బాబు చాలా కాస్ట్లీ

ప్ర‌జ‌ల సొమ్ముతో పార్టీ త‌ర‌ఫున పోరాటాలు

ఖరీదైన హోటళ్లలో 3,500 మందికి ఏసీ గదులు!
  
విమాన టిక్కెట్లు, ప్రత్యేక రైళ్ల కోసం భారీ వ్యయం

దీక్షకు తరలించేందుకు 32 ప్రత్యేక బస్సులు 

పార్టీలు, ఉద్యోగ, విద్యార్థి  నేతలకు విమాన టిక్కెట్లు

 అమరావతి: చ‌ంద్ర‌బాబు ఏది చేసినా కూడా హంగు , అర్భాటాలు ఎక్కువే. అది కూడా సొంత ప్ర‌చారం కోసం ప్ర‌జాధ‌నాన్ని నీళ్ల‌లా ఖ‌ర్చు చేస్తుంటారు. అస‌లే రాష్ట్ర విభ‌జ‌న‌తో అప్పుల ఊబిలో ఉండ‌గా ప్ర‌త్యేక విమానాలు, దుబారా ఖ‌ర్చుల‌తో మ‌రింత అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో క‌లిసి కాపురం చేసిన  చంద్ర‌బాబు ..గో బ్యాక్ రాహుల్ అంటూ, న‌వ నిర్మాణ దీక్ష‌లు అంటూ రోడ్ల‌పై నాట‌కాలు ప్ర‌ద‌ర్శించారు. తీరా బీజేపీకి ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త రావ‌డంతో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు క‌మ‌లం పార్టీకి విడాకులు ఇచ్చేసి..ఇప్పుడు మోడీ గో బ్యాక్ అంటూ..ధ‌ర్మ పోరాట దీక్ష‌లు అంటూ హ‌డావుడి చేస్తున్నారు. అస‌లు రాష్ట్ర విభ‌జ‌న‌కు, రాష్ట్రానికి రావాల్సిన ప్ర‌యోజ‌నాల‌కు గండి కొట్టిందే చంద్ర‌బాబే. ఆయ‌న తీరుతో ప్ర‌జ‌లు విసికిపోతున్నారు. అయినా టీడీపీని బ‌తికించుకునేందుకు ఇలాంటి అడ్డ‌గోలు ధ‌ర్నాల‌తో పాల‌న‌ను గాలికి వ‌దిలేశారు.  

మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న తరుణంలో విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా వాగ్దానాన్ని నెరవేర్చాలనే డిమాండ్‌తో దేశ రాజధానిలో సోమవారం ఒకరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న దీక్ష కోసం హాజరయ్యే వారి కోసం ఖరీదైన ఏసీ హోటళ్లలో 3,500 మందికి వసతి సదుపాయాలు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు నిర్వహించే దీక్షకు రూ. 10 కోట్ల దాకా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు విలాసవంతమైన హోటళ్లలో వసతి కల్పిస్తోంది.

ఢిల్లీలో అత్యంత ఖరీదైన హోటల్‌ రాయల్‌ ప్లాజాలో 30 గదులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున బుక్‌ చేశారు. మంత్రులు, వీఐపీలు రెండు రోజులపాటు ఢిల్లీలో ఉంటున్నందున వారి కోసం వీటిని కేటాయించారు. హోటల్‌ సూర్యలో 200 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల చైర్మన్లకు వసతి కల్పిస్తున్నారు. రూ. 1.12 కోట్ల వ్యయంతో అనంతపురం, శ్రీకాకుళం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల ద్వారా వచ్చే వారికి పహార్‌గంజ్‌ ప్రాంతంలో ‘ఆన్‌ యువర్‌ ఓన్‌’ (ఓవైఓ) కింద వివిధ హోటళ్లలో 850 గదులను బుక్‌ చేశారు. కేరళ, మహారాష్ట్ర భవన్‌లు, టీటీడీ అతిథి గృహం, న్యూఢిల్లీ వైఎంసీఏ టూరిస్ట్‌ హోటళ్లలో కూడా వందల సంఖ్యలో గదులు బుక్‌ చేశారు. వీరందరినీ సీఎం చంద్రబాబు దీక్ష చేసే ఏపీ భవన్‌ వద్దకు తరలించేందుకు ప్రత్యేకంగా 32 బస్సులను ఏర్పాటు చేశారు.

155 మందికి విమాన టిక్కెట్లు..
ధర్నాలో పాల్గొనాలంటూ ప్రభుత్వ ఉద్యో గులపై ఒత్తిడి చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం వారిని ఢిల్లీకి తరలించి తిరిగి స్వస్థలాలకు చేర్చేందుకు విమాన టిక్కెట్ల కోసం భారీగా వెచ్చిస్తోంది. ఏపీ ఎన్జీవోల సంఘం నుంచి 29 మందికి, ఏపీ జేఏసీ అమరావతి నుంచి 20 మందికి, ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ నుంచి ఐదుగురికి, ఏపీ సెక్రటేరియట్‌ అసోసియేషన్‌ నుంచి 18 మందికి విమాన టిక్కెట్లు సిద్ధం చేసింది. లోక్‌సత్తా, ఆప్‌ తదితర రాజకీయ పార్టీల నేతలతోపాటు ఉద్యోగ, రాజకీయ, విద్యార్థి సంఘాల నేతలతో కలిపి మొత్తం 155 మందికి విమాన టిక్కెట్లు సమకూర్చింది.

ప్రచారం కోసం మరుగుదొడ్లనూ వదల్లేదు..
ఢిల్లీలో సీఎం చంద్రబాబు చేసే ఒక రోజు దీక్షకు ప్రచారం కల్పించేందుకు సెంట్రల్‌ ఢిల్లీ పరిధిలో ఉన్న పబ్లిక్‌ టాయ్‌లెట్లను కూడా వదలకుండా భారీ హోర్డింగులను ఏర్పాటు చేశారు. ఏపీ భవన్‌ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫునే భారీ ఎత్తున బ్యానర్లు నెలకొల్పారు. వేదిక ఏర్పాటు, హోర్డింగులు ఇతరత్రా ఖర్చులకు రూ. 80 లక్షల వరకు వెచ్చిస్తున్నట్టు ఏపీ భవన్‌ వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబు ఉదయం రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్ముడికి, ఏపీ భవన్‌లో అంబేడ్కర్‌కు నివాళులర్పించి అనంతరం దీక్ష ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. 

 

Back to Top