తప్పుడు కేసులకు భయపడలేదు. వ్యక్తిత్వ హననానికి పాల్పడినా వెరవలేదు. ప్రజలకు మేలు చేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో పదేళ్లు అలుపెరగని పోరాటాలు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలా భరోసా కల్పించారు. కులం, మతం, వర్గం, రాజకీయం.. ఇవేవీ చూడకుండా అర్హతే ప్రాతిపదికగా సాయం అందిస్తున్నారు. రాజకీయాల్లో, పరిపాలనలో నూతన అధ్యాయానికి తెరతీసి రాజకీయ పార్టీలకు, నేతలకు మార్గనిర్దేశకుడిగా నిలుస్తున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించాలనే దృఢ సంకల్పంతో ముందడుగు వేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. పదేళ్ల పాటు తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని వైఎస్సార్‌సీపీని తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దారు. దేశ చరిత్రలో ఎందరో ముఖ్యమంత్రులు, వారి కుమారులు ఉన్నప్పటికీ, వారెవరూ రాజకీయంగా బలమైన ముద్ర వేయలేకపోయారు. కానీ.. వైఎస్ జగన్ మాత్రం లక్ష్యాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించడంలో.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకోవడంలో.. పరిపాలనలో తండ్రిని మించిన తనయుడిగా రాజకీయ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా చూస్తామని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే 95% హామీలు అమలు చేశారు. తద్వారా ఎన్నికల మేనిఫెస్టోకు సరైన నిర్వచనం చెప్పి.. ఇతర పార్టీలకు దిక్సూచిలా నిలిచారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పేదరిక నిర్మూలనలో దిక్సూచి ► వివిధ సంక్షేమ పథకాల కింద మూడేళ్లలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1,41,247.94 కోట్లను డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో జమ చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగు పరిచి, పేదరికాన్ని నిర్మూలించే దిశగా అడుగులు వేశారు. ► కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదు. సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ఇస్తున్న సొమ్ముతో వ్యవసాయం, పాడి పశువుల పెంపకం, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న ప్రజలు పేదరికాన్ని అధిగమిస్తున్నారని సామాజిక పరిశీలకులు చెబుతున్నారు. ► 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల సొంతింటి స్వప్నాన్ని సాకారం చేస్తూ రూ.27 వేల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడమే కాకుండా.. ఏకంగా 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో వారికి ఇళ్లు నిర్మిస్తుండటం దేశ చరిత్రలో రికార్డు. సామాజిక సాధికారతలో రోల్ మోడల్ ► పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు భాగస్వామ్యం కల్పించి సామాజిక సాధికారత సాధించే దిశగా సీఎం వైఎస్ జగన్ బలంగా అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గంలో, నామినేటెడ్ పదవుల్లో, శాసనమండలి సభ్యుల ఎంపికలో, స్థానిక, పురపాలక, పరిషత్ ఎన్నికల్లో, రాజ్యసభ సభ్యుల ఎంపికలో ఈ వర్గాలకు పెద్ద పీట వేశారు. తొలి మంత్రివర్గంలో 56 శాతం, మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణలో ఈ వర్గాలకు ఏకంగా 70 శాతం పదవులు కట్టబెట్టారు. ► దేశ చరిత్రలో తొలి సారిగా నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఆ వర్గాలకు రిజర్వేషన్ కల్పించేలా చట్టం తెచ్చి మరీ వారికి అవకాశం ఇచ్చారు. తద్వారా సామాజిక సాధికారతలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారని సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు ► ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రవేశపెట్టారు. చదువులకు పేదరికం అడ్డుకాకూడదనే లక్ష్యంతో జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న విద్యా కానుక తదితర పథకాలు అమలు చేస్తున్నారు. జగనన్న గోరుముద్ద కింద రోజూ 43,26,782 మంది పౌష్టికాహారాన్ని స్వీకరిస్తుండగా ఇందుకు ప్రభుత్వం రూ.3,087.50 కోట్లు ఖర్చు చేసింది. ► పాఠశాలల్లో నాడు–నేడు కింద రూ.16,450 కోట్ల వ్యయంతో మొత్తం 56,572 స్కూల్స్‌లో అభివృద్ధి పనులు చేపట్టారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద 34,19,875 మందికి రూ.4,895.45 కోట్లతో గత మూడేళ్లలో సంపూర్ణ పోషకాహారాన్ని అందించారు. ► విద్యా రంగానికి మూడేళ్లలో మొత్తం రూ.52,676.98 కోట్లు వెచ్చించారు. ఏటా రూ. 