చిర‌స్మ‌ర‌ణీయం..వైయ‌స్ఆర్‌సీపీ విజ‌యోత్స‌వం

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి రేప‌టికి రెండేళ్లు

2019 ఎన్నిక‌ల్లో మొత్తం 175 స్థానాల‌కు గాను 151 సీట్లు సొంతం చేసుకున్న వైయ‌స్ జ‌గ‌న్ 

రెండేళ్ల వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో 95 శాతం హామీలు అమ‌లు 

రాష్ట్రంలో ఏ ఎన్నిక‌లు జ‌రిగినా వైయ‌స్ఆర్‌సీపీదే విజ‌యం

ఉనికి కోల్పోయిన ప్ర‌తిప‌క్షాలు
 

 అమ‌రావ‌తి:  ఒక్క‌డితో ప్రారంభ‌మైన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు ప్ర‌భంజ‌నంలా మారింది. ఎన్ని శ‌క్తులు కుట్ర‌లు ప‌న్నినా ఎదురొడ్డి నిల‌బ‌డ్డారు జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అసాధారణమైన విజయం సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ నెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి రెండేళ్లు పూర్తి కాబోతోంది.  రాష్ట్రంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికీ కారణమైన రోజు మే 23వ తేదీ.  2019లో నిర్వ‌హించిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 175 స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో వైయ‌స్ఆర్‌సీపీ 151 సీట్లను గెలుచుకోగలిగింది. 50 శాతానికి పైగా ఓట్లను తన ఖాతాలో వేసుకోగలిగింది. 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 22 చోట్ల జయకేతనాన్ని ఎగుర వేసింది. అంతకుముందు అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమతమైంది. మూడు లోక‌సభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. 51 అసెంబ్లీ స్థానాలు ఉన్నరాయలసీమలో 49 సీట్లను గెలుచుకోగలిగిందంటే వైయ‌స్ఆర్‌సీపీ హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

రెండేళ్ల పాల‌న‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 95 శాతం హామీల అమలు చేశారు.  ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చుతున్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగ‌న్ సారథ్యంలో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే అనేక మార్పులను తీసుకొచ్చారు.  ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో 95శాతం నెరవేర్చిన ప్రభుత్వంగా గుర్తింపు సాధించారు.  దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా వైయ‌స్ జగన్ గుర్తింపు తెచ్చుకున్నారు. 

*చరిత్ర‌లో ఒకడు...వైయ‌స్ జ‌గ‌న్‌*
*నువ్వూ--నేనూ కలిస్తే మనం*
*మనం -- మనం  కలిస్తే జనం*
*జనం -- జగన్ కలిస్తే జన ప్రభంజనం*...

చరిత్ర‌లో ఒక్క‌డు..వైయ‌స్ జ‌గ‌న్‌
 ఒక్కడు.. ఒంటరిగా వచ్చాడు. వేలు లక్షలుగా జనం అతని వెంట నడిచారు. ప్రజాసంకల్పంతో తను గెలిచాడు. కోట్లాది మంది ప్రజలను తన గెలుపులో భాగస్వామిని చేశాడు. వైయస్‌ఆర్‌సీపీ అధినేతగా ఎనిమిదేళ్ల ప్రయాణం. ఏపీ ప్రతిపక్ష నేతగా ఐదేళ్ల పోరాటం. ఇలా అన్నింటిలో ఆయన అడుగులు తడబడలేదు. స్వయంకృషిని నమ్ముకున్నాడు. పొత్తుల ప్రస్తావనే లేకుండా.. ఒంటి చేత్తో పార్టీని గెలిపించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనదైన సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.

ఇచ్చిన మాట కోసం..
తండ్రి దివంగ‌త మ‌హానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి  మరణాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వైయస్‌ జగన్ ..తన తండ్రి కోసం గుండెలాగిన కుటుంబాలను ఓదార్చేందుకు ప్రజా సంకల్ప యాత్ర కోస బయల్దేరాడు. ఆ దారికి కాంగ్రెస్‌ హైకమాండ్‌ అడ్డుపడింది. మహానేత వైయస్‌ఆర్‌ మరణవార్త తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాల్లో ధైర్యం నింపేందుకే ఈ యాత్ర అని చెప్పేందుకు ప్రయత్నించినా దానికి ఆ పార్టీ అధ్యక్షురాలు నో.. చెప్పడంతో చనిపోతూ తన తండ్రి ఇచ్చిపోయిన పెద్ద కుటుంబం కోసం పార్టీకి రాజీనామా చేశాడు వైయస్‌ జగన్‌. అప్పుడు మొదలైన అడుగు పదేళ్ల పాటు ఎన్నో ముళ్లకంపలను దాటుతూ వచ్చింది. 

స‌డ‌ల‌ని సంక‌ల్పంతో ముంద‌డుగు..
ఒకే ఒక్కడు..వందల సభలు..వేల కిలోమీటర్లు..లక్షల అడుగులు..కోట్ల మంది ప్రజలు వారి బాధలు..కాళ్ళ బొబ్బలు, కత్తి పోట్లు, తోడేళ్ళ అరుపులు, వెటకారపు మాటలు..వందల మంది ఏకమై హేళన చేస్తున్నా, కుట్రదారులంతా కలిసి తప్పుడు కేసులు బనాయించినా.. సడలని సంకల్పంతో ముందుకుసాగాడు వైయస్‌ జగన్‌. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా నిత్యం జనాల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడాడు. నాటి ప్రభుత్వ అసమర్ధ పాలనతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశంఖం పూర్తిస్తూ 2017 నవంబర్‌ 6వ తేదీన ప్రజా సంకల్పయాత్ర పేరిట వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టాడు. ఏకంగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జనం గుండెల్లో దాగి ఉన్న బాధను తెలుసుకున్నాడు. ఒక్క అవకాశం ఇవ్వండి గడప వద్దకే మంచి పాలన తీసుకువస్తానని మాట ఇచ్చాడు.

