ఏపీలో గ్రామ వాలంటీర్ల పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ విడుదల

 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన గ్రామ వాలంటీర్‌ ఉద్యోగాల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆగస్టు 15 నుంచి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చేలా నియామక ప్రక్రియ చేపట్టనుంది. ఈ ఉద్యోగాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌ సైట్‌ ఏర్పాటు చేసింది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోని అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్లను పాటిస్తూ ఈ నియామకాలు చేపడతారు. దాదాపు 50 శాతం ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. 

రాష్ట్రంలో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీరును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ వాలంటీర్లలో 50 శాతం పోస్టులు మహిళలకు కేటాయించగా, అలాగే  వీరికి నెలకు రూ.5వేలు వేతనం ఇవ‍్వనుంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ స్థానికులై ఉండి, కనీసం ఇంటర్మీడియెట్‌ విద్యార్హత కలిగి ఉండాలి. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో అభ్యర్థులకు పదో తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. దరఖాస్తు చేసుకునేందుకు.. వెబ్‌సైట్‌ http://gramavolunteer.ap.gov.in చూడవచ్చు.

ఈ నెల 24 నుంచి జూలై 5వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 10 నుంచి దరఖాస్తుల పరిశీలన, 11 నుంచి 25వ తేదీ వరకూ  సెలక్షన్‌ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి గ్రామ సేవకుల్ని ఎంపిక చేస్తారు. ఆగస్ట్‌ 1వ తేదీన ఎంపికైన అభ్యర్థులను ప్రకటించి...వారికి మండల స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్ట్‌ 15వ తేదీ నుంచి గ్రామ వాలంటీర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. 
కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిన దివంగత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన అందరికీ అందించేందుకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రకటించారు. ఆగస్టు 15వతేదీ నాటికి ప్రతి గ్రామంలోనూ స్థానికులైన యువకులను గ్రామ వాలంటీర్లుగా నియమిస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ విధంగా రాష్ట్రంలో 4 లక్షల మందికి గ్రామ వాలంటీర్లుగా ఉపాధి లభించనుంది. ప్రతి ప్రభుత్వ పథకం గడప గడపకు చేరవేసే విధంగా ఈ గ్రామ వాలంటీర్లు పని చేస్తారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top