సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై థర్డ్‌ డిగ్రీ 

దారుణంగా హింసించిన తర్వాతే అరెస్ట్‌ చూపిస్తున్న వైనం

ఎలా హింసించిందీ పై వారికి వీడియో కాల్‌లో చూపిస్తూ పైశాచికానందం

ఇది ప్రభుత్వ పెద్దల ఉన్మాదం.. పోలీసు అధికారుల అరాచకం... 

ఇందులో ముందున్న మూడు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు

రాష్ట్ర కార్యాలయంలో ఓ కీలక అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణ

పౌరుల భావ ప్రకటనాస్వేచ్ఛను హరిస్తూ దారుణ నిర్బంధం

చంద్రబాబు ప్రభుత్వ దమన నీతిపై న్యాయపోరాటానికి ప్రజలు సిద్ధం

బరితెగించిన పోలీసు అధికారులపై ప్రైవేటు కేసులకు సమాయత్తం

 అమరావతి: సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అమానుష కాండను కొనసాగిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుండడమే వారు చేసిన నేరం. వారిపై అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా ...వారిని అక్రమంగా నిర్బంధించి భౌతికంగా దాడులు చేస్తూ ...కసి తీరిన తరువాతే అరెస్ట్‌ చూపిస్తోంది. మానవ హక్కులను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ ...రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ సాగిస్తున్న ఈ దమనకాండకు ప్రభుత్వ ముఖ్యనేతే  ప్రధాన కుట్రదారు కాగా... కీలక పోలీసు అధికారులు పాత్రధారులు, పర్యవేక్షకులు. 

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రాక్షస క్రీడ కొనసాగుతోంది. అందులో ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇందులో బాగా ఆరితేరిపోయారు. అందరికన్నా ముందుండాలన్న తాపత్రయం వారిలో కనిపిస్తోంది. పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను దారుణంగా కాలరాస్తున్న సర్కారు దమననీతిపై న్యాయపోరాటానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. 

అంతేకాదు తమ విద్యుక్తధర్మాన్ని గాలికొదిలేసి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లల్లా తలాడిస్తూ సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై దమనకాండను కొనసాగిస్తున్న పోలీసు అధికారులపైనా ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు వేసేందుకు బాధిత కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. వీరికి పలువురు మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమకారులు, పలు పౌరసంఘాల నేతలు మద్దతుగా నిలుస్తున్నారు.  త్వరలోనే ‘పచ్చ’పాత పోలీసు అధికారులందరూ న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడడం తథ్యమని బాధిత కుటుంబాలు స్పష్టం చేస్తున్నాయి.  

అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే... 
ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో కొనసాగుతోంది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల విభాగాన్ని పర్యవేక్షించే ఉన్నతాధికారి ఈ వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం. అంటే ఈ అమానుష కాండను కొనసాగించేందుకు ప్రభుత్వ పెద్దలు రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారని దీనినిబట్టి స్పష్టమవుతోంది. 

ప్రభుత్వ పెద్దలు టార్గెట్‌ చేసిన సోషల్‌ మీడియా యాక్టివిస్టులను వారు సంతృప్తిచెందే స్థాయిలో భౌతికంగా హింసించారా లేదా అన్నది వీడియో కాల్‌ ద్వారా పర్యవేక్షిస్తుండటం ప్రభుత్వ కక్షకు పరాకాష్టగా నిలుస్తోంది. ఆ రాక్షసకాండ ఇలా  సాగుతోంది... 

ఎన్ని కేసులు.. ఎక్కడికి తరలిస్తున్నారు? 
రాష్ట్రంలో సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం ఎడాపెడా అక్రమ కేసులు బనాయిస్తోంది. ఒక్కో యాక్టివిస్టుపై ఒకటికి మించిన కేసులు నమోదు చేయడమే కాకుండా... వేర్వేరు జిల్లాల్లో కేసులు నమోదు చేస్తోంది. వారిని పోలీసులు హఠాత్తుగా అదుపులోకి తీసుకుని తమతో పట్టుకుపోతు­న్నారు. ఏ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుందీ... ఏ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారన్న కనీస సమాచారాన్ని కూడా కుటుంబ సభ్యులకు చెప్పడం లేదు. దాంతో తమ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి వాకబు చేస్తే అసలు తాము ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు.  

థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడానికి కరడుగట్టిన నేరస్తులా? 
అక్రమంగా అదుపులోకి తీసుకున్న సోషల్‌ మీడియా యాక్టివిస్టులను పోలీస్‌ స్టేషన్లు తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కరడుగట్టిన నేరస్తులపై ప్రయోగించినట్లు థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తూ భౌతికంగా హింసిస్తున్నారు. తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలని..లేకపోతే మరిన్ని రోజులు చిత్రవధ తప్పదని హెచ్చరిస్తున్నారు.  

వీడియో కాల్‌ ద్వారా నిర్ధారణ 
సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించామని పోలీసులు మాటలతో చెబితే ఉన్నతాధికారులు సంతృప్తి చెందడం లేదు. పోలీసు అధికారులు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల విభాగాన్ని పర్యవేక్షించే ఓ ఉన్నతాధికారికి వీడియో కాల్‌ చేసి మరీ చూపిస్తున్నారు. 

సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై థర్డ్‌ డిగ్రీ తాము ఆశించినస్థాయిలో ప్రయోగించారా లేదా అన్నది ఆ ఉన్నతాధికారి వీడియో కాల్‌ ద్వారా పరిశీలిస్తారు. ఆయన సంతృప్తి చెందితే ఆ విషయాన్ని తన బిగ్‌ బాస్‌కు నివేదిస్తారు. ఆయన అనుమతి ఇచ్చిన తరువాతే... ఒకే ఇక చాలు... అరెస్ట్‌ చూపించండి అని ఆ ఉన్నతాధికారి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు చెబుతారు.

చిత్రహింసల తర్వాతే అరెస్ట్‌..
ఆ విధంగా ప్రభుత్వ పెద్దలు ఆదేశించినస్థాయిలో థర్డ్‌ డిగ్రీని ప్రయోగించారని నిర్ధారించుకున్న తరువాతే సోషల్‌ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్‌ చూపిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా మూడు రోజుల నుంచి వారం రోజులపాటు సాగుతోంది. కుట్రపూరిత, కక్ష పూరిత రాజకీయాలకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 

పోలీసు వ్యవస్థను గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతగా దుర్వినియోగం చేయలేదని పోలీసు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులను గుండాల మాదిరిగా మార్చి రాజకీయ అరాచకం సాగిస్తుండటం విభ్రాంతికరమని మండిపడుతున్నారు. ఈ పరిణామా­లతో పోలీసు అధికారులు భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.  

Back to Top