అంటుకున్న అహంకారం

టీడీపీలో చేరకముందు, తర్వాత వంగవీటి రాధా తీరు

 

కాలాలు చెప్పేటప్పుడు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చెబుతాం కదా...అలాగే రాధా లాంటి వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు కూడా టీడీపీలో చేరకముందు, తర్వాత అని విభజించి చెప్పాలి. ఎందుకంటే ఆ రెండు సమయాలకి మధ్య దూరం వారి కొలుచుకోలేనట్టే ఉంటోంది. 
రాధా వ్యవహారం మరో ఉదాహరణ
వంగవీటి రంగా కుమారుడు రాధా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఇచ్చిన ప్రెస్ మీట్ చూస్తే మార్పు గురించి చక్కగా అర్థం చేసుకోవచ్చు.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం రాధాకు జగన్‌లో లోపాలు కనిపించలేదు. అవమానం అనిపించ లేదు. ఒక్కసారి పార్టీని వీడి పచ్చ పంచన చేరిన వెంటనే అతడి గొంతులో చెప్పలేని మార్పు వచ్చేసింది. ఎవ్వరినైనా, చివరకు జర్నలిస్టులను కూడా తిట్టే అహంకారం వచ్చి చేరింది. ఈ తరహా అహంభావం, దర్పం ఐదేళ్లుగా  అధికార టీడీపీ భావజాలమే అని అందరికీ తెలుసు. నేడు అదే పద్ధతి పార్టీ మారిన రాధాలోనూ చూడొచ్చు. ఏయ్, ఓయ్, ఆగు, విను, లెట్ మీ ఫినిష్ అంటూ ఊగిపోయిన వంగవీటి రాధాలో నారా చంద్రబాబు తీరును స్పష్టంగా గమనించవచ్చు. ఆ అధికార దురహంకారానికి ఇంతకుమించిన సాక్ష్యం ఏం కావాలి? 
ఐదేళ్లుగా  అదే అబద్ధం
 వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో అవమానించారని, వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నియంతలా వ్యవహరించాడని రాధా చెప్పడంలోనే అది చంద్రబాబు స్క్రిప్టు అని తేలికగా అర్థం అవుతుంది. ఎందుకంటే గత నాలుగున్నరేళ్లలో పార్టీని వీడి పచ్చ కండువాలు కప్పుకున్న ప్రతి ఒక్కరికీ జగన్ వ్యక్తిత్వంపై బురద జల్లడం తప్ప మరో కారణం చెప్పాలన్నా వీలు పడటం లేదు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పార్టీలో, అధినేత అందరివాడుగా ఉండే పార్టీలో అంతకుమించి తప్పులెంచడానికి ఏమీ ఉండదు . ఇక వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ని ఓ నియంత అని నమ్మించాలని చంద్రబాబు చేసే కృషిలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి. 
ఏ గట్టుచేరినా లోగొట్టు అదే
వంగవీటి రాధా టీడీపీ  లేదా జనసేన.. వీటిలో దేనిలో చేరతారో అని కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ నా తండ్రిని పొట్టన పెట్టుకుంది అన్న మాటను ఉపసంహరించుకుని, టీడీపీకీ నా తండ్రి హత్యకూ సంబంధం లేదు అనడంతోనే వంగవీటి రాధా ఏ గట్టుకు చేరిపోయారో క్లియర్ గా తెలిసి పోతుంది. ఒక వేళ జనసేనతో కలిసినా అది అండర్ కరెంటుగా టీడీపీలో చేరినట్టే కనుక మొత్తంగా రాధా రంగు పసుపే అని బయటపడ్డట్టైంది. 

Back to Top