అమరావతి: టీడీపీ మద్యం మాఫియా దోపిడీకి కూటమి ప్రభుత్వం అధికారికంగా పచ్చజెండా ఊపింది. ఐదేళ్ల క్రితం వైయస్ఆర్‌సీపీ హయాంలో సీసాలో బంధించి బిరడా బిగించి పాతరేసిన సిండికేట్ భూతాన్ని వెలికితీసి మళ్లీ రాష్ట్రంపైకి వదిలిపెట్టింది. ప్రైవేట్ మద్యం దుకాణాల ముసుగులో టీడీపీ సిండికేట్ దోపిడీకి తలుపులు బార్లా తెరిచింది. ప్రభుత్వ ‘ముఖ్య’నేత పక్కా పన్నాగంతో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి సిండికేట్ దందాను యథేచ్ఛగా సాగించారు. లాటరీ ప్రక్రియ ద్వారా లైసెన్సుల కేటాయింపు విధానాన్ని ప్రహసనంగా మార్చేసి ఇతరులెవరూ దరఖాస్తు చేయకుండా బెదిరింపులతో బెంబేలెత్తించారు. లాటరీ ముసుగులో 80 శాతం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకున్న టీడీపీ సిండికేట్.. మిగిలిన 20 శాతం దుకాణాల లైసెన్సులు పొందిన వారిని తీవ్ర బెదిరింపులకు గురి చేసి వాటిని సైతం హస్తగతం చేసుకునేందుకు దౌర్జన్యాలకు తెగబడుతోంది. 80 శాతం ఏకపక్షం.. 20 శాతం కబ్జా – ఇదీ టీడీపీ సిండికేట్ దందా... ఊహించిందే జరిగింది..! రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేటే దక్కించుకుంది. 80 శాతం దుకాణాలకు ఇతరుల నుంచి పోటీ లేకుండా అడ్డుకుని ‘లాటరీ’ ముసుగులో ఏకపక్షంగా హస్తగతం చేసుకోగా.. మిగిలిన 20 శాతం దుకాణాల లైసెన్సులు పొందినవారిని బెదిరించి మరీ కబ్జా చేశారు. టీడీపీ మద్యం సిండికేట్ దందాకు అధికార యంత్రాంగం జీ హుజూర్ అనడంతో రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన లాటరీ ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. టీడీపీ ప్రజాప్రతినిధుల సిండికేట్ మొత్తం లాటరీ ప్రక్రియను తమకు అనుకూలంగా హైజాక్ చేసింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు నామినేట్ చేసిన వారి కనుసన్నల్లోనే అధికారులు లాటరీ ప్రక్రియను నిర్వహించి తతంగాన్ని ముగించారు. కూటమి ఎమ్మెల్యేల వర్గీయులు ముందుగానే లాటరీ నిర్వహించే ప్రాంగణాల్లో భారీ సంఖ్యలోతిష్ట వేసి అంతా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు ఎమ్మెల్యే వర్గీయులు చెప్పింది చేసే కీలుబొమ్మలుగా మిగిలిపోయారు. దాంతో ‘లాటరీ విధానం’లో 80 శాతం మద్యం దుకాణాలు టీడీపీ సిండికేట్‌కు దక్కాయి. కొన్ని చోట్ల ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసిన ఇతరులు చివరి నిమిషం వరకు అజ్ఞాతంలో ఉండి లాటరీ సమయానికి వచ్చారు. అలాంటి వారికి 20 శాతం మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. దాంతో ఉలిక్కిపడ్డ టీడీపీ సిండికేట్ వారి గురించి ఆరా తీసి లాటరీ ప్రాంగణంలోనే బహిరంగంగా బెదిరించింది. మద్యం దుకాణాలను వదిలేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది. కాదు కూడదు.. నిర్వహిస్తామంటే తమకు 50 శాతం వాటాగానీ ఆదాయంలో 30 శాతం కమీషన్‌గానీ ఇవ్వాలని స్పష్టం చేసింది. అందుకు సమ్మతించకుంటే మద్యం దుకాణం కూడా తెరవలేరని.. తరువాత పరిణామాలతో తమకు సంబంధం లేదని హెచ్చరికలు జారీ చేసింది. ఇలా మొత్తం 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్ గుప్పిట పట్టింది. డీల్ సెట్.. సిండికేట్‌కు పచ్చజెండా ప్రభుత్వ ‘ముఖ్య’నేతతో డీల్ కుదరడంతోనే టీడీపీ మద్యం సిండికేట్‌కు ఏకపక్షంగా లైసెన్సులు దక్కాయి. అందుకే యావత్ అధికార యంత్రాంగం సిండికేట్‌కు సహకరించింది. రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పీ కంటే రూ.10 అధికంగా... వాటికి అనుబంధంగా నెలకొల్పనున్న బెల్ట్ దుకాణాల్లో ఎంఆర్‌పీ కంటే రూ.25 చొప్పున అధికంగా విక్రయించేందుకు ‘ముఖ్య’నేత అనుమతించారు. అందుకుగాను ఒక్కో బాటిల్‌పై ఆయనకు రూ.3 చొప్పున కమీషన్ చెల్లించేందుకు సిండికేట్ సమ్మతించింది. మరోవైపు డిస్టిలరీలు కూడా ‘ముఖ్య’నేతకు 20 శాతం కమీషన్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో మద్యం తయారు చేసే డిస్టిలరీలన్నీ టీడీపీ నేతలవే కావడం గమనార్హం. మొత్తం 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు గతంలో 1995–2004, 2014–2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చారు. