ఈ ఏడాది నుంచే ఆంగ్ల మాధ్యమం అమలు 

ఎస్సీఈఆర్టీ సిఫార్సులకు ఆమోదం
 
1–6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంపై జీవో జారీ..

యధాతథంగా మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు

తాడేపల్లి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు కానుంది. మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగనున్నాయి. వాటిల్లో  విద్యార్థులు కోరుకుంటే సమాంతరంగా ఆంగ్ల మాధ్యమ తరగతుల్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమం అమలవుతున్న ప్రభుత్వ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్‌ స్కూళ్లు యధాతథంగా కొనసాగుతాయి. ఇక 7, 8, 9, 10 తరగతులు కూడా ఏటా క్రమేణా ఆంగ్ల మాధ్యమాలుగా మారతాయి.  
 
► ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో ఆప్షన్‌ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు మూడు ఆప్షన్లను కల్పించింది. తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటూ ఆంగ్ల మాధ్యమంలో బోధన, తెలుగు మాధ్యమంలో బోధన, ఇతర మాతృ భాషల్లో బోధనలో ఎంచుకునే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇచ్చారు. 

► మొత్తం 17,97,168 మంది నుంచి ఆప్షన్లు రాగా 53,943 మంది తెలుగు మాధ్యమంలో బోధన కోరుకున్నారు. అయితే ఈ విద్యార్థుల కోసం ఆయా పాఠశాలల్లో తెలుగు మాధ్యమం తరగతుల ఏర్పాటు పాలనాపరంగా, ఆర్థికపరంగా సాధ్యం కాదు కనుక గతంలో ఇచ్చిన జీఓ 15 ప్రకారం ప్రతి మండల కేంద్రంలో (672 మండలాల్లో) ఒక తెలుగు మాధ్యమ పాఠశాలను కొనసాగించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పిస్తారు. దూరంగా ఉన్నవారికి రవాణా ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది.

ప్రభుత్వానికి నివేదిక...
తమకు ఆంగ్ల మాధ్యమంలోనే బోధన కావాలని 96.17 శాతం మంది తల్లిదండ్రులు ఆప్షన్లు ఇచ్చిన నేపథ్యంలో మాధ్యమంపై రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలిని ప్రభుత్వం నివేదిక కోరిన సంగతి తెలిసిందే. విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సోమవారం ప్రభుత్వానికి 59 పేజీల నివేదికను సమర్పించింది. నివేదికలో పలు అంశాలను సమగ్రంగా విశ్లేషించి ఆంగ్ల మాధ్యమం పాఠశాల స్థాయి నుంచి ఎంత అవసరమో ఎస్సీఈఆర్టీ ప్రస్తావించింది. విద్యార్థులు మాతృభాషలో ప్రావీణ్యతను సంతరించుకునేందుకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూనే ఇతర సబ్జెక్టుల్లో సమగ్ర నైపుణ్యానికి ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండాలని సిఫార్సు చేసింది. దీని ద్వారానే లక్ష్యాలు నెరవేరతాయని స్పష్టం చేసింది. ఎస్సీఈర్టీ  సిఫార్సులను ప్రభుత్వం యధాతథంగా ఆమోదించింది.

ముఖ్యమైన సిఫార్సులు..
► విద్యార్థి కేంద్రంగా బోధన జరగాలి. అభ్యసనం వివిధ ప్రక్రియల ద్వారా కొనసాగాలి
► విద్యార్థులు ఒత్తిడి, భయం, ఆందోళన లేకుండా తమ భావాలను స్వేచ్ఛగా తడబాటుకు తావులేకుండా చెప్పగలగాలి
► ప్రభుత్వం 1నుంచి 10 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని దశలవారీగా ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేస్తున్నాం
► విద్యార్థులు, తలిదండ్రులు ఇంగ్లీషు మాధ్యమాన్ని కోరుకుంటున్నందున ప్రభుత్వం 2020–21 విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని 1నుంచి 6 వ తరగతి వరకు ప్రవేశపెట్టవచ్చు.
► ఎస్సీఈఆర్టీ 1–6 ఆంగ్ల మాధ్యమం పుస్తకాలకు సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేసి పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేసింది.  
► ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగుతాయి. ఆ స్కూళ్లలో విద్యార్థుల ఆప్షన్లకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమం తరగతులు సమాంతరంగా కొనసాగించవచ్చు.
► తెలుగు సబ్జెక్టును 1 నుంచి 10 తరగతి వరకు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ తెలుగు సబ్జెక్టు పాఠ్యపుస్తకాలను పటిష్టంగా తీర్చిదిద్దింది. 

Back to Top