రూ.12,758 కోట్లు లబ్ధి

పది రోజుల పాటు కొనసాగనున్న రెండో విడత కార్యక్రమం

తొలి రోజు 83 వేల సంఘాల్లోని 8.19 లక్షల మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు 

అమరావతి: ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం రెండవ విడత మొత్తాన్ని ప్రభుత్వం నేడు డ్వాక్రా గ్రూపు సభ్యులైన మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న అప్పును నాలుగు విడతల్లో మహిళలకు అందజేసే ఈ పథకానికి సీఎం వైఎస్‌ జగన్‌ గత ఏడాది శ్రీకారం చుట్టి.. తొలి విడత సొమ్ము జమ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం నుంచి రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439.52 కోట్లు పంపిణీ ప్రారంభం కానుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుంచి దాదాపు 20 వేల మంది లబ్ధిదారుల సమక్షంలో సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గత ఏడాది తొలి విడతగా చెల్లించిన రూ.6,318.76 కోట్లు కూడా కలిపితే పొదుపు సంఘాల అప్పునకు సంబంధించి రూ.12,758.28 కోట్లు మహిళలకు అందజేసినట్టవుతుంది. ఈ పథకం ద్వారా ఇచ్చే డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. 

పది రోజుల పాటు పంపిణీ 
78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439.52 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చే ఇంత పెద్ద కార్యక్రమాన్ని పది రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ పరిధిలో రోజుకు కొన్ని గ్రామ సమాఖ్యల లబ్ధిదారుల చొప్పున పది రోజుల పాటు పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని 83,026 సంఘాల్లోని 8.19 లక్షల మందికి పంపిణీ చేస్తారు. ప్రతి రోజు పంపిణీ జరిగే ప్రాంతంలో ఆ ప్రాంత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించేందుకు గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌), పట్టణ పేదిరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లు ప్రణాళికలు సిద్ధం చేశాయి. మంత్రులు కూడా ప్రతి రోజూ తమ జిల్లా పరిధిలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. గురువారం సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యక్రమాన్ని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగే కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 

వైయ‌స్సార్‌ జిల్లాలో పంపిణీకి ఆటంకాలు..
బద్వేలు ఉప ఎన్నిక కారణంగా వైఎస్సార్‌ జిల్లాలో పంపిణీ వాయిదా పడే అవకాశం ఉందని గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం గత ఏడాది నుంచే ఆసరా పథకం అమలు చేస్తున్న విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు.. ఈ దృష్ట్యా అక్కడ కూడా పంపిణీకి అనుమతి ఇవ్వాలని అధికారులు కోరినట్టు తెలిసింది. ఎన్నికల  సంఘం అనుమతి తెలిపిన తర్వాత, లేదంటే ఉప ఎన్నిక  ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ జిల్లాలో పంపిణీ ప్రారంభించే అవకాశం ఉంది. 

సీఎం ఒంగోలు పర్యటన ఇలా..
గురువారం ఉదయం 9.55 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఒంగోలుకు బయలుదేరతారు. 11 గంటలకు ఒంగోలు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ ఆసరా సభా వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ వివిధ స్టాల్స్‌ను పరిశీలించిన అనంతరం వేదిక వద్ద లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత తన ప్రసంగం అనంతరం వైఎస్సార్‌ ఆసరా రెండో విడత కింద లబ్ధిదారులకు డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.55 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

నాడు బాబు మోసం.. నేడు వైయ‌స్ జగన్‌ వరం
2014లో ఎన్నికల ముందు.. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏ ఒక్కరూ డ్వాక్రా రుణం చెల్లించాల్సిన అవసరం లేదని నమ్మకంగా చెప్పారు. దీంతో మహిళలు ఆ రుణాలు చెల్లించలేదు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు చేయకుండా మోసం చేశారు. దీంతో మహిళల అప్పు.. వడ్డీతో కలిపి చెల్లించలేనంతగా పెరిగిపోయింది. ఈ కారణంగా అప్పట్లో పొదుపు సంఘాలు పూర్తిగా ఛిన్నాభిన్నమై ‘ఎ’ కేటగిరీ సంఘాలు కూడా ‘సి’, ‘డి’ కేటగిరీలోకి వెళ్లిపోయాయి. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకం కింద కూడా రుణాలను ఇవ్వడాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఇలాంటి పరిస్థితుల్లో.. రాష్ట్రంలో పొదుపు సంఘాల వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్‌ జగన్‌ ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఇవాళ రెండో విడత సొమ్మును విడుదల చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పథకం తమకు నిజంగా వరం అని రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top