వ‌లంటీర్ల‌కు వంద‌నం

నేటి నుంచి గ్రామ‌, వార్డు వలంటీర్లకు సత్కారం

పెనమలూరు నియోజకవర్గంలో ప్రారంభించనున్న సీఎం వైయ‌స్ జగన్‌ 

ఉగాది సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం

రోజుకొక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కార్యక్రమాలు

పనితీరు ఆధారంగా మూడు కేటగిరీల్లో అవార్డుల ప్రదానం

రూ.10 వేల నుంచి రూ.30 వేల మధ్య నగదు ప్రోత్సాహకాలు

మెడల్, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జీలు కూడా 

అమరావతి: సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాలను ఇంటి గడప వద్దే ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని వారికి సత్కారం, అవార్డుల ప్రదానోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి నిర్వహించనుంది. ప్రతి జిల్లాలో రోజుకొక అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున అన్ని చోట్ల సమావేశాలు నిర్వహించి ఆ నియోజకవర్గ పరిధిలో వలంటీర్లను సత్కరించనున్నారు. సోమవారం కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. విజయవాడ సమీపంలోని వైఎస్సార్‌ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో పోరంకిలోని మురళీ రిస్టార్స్‌లో ఉదయం 10.30 నుంచి 12 గంటల మధ్య జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొంటారని గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల శాఖ డైరెక్టర్‌ భరత్‌గుప్తా తెలిపారు. 

రెండు జిల్లాల్లో మినహా...
వలంటీర్ల పనితీరు ఆధారంగా సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో మూడు కేటగిరీల్లో సత్కరించనున్నారు. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు నగదు బహుమతితో పాటు మెడల్, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జిలను వలంటీర్లకు అందజేస్తారు. తొలిరోజు 11 జిల్లాల పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికల నేపథ్యంలో చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని మే 4వతేదీ తర్వాత నిర్వహించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 13 అసెంబ్లీ నియోజక వర్గాలలో వివిధ అవార్డులకు ఎంపికైన వలంటీర్లకు నగదు ప్రోత్సాహకాన్ని సీఎం జగన్‌ పోరంకిలో జరిగే సమావేశం నుంచే కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తారని అధికారులు తెలిపారు. 

28 వరకు కొనసాగనున్న కార్యక్రమాలు..
ప్రతి జిల్లాలో రోజుకొక అసెంబ్లీ నియోజకర్గం చొప్పున ఏప్రిల్‌ 28వతేదీ వరకు వలంటీర్లకు సత్కార కార్యక్రమాలు కొనసాగనున్నాయి. జిల్లా మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొంటారు. సంబంధిత నియోజకవర్గ పరిధిలో సమావేశాలు నిర్వహించిన రోజే వలంటీర్ల ఖాతాల్లో ప్రోత్సాహక బహుమతి సొమ్మును జమ చేస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 2,66,092 మంది వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే 2019 ఆగస్టు 15వ తేదీన వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవస్థ ఏర్పాటు సమయంలో తీవ్రంగా విమర్శించిన వారి నోళ్లు మూతపడేలా ఏడాదిన్నరగా వలంటీర్లు ప్రజలతో మమేకమై అత్యుత్తమ సేవలందిస్తున్న విషయం తెలిసిందే. సంక్షేమ ఫలాలను రాష్ట్రంలో ప్రతి గడపకూ చేరువ చేసిన వలంటీర్ల వ్యవస్థ పట్ల దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

మొదటి కేటగిరీ..
ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఏడాదికిపైగా సేవలందించిన వలంటీర్లను ‘సేవామిత్ర’ అవార్డుతో సత్కరించి రూ.10 వేల చొప్పున నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్‌ బహుకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,17,650 మంది వలంటీర్లను ఈ అవార్డుకు అర్హులుగా అధికారులు గుర్తించారు.

రెండో కేటగిరీ.. 
ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు తదితర కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఐదు మంది చొప్పున, ప్రతి నగర పాలక సంస్థ పరిధిలోని పదేసి మంది చొప్పున వలంటీర్లను ‘సేవారత్న’ అవార్డుతో సత్కరిస్తారు. రూ.20 వేల చొప్పున నగదు బహుమతితోపాటు సిల్వర్‌ మెడల్, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్‌ బహుకరిస్తారు. ఈ అవార్డుకు రాష్ట్రవ్యాప్తంగా 4 వేల మంది వలంటీర్లను అర్హులుగా గుర్తించినట్లు  అధికారులు వెల్లడించారు. 

మూడో కేటగిరీ.. 
తమకు కేటాయించిన 50 కుటుంబాల పరిధిలోని ప్రజలకు సేవల ద్వారా పూర్తి స్థాయిలో చేరువై అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వలంటీర్లను అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున ఎంపిక చేసి ‘సేవావజ్ర’ అవార్డుతో సత్కరిస్తారు. రూ.30 వేల చొప్పున నగదు బహుమతితోపాటు గోల్డ్‌ మెడల్, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జీతో సత్కరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 875 మందిని ఇందుకు ఎంపిక చేశారు. కాగా పైన పేర్కొన్న మూడు కేటగిరీలకు ఎంపిక కాని వలంటీర్లకు కూడా బ్యాడ్జ్‌ అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.

సీఎం చేతులమీదుగా అవార్డులు వీరికే..
ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా 9 మందికి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఎంపీడీఓ విమాదేవి తెలిపారు. సేవావజ్ర అవార్డుకు యనమలకుదురు నుంచి ఎన్‌.రాజేష్, పి.ప్రత్యూష, కానూరు నుంచి షేక్‌ నూర్జహాన్, వి.భవాని, సాజిదాబేగం ఎంపిక కాగా సేవారత్న అవార్డును పొద్దుటూరుకు చెందిన కొడాలి నవీన్, జి.వలి, సేవామిత్ర అవార్డును ఆకునూరుకు చెందిన బిందుప్రియ, చోడవరానికి చెందిన గోపిబాబుకు అందించనున్నుట్లు చెప్పారు. 

Back to Top