24 వేల వరకు ఖర్చుతో శ్రీమంతుల పిల్లలకు మాత్రమే లభిస్తున్న బైజూస్ స్డడీ మెటీరియల్‌ను ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు ఉచితంగానే అందించడానికి ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ► ఇకపై ఏటా 8వ తరగతిలోకి అడుగుపెట్టే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్‌లు అందజేయనుంది. ఈ ఏడాది 4.7 లక్షల మంది విద్యార్థులకు రూ.500 కోట్ల ఖర్చుతో ఒక్కొక్కరికి దాదాపు రూ.12,000 విలువ చేసే ట్యాబ్‌లు ఉచితంగా సెప్టెంబర్‌లో అందించనున్నారు. ► ప్రభుత్వ నిర్ణయాల వల్ల 2018–19లో 37 వేల మంది క్యాంపస్ ప్లేస్‌మెంట్లు పొందితే.. 2019–20లో 51 వేలు, 2020–21లో 61 వేల మంది ఉద్యోగాలు సాధించారు. వైద్య రంగంలో నవశకం ► మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ఆరోగ్యశ్రీని గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే.. దానికి సీఎం వైఎస్ జగన్ జీవం పోశారు. ఆరోగ్యశ్రీ కింద లబ్ధి పొందే వారి వార్షికాదాయం పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. దీనివల్ల 1.41 కోట్ల కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. ఈ పథకం పరిధిలోకి 2,436 చికిత్సలను తీసుకొచ్చారు. చికిత్స పొందిన వారికి ఆరోగ్య ఆసరా పథకం ద్వారా సాయం చేస్తున్నారు. ఆçస్పత్రులను నాడు–నేడు కింద ఆధునికీకరిస్తున్నారు. ఆస్పత్రుల్లో డాక్టర్, నర్సులు, ఇతర సిబ్బంది ఖాళీలను అధిక శాతం భర్తీ చేశారు. కొత్తగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. సుపరిపాలనలో నంబర్ వన్ ► గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి.. 1.34 లక్షల మంది ఉద్యోగులను నియమించి.. 2.51 లక్షల వలంటీర్లతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశారు. ► స్కోచ్ సంస్థ 2020, 2021లో చేసిన అధ్యయనంలో సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్‌గా నిలవడం సీఎం వైఎస్ జగన్ పరిపాలనదక్షతకు నిదర్శనం. ప్రజల సౌకర్యం.. పరిపాలన సౌలభ్యమే లక్ష్యంగా జిల్లాలను పునర్ వ్యవస్థీకరించి.. 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. మహిళల ఆర్థిక సాధికారత వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు బాటలు వేసింది. ఆసరా కింద ఇçప్పటికే 78.74 లక్షల మంది ఖాతాల్లో రూ.12,757.97 కోట్లు.. చేయూత కింద 24.95 లక్షల మందికి రూ.9,179.67 కోట్లు అందజేశారు. సున్నా వడ్డీ పథకం కింద 1,02,16,410 మంది డ్వాక్రా మహిళలకు రూ.3,615.28 కోట్లు అందించారు. ఈసాయంతో చిరు వ్యాపారాలు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. వ్యవసాయం, పరిశ్రమలకు ఊతం ► అన్నదాతలను విత్తనం మొదలు.. పంట కొనుగోలు వరకు చేయి పట్టుకుని నడిపించేలా ఆర్బీకే వ్యవస్థను తీర్చిదిద్దారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ఆర్బీకేల ద్వారా రాయితీపై అందిస్తున్నారు. రైతు భరోసా, సున్నా వడ్డీ, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, ఉచిత విద్యుత్, మద్దతు ధర కల్పన తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా ఆదుకుంటున్నారు. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలతో మిట్టల్, బిర్లా, అదానీ, సంఘ్వీ, భజాంకా, బంగర్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా పరిశ్రమలను ఆదుకోవడంతో ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు భరోసా కలిగింది. ► సులభతర వాణిజ్య (ఈఓడీబీ) ర్యాంకుల్లో ఏపీ వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. గత మూడేళ్ల కాలంలో 28,343 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా 2,48,122 మందికి ఉపాధి లభించింది. ప్రస్తుతం రూ.1,51,372 కోట్ల విలువైన 64 యూనిట్లకు సంబంధించిన నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉండగా, మరో రూ.2,19,766 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ► ముఖ్యమంత్రి వైయస్ జగన్ దావోస్ పర్యటనలో రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరగడమే కాకుండా త్వరలో విశాఖ వేదికగా భారీ పెట్టుబడుల సదస్సుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వీటన్నింటికీ తోడు మూడేళ్ల కాలంలోనే వివిధ ప్రభుత్వ శాఖల్లో 6,03,756 ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చింది.