బాబుకు స్థానిక భయం

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా భావిస్తారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికలో ఎలాంటి సమీకరణాలు పనిచేసినా పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రభుత్వ పనితీరే ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వ విధానాలు స్థానికంగా అధికారుల పనితీరుకు ప్రజలు తమ తీర్పుతో సమాధానం చెబుతారు. అలాంటి స్థానిక ఎన్నికలంటే చంద్రబాబుకు చుక్కలు కనబడుతుంటాయి. ఎప్పుడో 2018 జూన్ లోనే పంచాయితీల కాలపరిమితి ముగిసింది. కొత్తగా ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ చంద్రబాబు మాత్రం పంచాయితీ ఎన్నికలు జరపకుండా, జీవో జారీచేసి మరీ ప్రత్యేక అధికారులతో పాలన సాగిస్తున్నాడు. దీనిపై ఉమ్మడి హైకోర్డులో మాజీ సర్పంచులు దాఖలు చేసిన పిటీషన్ ను ధర్మాసనం విచారించి మూడు నెలల కిందటే తీర్పును వెలువరించింది. బాబు జారీ చేసిన జీవో 90ని రద్దు చేసింది. మూడు నెలల్లోపే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈసీకి కూడా ఎన్నికలపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఇంత జరిగా బాబు మాత్రం పంచాయితి ఎన్నికలకు ససేమిరా అంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో పంచాయితీ ఎన్నికలు జరిగాయి. విభజన తర్వాత ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు జరగలేదు. 2018 ఆగస్టు తర్వాత పంచాయితీ ఎన్నికలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమీషనర‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు సమీపంలో ఉన్నాయనే సాకు చూపుతూ చంద్రబాబు పంచాయితీ ఎన్నికలకు మోకాలడ్డాడు. 
పంచాయితీ ఫలితాలపై బెంగ
ఊళ్లలో జన్మభూమి పేరు చెబితే వెంటపడి తరుముతున్నారు ప్రజలు. ఈ విషయం బాబుకు కూడా బాగా తెలుసు. పైగా చినబాబుగారి కట్టపెట్టిన శాఖ కూడాను. దీనిపై ఎలాంటి ఫిర్యాదులూ రాకుండా జాగ్రత్త పడాలన్నదే బాబు తాపత్రయం. కానీ స్థానికంగా జన్మభూమి  కమిటీల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్న సామాన్య ప్రజానీకం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి, ప్రైవేటు వ్యక్తుల చేతికి అధికారం ఇవ్వడంపై అడుగడుగునా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు సభల్లోనే చాలాసార్లు ప్రజలు జన్మభూమి కమిటీలపై వేలాదిగా ఫిర్యాదులు అందజేసారు. ముఖ్యమంత్రి వాటిని వినీ విననట్టు నటించారు. ఒకానొక సందర్భంలో జన్మభూమి కమిటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించినా, గ్రామాల్లో మాత్రం తెలుగుదేశం నేతలు ఈ కమిటీలను కొనసాగిస్తూనే ఉన్నారు. మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. పచ్చనేతల ఆగడాలు యద్ధేచ్ఛగా సాగుతున్నాయి. దోపిడి రాజ్యంగా మారిన టీడీపీ పాలనలో గ్రామాలు కుదేలు అయ్యాయి. కుల, పార్టీ ప్రాతిపదికనే పథకాలు వర్తిస్తున్నాయంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధిలేక వలసలు పోతున్న గ్రామీణులను చంద్రబాబు డబ్బుల కోసం వలసలు పోతున్నారంటూ ఎద్దేవా చేయడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్య పంచాయితీ ఎన్నికలకు వెళ్లడం అంటే పరాజయాన్ని పిలిచి ఒళ్లో పెట్టుకోవడమే అని చంద్రబాబుకు బాగా తెలుసు. అదే జరిగితే లోకేష్ రాజకీయ భవిష్యత్తు పునాదిలోనే సమాధి కావడం ఖాయం. తన పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు, చినబాబు శాఖలో లోపాలు బయటపడకుండా ఉండేందుకు పంచాయితీ ఎన్నికలకు నామం పెడుతున్నాడు చంద్రబాబు. కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా కుంటి సాకులతో కాలయాపన చేస్తున్నాడు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రత్యేక అధికారులతో పంచాయితీ వ్యవహారాలను నడిపించడం అంత సిగ్గుచేటు మరొకటి లేదని అంటున్నాయి ఇతర రాజకీయ పక్షాలు.
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పరిస్థితి
2017లో నంద్యాల ఉప ఎన్నిక అనంతరం కాకినాడ కార్పొరేషన్ కు ఎన్నికలు నిర్వహించారు. ఇక ఆ తర్వాత ఏ మున్సిపాలిటీలోనూ, కార్పొరేషన్ కూ ఎన్నికలు జరపలేదు. శ్రీకాకుళం, విశాఖ, ఒంగోలు, గుంటూరు వంటి ప్రధాన కార్పొరేషన్లతో పాటు కొన్ని మున్సిపాలిటీలకూ ఎన్నికలు జరగాల్సిఉంది. జిల్లాకో స్మార్ట్ సిటీ అంటూ ఊదరగొట్టిన బాబు కనీసం దోమలు కూడా తోలలేని స్థితిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని పట్టణ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల వారికి బాబు చెప్పిన సుజల స్రవంతి నీరు కాదు కదా స్వచ్ఛమైన తాగునీరే కరువౌతోంది. అధ్వాన్నమైన ఆరోగ్య వ్యవస్థ, పట్టణాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రాణాలు పోతున్నా పట్టించుకోని నిర్లక్ష్యం ఎంతోమంది అమాయకులను బలిగొన్నాయి. 
మున్సిపల్, కార్పొరేషన్, పంచాయితీ, సహకార సంఘాల ఎన్నికల పేరెత్తితే బాబు ఉలిక్కిపడే పరిస్థితి వచ్చింది. బాబు నిజస్వరూపం గ్రహించిన ప్రజలు ఈ స్థానిక ఎన్నికల్లో బాబుకు గట్టి బుద్ధి చెప్పాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ వ్యతిరేకత గురించి తెలిసే చంద్రబాబు ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ కాలం గడుపుతున్నాడు. 

 

Back to Top