కాగితాల మీదే ‘కార్పొరేష‌న్లు’

ఎన్నిక‌ల్లో ల‌బ్ధి కోసం హ‌డావుడిగా ప‌ది కార్పొరేష‌న్లు ఏర్పాటు

అవ‌న్నీ వంచ‌న జీవోలే అంటున్న బీసీలు 

కులాల కార్పొరేషన్లతో తక్షణ ప్రయోజనాలు శూన్యం

ఏదో చేశామనే ప్రచారం కోసమే బాబు యావ

జాగో బీసీ జాగో

అధికారంలోకి రాగానే ప్రతి ప్రతి ఒక్కరికి  ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన హామీని కాపీ కొట్టిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం హడావుడిగా బీసీల్లోని  పది కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. అర్హులైన వారికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్న తపన కంటే, నేనే ముందు  ఇచ్చాననే ప్రచార యావే ఈ జీవోల్లో స్పష్టంగా తేటతెల్లం అవుతోంది. ఈ జీవోలన్నీ చంద్రబాబు హామీల్లాగానే కాగితాలకే పరిమితం కానున్నాయని చెప్పవచ్చు.ఇవన్నీ బాబు గారి మరో వంచనకు నిదర్శనమని అధికార వర్గాలు కూడా  అంగీకరిస్తున్నాయి.

అధికారంలో ఉన్న నాలుగున్న‌రేళ్లు బీసీల‌ను ప‌ట్టించుకోని చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు హ‌డావుడిగా కార్పొరేష‌న్లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు జీవో విడుద‌ల చేశారు. బ‌డ్జెట్‌లో అర‌కొర‌గా కేటాయింపులు చేసినా, పూర్తి స్థాయిలో ఖ‌ర్చు చేయ‌లేక‌పోయారు. ఎక్క‌డ బీసీలు దూర‌మ‌వుతారో అన్న భావ‌న‌తో కేవలం కంటితుడుపుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇచ్చేసారు తప్పితే, వీటికి సంబంధించిన మార్గదర్శకాలను, అన్నింటికి మించి ఆర్ధిక తోడ్పాటు వంటి విషయాలను పూర్తిగా విస్మరించారు. డబ్బులేని వాడు ముందు పడవెక్కినట్లుగా, ఎటువంటి నిధులు కేటాయించకుండా కాగితాలపై ఈ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. మరోమాటలో చెప్పాలంటే, ఈ కార్పొరేషన్ల ఏర్పాటును కూడా విడతల వారీ తంతుగా మార్చేసిందీ ప్రభుత్వం. కేవలం పరిపాలనపరమైన అనుమతిలిచ్చేసి ఏదో చేశామన్న ప్రచారం చేసుకోవాలనే ఆరాటం తప్ప నిజంగా ఆయా వర్గాలకు ప్రయోజనం కల్పించాలన్న శ్రద్ధ ఏమాత్రం లేదని నిస్సందేహం.

సహకార సంఘాల చట్టం ప్రకారం ఈ కులాల ఆర్ధిక సంస్థలను (ఫైనాన్స్ కార్పొరేషన్లను) ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ కార్పొరేషన్లను ఎంత మూలధనంతో ఏర్పాటు చేస్తున్నారన్న విషయాన్ని పూర్తిగా విస్మరించారు. ఒక ఆర్థిక సహకార సంస్థను ఏర్పాటు చేసే సమయంలో, మూలధనం, వాటాదారుల వంటి అంశాలు అత్యంత ప్రాథమికమైనవని ఆ రంగంలో అనుభవమున్న వారందరూ ముక్తకంఠంతో చెపుతారు. సహకార చట్టం ప్రకారం కూడా ఈ వివరాలు తప్పనిసరి. అయితే ఇటువంటి వివరాలేమీ లేకుండా, కేవలం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం వెనక ఉన్న దురాలోచన ఏమిటో తేటతెల్లం అవుతోంది. ప్రస్తుతమున్న ఈ కులాల పేరుతో ఉన్న ఫెడరేషన్లలోని మూలధనాన్ని ఈ కార్పొరేషన్లకు బదలాయించి, కొత్తగా ఎటువంటి మూలధన నిధులు కేటాయించకుండా వంచించేందుకు కూడా అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసిన జీవోల ఆధారంగా, మిగిలిన అన్ని చర్యలు చేపట్టి, కార్పొరేషన్లు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు చేపట్టాలంటే కనీసం రెండు మూడు నెలలు పడుతుంది. మార్గదర్శకాలు, నిబంధనలతో మరో జీవో విడుదల చేసే అధికారం, అవకాశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, హడావుడిగా ఎన్నికలకు ముందు ఎలాంటి నిధులు లేకుండా ఒకే రోజున ఎకాఏకీన పది కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ జీవోలు విడుదల చేయడం తక్షణం ఒనగూరే ప్రయోజనాలేమీ లేవు.

ఇలాంటి వాస్తవలన్నిటినీ చూస్తే, ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కంటే తాను ముందు ఏదో చేశానని చెప్పుకోవాలనే ఆరాటంతో బీసీలను మరోసారి వంచించడానికే బాబు సర్కారు జీవోలు విడుదల చేసిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. చంద్రబాబు నక్క జిత్తుల్లో పడి మోసపోకుండా జాగో బీసీ జాగో.

Back to Top