ఎవరూ ఊహించని రీతిలో 151 సీట్లు సాధించిన వైయస్‌ జగన్‌ 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పాలనా పగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లో ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాల్లో 80 శాతం నెరవేర్చారు. మేనిఫెస్టోలోని హామీలే కాదు.. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను కూడా పరిష్కరించారు. అవ్వా తాతల పెన్షన్‌ పెంపు మొదలుకొని ఉద్యోగాల విప్లవం, వైయస్‌ఆర్‌ రైతు భరోసా, అమ్మ ఒ డి, ఆరోగ్య‌శ్రీ‌లో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు, వైయస్‌ఆర్‌ వాహనమిత్ర,  వైయ‌స్ఆర్ చేయూత‌,  మత్స్యకారులకు వైయస్‌ఆర్‌ భరోసా వరకు అనేక సంక్షేమ పథకాలను రెండేళ్ల కాలంలోనే అమలు చేసి చూపించారు. సీఎం మా ఇంటి మనిషి అని ప్రతీ కుటుంబం అనుకునేలా పాలన సాగిస్తున్నారు. నాయకుడిని కాదు ప్రజాసేవకుడినంటూ యువ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ రికార్డు విజయం
 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అసాధారణమైన విజయం సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. 2014 ఎన్నికల్లో కేవలం రెండు శాతం కన్నా తక్కువ ఓట్ల వ్యత్యాసంతో ఓటమి చెందిన వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఫలితాల్లో మాత్రం చరిత్ర రికార్డును బ్రేక్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ఎన్నికల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ 50 (49.95) శాతం ఓట్లను సాధించుకుంది. టీడీపీకి 39.18 శాతం ఓట్లు నమోదయ్యాయి. రెండు పార్టీల మధ్య 10.7 శాతం (దాదాపు 11 శాతం) ఓట్ల వ్యత్యాసం ఉంది.

మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో  50 శాతం (1,56,86,511 ఓట్లు) ఓట్లతో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ 151 నియోజకవర్గాల్లో రికార్డు విజయం సాధించింది. 39 శాతం (1,23,03,620) ఓట్లతో టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య వ్యత్యాసం రెండు శాతం లోపే ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీలకు కలిపి 46.6 శాతం ఓట్లు రాగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి 45 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ 102 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టగా, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాల్లో విజయం సాధించింది. 

2019 ఎన్నికల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ రికార్డు సంఖ్యలో 151 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. గతంలో 102 స్థానాలు గెలిచిన టీడీపీ ఈసారి 79 స్థానాలు కోల్పోయి 23 సీట్లు గెలుచుకోగలిగింది. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయగా, జనసేన మద్దతునిచ్చిన విషయం తెలిసిందే. ఈసారి సీపీఐ, సీపీఎం, బీఎస్పీ లాంటి పార్టీలతో కలిసి జనసేన ఎన్నికల్లో పోటీ చేసింది. జనసేనకు 6 శాతం లోపు ఓట్లు పోలయ్యాయి. జనసేన మిత్రపక్షాలైన సీపీఐ (0.11 శాతం), సీపీఎం (0.32  శాతం), బీఎస్పీ (0.28 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఈ పార్టీలన్నింటకీ కలిపి నోటాకు పోలైనన్ని ఓట్లు కూడా రాలేదు. ఈ ఎన్నికల్లో నోటాకు 1.28 శాతం (4,01,968 ఓట్లు) పోలయ్యాయి. 

లోక్‌సభ ఫలితాల్లోనూ
రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లోనూ పోలింగ్ లో ఇదే సరళి కొనసాగింది. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి 49.15 శాతం ఓట్లు నమోదు కాగా టీడీపీకి 39.6 శాతం ఓట్లు వచ్చాయి. అటు అసెంబ్లీ ఇటు లోక్‌సభ రెండు ఎన్నికల్లోనూ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మధ్య పది శాతం ఓట్ల తేడా ఉంది. ఇంతటి భారీ తేడాతో ఓట్లు సాధించి అధికారం చేపట్టడం చరిత్రలో జరగలేదు. జాతీయ పార్టీలు కాంగ్రెస్ (1.29 శాతం) బీజేపీ (0.96 శాతం) ఓట్లు రాగా నోటాకు 1.49 శాతం ఓట్లు పడ్డాయి. జనసేన, సీపీఐ, సీపీఎంలతో పాటు మిగిలిన స్వతంత్రులందరికీ కలిపి 7.3 శాతం మేరకు ఓట్లు లభించాయి.

జాతీయ పార్టీలకు డిపాజిట్లు గల్లంతు
ఇకపోతే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. కాంగ్రెస్ 1.17 శాతం, బీజేపీ 0.84 శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. ఈ పార్టీలు పోటీ చేసిన దాదాపు అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయాయి. జనసేన దాని మిత్రపక్షాల అభ్యర్థులు సైతం అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. ఇంత‌టి ఘ‌న విజ‌యం సాధించిన రోజును ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేరు. ఈ గెలుపు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు విజ‌యోత్స‌వంతో ఉన్నారు.

Back to Top