చినబాబు కాస్త బుర్రపెట్టి ఆలోచించడం నేర్చుకో..

ఏపీలోనూ వర్తకులకు తగిన భద్రత లేదనేది లోకేష్‌ ఉద్దేశమని ఆయన మాటలే చెబుతున్నాయి 
 

ఏపీని బిహార్‌గా మార్చేశారన్న మాటలతో బిహారీలతోపాటు ఆంధ్రులనూ లోకేష్‌ అవమానించాడు

అమ‌రావతి: ఆరు కోట్ల ఆంధ్రులను, దాదాపు 12 కోట్ల మంది బిహారీలను అవమానించే రీతిలో మాట్లాడారు తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేష్‌. విజయవాడలో వ్యాపారుల సమావేశంలో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను దక్షిణ భారత బిహార్‌గా మార్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని లోకేష్‌ నోరుజారారు. ఈ మాటలు అతని అవగాహనారాహిత్యానికి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసూయా ద్వేషాలకు అద్దంపడుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితి తాము ఆశించిన రీతిలో లేదనో, ప్రగతి ఇంకా వేగం పుంజుకుకోలేదనో చెప్పే స్వేచ్ఛ ప్రతిపక్షాలకు ఉందిగాని లోకేష్‌ మాదిరిగా దేశ సమైక్యతకు, అభివృద్ధికి నిర్వారామ కృషి చేస్తున్న రెండు రాష్ట్రాల ప్రజలను అవమానించే రీతిలో మాట్లాడడం ఒక్క తెలుగుదేశం పార్టీకే చెల్లింది. బిహార్‌లో అరాచకం తాండవమాడుతోంది, ఏపీలోనూ వర్తకులకు తగిన భద్రత లేదనేది–లోకేష్‌ ఉద్దేశమని ఆయన మాటలే చెబుతున్నాయి. ఈ రెండు విషయాల్లోనూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ‘పుత్రరత్నం’ పచ్చి అబద్ధాలే చెప్పారు. లోకేష్‌ ఆరోపించినట్టుగా బిహార్‌ పరిస్థితి లేదు. ఆక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు చట్టబద్ధ పాలన సాగిస్తున్నాయి. ఏపీలోనూ పాలన సజావుగా నడుస్తోంది.

బిహారీల సంస్కారం బాబు పరివారానికి ఉందా?
1990 నుంచి బిహార్‌లో ముఖ్యమంత్రులుగా ఉన్నది తన తండ్రి మాజీ మిత్రులే కాబట్టి తాను ఇప్పుడు ఆ రాష్ట్రం గురించి ఏమైనా మాట్లాడొచ్చనే అహంభావం చినబాబులో హద్దులు దాటుతోంది. బిహారీ నేతలు ఏనాడూ ఆంధ్రులను కించపరిచే విధంగా మాట్లాడలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌ తొలి సీఎంగా– కొన్నాళ్లు హైదరాబాద్‌లో, మరి కొన్నాళ్లు కృష్ణా నది కరకట్టపై నివాసముంటూ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎంత ఇష్టారాజ్యంగా పరిపాలించారో ప్రజలకు ఇంకా గుర్తుంది. పాలకపక్షానికి తప్ప, ప్రతిపక్షానికి ఎలాంటి ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేసిన టీడీపీ సర్కారు తన ఐదేళ్ల పాపానికి 2019లో భారీ మూల్యమే చెల్లించింది. తనతో సహా అనేక మంది మంత్రులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా చినబాబుకు జ్ఞానోదయం కాలేదు. దాని వల్ల ప్రజలకు నష్టం లేదు. కాని, వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించే తొందరలో సాటి ఆంధ్రులను, తెలుగునేలను అభిమానించే బిహారీ సోదరులను లోకేష్‌ అవమానించిన విధానం అత్యంత జుగుప్సాకరం. అనాగరికం కూడా. ఇకనైనా ఏపీ ప్రభుత్వంపై నిందలు మోపే సమయంలో చినబాబు కాస్త బుర్రపెట్టి ఆలోచించడం నేర్చుకోవాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top