31న స‌చివాల‌యానికి వైయ‌స్ జ‌గ‌న్‌

వెలగ‌పూడిలో సీఎం చాంబర్‌ రెడీ..! 
 

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో నిశ్చయ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఛాంబర్‌ సిద్ధం అవుతోంది. ఆయన ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం వైయ‌స్‌ జగన్‌ ...ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక సీఎంగా పగ్గాలు చేపట్టిన రెండోరోజే ఆయన సచివాలయంలో అడుగు పెట్టనున్నారు. శుక్ర, శనివారాల్లో జగన్‌ సచివాలయంలో పరిపాలనా వ్యవహారాలు సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ, వైయ‌స్ఆర్‌ సీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి బుధవారం సచివాలయంలో ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.  సచివాలయం మొదటి బ్లాక్‌లో సీఎం ఛాంబర్‌, క్యాబినెట్‌ సమావేశ మందిరం, సీఎం కాన్వాయ్‌ రూట్‌తో పాటు సీఎం నేమ్‌ ప్లేట్‌ను పరిశీలించారు. 

ఇక వైయ‌స్‌ జగన్‌ ప్రమాణం చేయనున్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రముఖులతోపాటు ప్రజలు, కార్యకర్తలు కోసం కూడా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశామని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. దాదాపు 30వేల మంది వీక్షించే విధంగా ఈ గ్యాలరీల్లో సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. వైయ‌స్‌ జగన్‌ సూచన మేరకు ప్రజలు కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం కల్పించామన్నారు. 

 

Back to Top