విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు

వరుసగా నాలుగో ఏడాది "జగనన్న విద్యా కానుక"

 అమరావతి: విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ చదువుల భారమంతా తన భుజాలకెత్తుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాదీ జగనన్న విద్యాకానుకను అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే 43,10,165 మంది విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యాకానుక కిట్ల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో లాంఛనంగా ప్రారంభించనున్నారు.   

బడికెళ్లడం ఇక వేడుక 
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్‌ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతోపాటు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ (6–10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్‌ డిక్షనరీ (1–5 తరగతి పిల్లలకు)తో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని బడులు తెరిచిన తొలిరోజే చేపట్టనున్నారు. జగనన్న విద్యాకానుక కిట్‌కు క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో సహా నాలుగు దశల్లో నాణ్యతా పరీక్షలు చేపట్టారు.

ప్రతి విద్యార్థికీ దాదాపు రూ.2,400 విలువైన విద్యా కానుక కిట్లను ప్రభుత్వం అందచేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లు తెరిచి 6,7 నెలలైనప్పటికీ యూనిఫామ్‌ సంగతి దేవుడెరుగు కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఇక ఇతర వస్తువుల ఊసే లేదు. ఆ పరిస్థితిని సమూలంగా మారుస్తూ జగనన్న ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన రోజే 10 వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు అందచేస్తోంది. ఇక విద్యార్థుల చదువులను గాలికొదిలేస్తూ గత సర్కారు పెండింగ్‌లో పెట్టిన రూ.1,778 కోట్ల  ఫీజు రీయింబర్స్‌ బకాయిలను సైతం సీఎం జగన్‌ ప్రభుత్వమే చెల్లించింది.  

గ్లోబల్‌ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా 
కార్పొరేట్‌ స్కూళ్లే ప్రభుత్వ పాఠశాలలతో పోటీపడేలా, విద్యార్థులను గ్లోబల్‌ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రానున్న రోజుల్లో ప్రతి స్కూల్‌లో ఇంగ్లిష్‌ మీడియంతో సీబీఎస్‌ఈ సిలబస్‌లో బోధించేలా సిద్ధమైంది. ‘మనబడి నాడు నేడు’ తొలిదశ స్కూళ్లలో 6–10వ తరగతి వరకు 30 వేలకు తరగతి గదుల్లో బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌ ద్వారా సులభంగా అర్థమయ్యేలా డిజిటల్‌ బోధన చేపట్టనున్నారు. ఇంగ్లిష్‌ లాబ్స్‌తోపాటు 1–5వ తరగతి వరకు ప్రతి స్కూల్‌లో 10 వేల స్మార్ట్‌ టీవీల ఏర్పాటు దిశగా సన్నద్ధమైంది.  

తొలిదశ స్కూళ్లలో జూలై 12 నాటికి ఐఎఫ్‌పీలు 
మనబడి నాడు నేడు తొలిదశ పనులు పూర్తైన 15,715 స్కూళ్లలో ఈ ఏడాది జులై 12 నాటికి ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు పూర్తి కానుంది. రెండో దశలో భాగంగా 22,344 స్కూళ్లలో ఈ ఏడాది డిసెంబర్‌ 21 నాటికి ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌ ఏర్పాటవుతాయి. మిగిలిన 15 వేల స్కూళ్లలో మూడో దశలో ఐఎఫ్‌పీలు అందుబాటులోకి వస్తాయి.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యార్థులకు కూడా బైజూస్‌ కంటెంట్‌ అందించనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్, ఏపీ ఫైబర్‌ నెట్‌ ద్వారా 45,000 పాఠశాలల్లో ఇంటర్‌ నెట్‌ సదుపాయం సమకూరనుంది. ఇక ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు స్పోకెన్‌ ఇంగ్లిష్ లో నైపుణ్యం సాధించేలా టోఫెల్‌ ప్రైమరీ, టోఫెల్‌ జూనియర్‌ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈమేరకు ఎడ్యుకేషన్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ (ఈటీఎస్‌)తో ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
 
ఫిర్యాదులకు 14417 టోల్‌ఫ్రీ నెంబర్‌ 
జగనన్న విద్యా కానుక ద్వారా అందచేసిన వస్తువుల్లో ఏవైనా లోపాలుంటే విద్యార్థులు తమ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడికి అందచేస్తే వారం రోజుల్లో రీప్లేస్‌ చేస్తారు. మరే ఇతర ఫిర్యాదులున్నా 14417 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయవచ్చు. 

30 వరకు పాత యూనిఫామ్స్‌కు ఓకే
2023–24 విద్యా సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మొదటిరోజే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. కిట్‌లో స్కూలు పుస్తకాల బ్యాగ్‌తో పాటు మూడు జతల యూనిఫామ్‌ క్లాత్, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, డిక్షనరీ ఉంటాయన్నారు.

ఈ ఏడాది కొత్త డిజైన్‌లో యూనిఫామ్‌ క్లాత్‌ అందిస్తున్నామని, విద్యార్థులు వాటిని కుట్టించుకునే వరకు గతేడాది యూనిఫామ్‌ ధరించి పాఠశాలలకు హాజరు కావచ్చన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుందని, ఆలోగా కొత్త యూనిఫామ్‌ కుట్టించుకోవాలని సూచించారు.   

Back to Top