విజయవాడ: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా నిలిచేందుకు 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రారంభించిన వాలంటీర్ వ్యవస్థ గత నాలుగు ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను కోట్లాదిమందికి చేరేందుకు నిర్విరామంగా కృషి చేస్తోంది. ప్రజల కోసం కనీస వేతనం కూడా ఆశించకుండా ప్రభుత్వం కల్పించిన 5000 రూపాయల గౌరవ వేతనంతో తీసుకుని వాలంటీర్లు ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తున్నారు.
ప్రజల కోసం పనిచేస్తున్న వాలంటీర్లలో చాలామంది నిరుపేదలే. సంపదలో పేదవారేమో కానీ సేవలో మాత్రం అందరికంటే ముందుంటారు మన వాలంటీర్లు. అటువంటి వాలంటీర్ లలో పెనమలూరు మండలం కానూరు మురళి నగర్, 20వ వార్డులో ఐదవ నెంబర్ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న జక్కుల సోంబాబు ఒకరు. రెండు కిడ్నీలు పాడైనప్పటికీ తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా గత నాలుగేళ్లుగా ప్రభుత్వం అప్పగించిన ప్రతి పనిని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు.
కానూరు గ్రామా సచివాలయం పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తూ దళిత సామాజిక వర్గానికి చెందిన జక్కుల సోంబాబు చిన్న తనం లోనే తండ్రిని కోల్పోయారు. తల్లి ఒక సాధారణ కూలీగా జీవనం సాగిస్తోంది. సోంబాబు వాలంటీర్ గా బాధ్యతలు చేపట్టే నాటికే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై ఉన్న అభిమానంతో వాలంటీర్ గా సేవలందించేందుకు బాధ్యతలు చేపట్టారు. కానీ అతనికి రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. డయాలసిస్ చేయించుకోకపోతే జీవించలేని పరిస్థితి. నిజానికి అతను వాలంటీర్ గా మరింత మందికి సేవలు అందించాలనే సంకల్పమే అతనిని బతికిస్తోందేమో. అతని సంకల్పమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో పడేలా చేసింది.
శుక్రవారం వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొని సభ ముగించుకొని బయలుదేరిన ముఖ్యమంత్రిని సోంబాబు తన తల్లి, సోదరుడితో కలిసి తన ఆవేదన, వాలంటీరుగా మరింత కాలం సేవలందించాలనే సంకల్పాన్ని గురించి వివరించారు. సోంబాబు దిన గాధను విన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చలించి పోయారు. వెంటనే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుని పిలిచి సోంబాబుకు తక్షణసాయంగా రెండు లక్షల రూపాయలు అందించాలని ఆదేశించారు. ఈ సాయంతో పాటుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు.
ముఖ్యమంత్రి మానవత్వానికి మరో మచ్చుతునక అని చెప్పగలిగే మరొక సహాయాన్ని కూడా ప్రకటించారు. డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం ఇస్తున్న పదివేల రూపాయల పెన్షన్ కూడా అందించాలని అధికారులను ఆదేశించారు. వీటితోపాటుగా మూత్రపిండాల మార్పిడికి అవసరమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా తక్షణమే పూర్తిచేయాలని చెప్పారు. మూత్రపిండాల మార్పిడికి అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని సోంబాబు కుటుంబానికి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చేసిన ఈ సహాయం తన జీవితంలో మర్చిపోలేనని సోంబాబు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి వారించారు. తన ప్రభుత్వంలో వాలంటీర్లకు ఎటువంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ప్రకటించారు.

రెండు లక్షల రూపాయలు చెక్కు అందజేత జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఒక సాధారణ వాలంటీర్ కు ఇచ్చిన హామీని తక్షణమే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు అమలు చేసి చూపించారు. వాలంటీర్లకు వందనం సభలో కానూరు మురళి నగర్ కు చెందిన వాలంటీర్ కు జక్కుల సోంబాబు కు తక్షణ ఆర్ధిక సహాయం ప్రకటించిన రెండు లక్షల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని సభ ముగిసిన గంట లోపే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సోంబాబు కుటుంబానికి తన కార్యాలయంలో అందజేసి ముఖ్యమంత్రి హామీని నెరవేర్చారు. సహాయం ప్రకటించిన గంట వ్యవధిలో బాధితునికి సాంత్వన కలిగేలా జిల్లా అధికార యంత్రాంగం వేగంగా స్పందించడం పరిపాలన దక్షతకు నిదర్శనం.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణమే రెండు లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ఇతర సహాయాలను కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం అమలు చేస్తుందని తమ కార్యాలయం సిబ్బంది ఎప్పటికప్పుడు ఆర్ధిక సహాయం అందిచటంలో పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి మానవత్వానికి నేటి సంఘటన నిదర్శనమన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద, బలహీన వర్గాలకు చెందిన వారి సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తోందని అన్నారు. అపరిష్కృత సమస్యలన్నీ జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చినంత వరకు సకాలంలోనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. సమస్యల పట్ల ఇంత వేగంగా స్పందించి, మానవత్వంతో ఆలోచించే ప్రభుత్వం ఉండటం అరుదైన విషయమని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. జిల్లా కలెక్టర్ నుండి ఆర్ధిక సహాయం చెక్కును స్వీకరించిన వాలంటీర్ జక్కుల సోంబాబు తో పాటు ఆయన మాతృమూర్తి జక్కుల వెంకమ్మ, సోదరులు జక్కుల జనార్దన్, జక్కుల నవీన్ లు ఉన్నారు.