అమరావతి: కూటమి పాలనలో ప్రజలపై రెండో సారి భారీ విద్యుత్ చార్జీల భారం పడింది. రూ.9,412.50 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయనుంది. దీని ద్వారా ప్రతి యూనిట్‌కు రూ.0.92 అదనపు భారం ప్రజలపై పడుతుంది. డిసెంబర్ వినియోగం నుంచే అంటే జనవరి నుంచి ప్రభుత్వం ఈ చార్జీలు వసూలు చేస్తుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం దీపావళి పండుగకే రాష్ట్ర ప్రజలపై రూ.6,072.86 కోట్ల భారం వేసింది. ఈ చార్జీలను యూనిట్‌కు రూ.1.27 చొప్పున ఈ నెల నుంచి వసూలు చేస్తున్నారు. తాజా చార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్‌కు రూ.2.19 అదనంగా వినియోగదారులు చెల్లించాలి. గతంలో వేసిన రూ.6.072.86 కోట్లు, తాజాగా వసూలు చేస్తున్న రూ.9,412.50 కోట్లు కలిపి మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే రూ.15,485.36 కోట్ల భారం ప్రజలపై మోపింది. రూ.0.92 వరకూ అదనం 2023–24 సంవత్సరానికి రూ.12,844.88 కోట్ల సర్దుబాటు చార్జీల వసూలుకు డిస్కంలు ఏపీఈఆర్‌సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. అందులో రూ.3,432.38 కోట్లు తగ్గించి, రూ.9,412.50 కోట్లు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు ఏపీఈఆర్‌సీ అనుమతించింది. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో యూనిట్‌కు దాదాపు రూ.0.91, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో రూ.0.92, ఏపీఈపీడీసీఎల్‌లో పరిధిలో రూ.0.90 చొప్పున వినియోగదారుల నుంచి 24 నెలల్లో వసూలు చేసుకోమని డిస్కంలకు ఏపీఈఆర్‌సీ చెప్పింది. మాట మార్చడం.. మాట తప్పడమే బాబు నైజం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం, రకరకాల మాయ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఓట్లేసిన ప్రజలనే ముంచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మాట మార్చడం.. మాట తప్పడమే ఆయన నైజం. ఇటీవలి ఎన్నికల్లో ఆయనిచ్చిన సూపర్ సిక్స్ హామీలు, కరెంటు చార్జీలు పెంచబోమంటూ చెప్పిన మాటలను తుంగులో తొక్కేసి ఆయన నైజాన్ని మరోసారి బయట పెట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి చోటా మైకు పట్టుకొని గత ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందంటూ అబద్ధాలాడేశారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదని, అవసరమైతే వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టి ఐదు నెలలు తిరక్కుండానే చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన రోజే ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పాను’ అంటూ నాలుక మడతెట్టేశారు. విద్యుత్ చార్జీలపై బాబు వంచనకు మచ్చు తునకలు కొన్ని.. 19 మార్చి 2019, కడప : కరెంటు కొరత 2004లో లేదు. 2014లో అది 22.5 మిలియన్ యూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను. రెండు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు చార్జీలు పెంచేది లేదన్నాం. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ ఇస్తున్నాం. ఇళ్లకు 24 గంటలూ ఇస్తున్నాం. భవిష్యత్‌లో ఎంత కావాలంటే అంత కరెంట్ ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నా. 27 మే 2020, టీడీపీ మహానాడు : కరెంటు చార్జీలు ఎవరూ కట్టే పరిస్థితి లేకపోతే కరెంటు చార్జీలు పెంచబోమని చెప్పాం. ఐదేళ్లు కరెంటు చార్జీలు పెంచలేదు. టెక్నాలజీ ఉపయోగించాం. సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. దానివల్ల రానున్న రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందుకు వెళితే.. మీరు (జగన్) పవర్ రేట్లు పెంచారు. రైతులకు కూడా కరెంటు చార్జీలు పెంచే పరిస్థితికి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరం. 10 ఆగస్ట్ 2022, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ చార్జీలు తగ్గించే వాళ్లం. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వంపై దశలవారీ పోరాటానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి. జగన్ అధికారం చేపట్టిన మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. విద్యుత్ చార్జీల పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. 16 ఫిబ్రవరి 2023, పెద్దాపురం : తమ్ముళ్లూ.. ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారా లేదా? ఏవమ్మా ఆడబిడ్డలూ మీరు చెప్పండి. నేనున్నప్పుడైనా కరెంటు చార్జీలు పెంచానా? లోటు బడ్జెట్ ఉన్నా కరెంటు చార్జీలు పెంచకుండా పరిపాలన సాగించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 2 ఆగస్ట్, 2023, పులివెందుల : కరెంట్ చార్జీలను పెంచను.. తగ్గిస్తా. ఇప్పటికి ఎనిమిది సార్లు కరెంటు చార్జీలను జగన్ పెంచారు. వినూత్న ఆలోచనతో 2000లో కరెంట్ సంస్కరణలు తెచ్చి 2004కు మిగులు విద్యుత్ తెచ్చా. ఎండతో కరెంటు వస్తుంది. సోలార్ నేనే తీసుకొచ్చా. రూ.14 ఉండే కరెంటు రూ.2కు వచ్చి0ది. ఎండతో, గాలితో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే రూ.2 నుంచి రూ.3కే కరెంట్ వస్తుంది. రానున్న ఐదేళ్లలో కరెంట్ చార్జీలు పెంచను. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీరే వినియోగించుకునే పరిస్థితి తెస్తా. గ్రిడ్‌కు కనెక్ట్ చేసి మిగులు విద్యుత్‌ను వినియోగదారులే అమ్ముకునేలా చేస్తా. 16 ఆగస్ట్ 2023, విజన్ డాక్యుమెంట్ విడుదల, విశాఖపట్నం : రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం. వీలైతే తగ్గిస్తాం. 90వ దశకం చివరిలో విద్యుత్ రంగంలో సంస్కరణలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ఉత్పత్తి విధానాలతో యూనిట్ ధర రూ.8 నుంచి రూ.2కు పడిపోయింది. హైడ్రోజన్, అమ్మోనియా హబ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. 4 మార్చి 2024, పెనుగొండ : ఎవరి మార్కు ఎంత అని అడుగుతున్నాడు.. నేను చెబుతున్నా జగన్.. నీ మార్కు తెలుసుకో. రూ.200 ఉండే కరెంటు బిల్లు రూ.800 చేయడం నీ మార్కు. కరెంటు చార్జీల బాదుడు నీ మార్కు. నేడు ఏఆర్‌ఆర్ సమర్పించనున్న డిస్కంలు 2025–26 సంవత్సరానికి అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్, రిటైల్ సప్‌లై బిజినెస్ ప్రపోజల్స్‌ను విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) శనివారం ఏపీఈఆర్‌సీకి సమర్పించనున్నాయి. తమ పరిధిలోని నివేదికలతో డిస్కంల సీఎండీలు ఏపీఈఆర్‌సీ ముందు హాజరుకానున్నారు.