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతులు జారీ చేశాయి. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు చెందిన డిస్టిలరీలకు భారీ లాభాలు తెచ్చిపెట్టేందుకు, రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమైంది. అందుకోసం త్వరలో పర్మిట్ రూమ్‌లకు అనుమతించడంతోపాటు అనధికారికంగా దాదాపు 50 వేల బెల్ట్ దుకాణాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. తద్వారా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగి డిస్టిలరీ యాజమాన్యాలకు లాభాల పంట పండనుంది. అందుకు ప్రతిఫలంగా డిస్టిలరీలు తమ ఆదాయంలో 20 శాతం ‘ముఖ్య’నేతకు కమీషన్ రూపంలో కప్పం చెల్లించేందుకు సమ్మతించాయి. అందుకే ప్రభుత్వ యంత్రాంగం అడ్డగోలుగా వ్యవహరించి టీడీపీ మద్యం సిండికేట్‌కు ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా చేసింది. 345 దుకాణాలు మహిళలకే... రాష్ట్రంలో 345 దుకాణాల లైసెన్సులు మహిళల పేరిట దక్కించుకున్నారు. మొత్తం మద్యం దుకాణాల్లో 10.2 శాతం మహిళలకు దక్కాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో 31 మంది మహిళలకు లైసెన్సులు కేటాయించగా అనకాపల్లి జిల్లాలో 25 మందికి, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాల్లో 24 మంది చొప్పున మహిళలకు లైసెన్సులు లభించాయి. రెండేళ్లలో రూ.6,384 కోట్ల ఆదాయం రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల ప్రక్రియను ఎక్సైజ్ శాఖ సోమవారం ముగించింది. ఈ నెల 16వతేదీ నుంచి కొత్త మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. మద్యం కొత్త విధానం ద్వారా ప్రభుత్వానికి 2024–26లో ఏకంగా రూ.6,384 కోట్ల ఆదాయం లభించనుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా 2017–19లో వచ్చిన ఆదాయం కంటే ఇది 349 శాతం అధికం కావడం గమనార్హం. 2017–19లో రూ.1,422 కోట్లు ఆదాయం రాగా 2024–26లో రూ.6,384 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఎకైŠస్‌జ్ శాఖ తాజాగా ప్రకటించింది. అందులో రూ.1,798 కోట్లు కేవలం దరఖాస్తు ఫీజుల రూపంలోనే వచ్చింది. ఇతర రాష్ట్రాలవారికీ లైసెన్సులు.. శ్రీకాకుళం జిల్లాలో ఐదు మద్యం దుకాణాల లైసెన్సులను ఒడిశాకు చెందినవారు దక్కించుకున్నారు. మరోవైపు ఢిల్లీకి చెందిన నందినీ గోయల్, సారికా గోయల్, సౌరబ్ గోయల్ విశాఖపట్నం జిల్లాలో 155 షాపులకు దరఖాస్తులు చేయగా వారికి ఆరు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారికి మచిలీపట్నంలో రెండు దుకాణాల లైసెన్సులు లభించాయి. యూపీకి చెందిన ఇద్దరు మహిళలు నందిని, మంజు రాణికి రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో రెండు షాపులు లాటరీలో దక్కాయి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన బొగ్గవరపు సరస్వతికి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో ఒక షాపు లాటరీలో తగిలింది. అంతా సిండికేట్ ఇష్టారాజ్యం.. రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులన్నీ టీడీపీ ఎమ్మెల్యేలు, సిండికేట్ సభ్యులే ఏకపక్షంగా హస్తగతం చేసుకున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు ఇవీ.. అచ్చెన్నదే హవా.. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు శ్రీకాకుళం జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లలో చక్రం తిప్పారు. జిల్లాలో దాదాపు అన్ని లైసెన్సులు అచ్చెన్న వర్గం చెప్పినవారికే దక్కడం గమనార్హం. మంత్రి అచ్చెన్నాయుడు సమీప బంధువు కింజరాపు పుష్పలతకు పోలాకిలోని 81 నెంబర్ దుకాణం, కోటబొమ్మాళిలోని 113 నెంబర్ దుకాణం, జలుమూరులోని 121 నెంబర్ దుకాణం దక్కాయి. మరికొన్ని దుకాణాలను అచ్చెన్నాయుడు సోదరుడు హరివరప్రసాద్ అనుచరులు సదాశివుని రాంబాబు(120), సాహుకారి ఝాన్సీరాణి(122), మెండ మోహనరావు(123), అంధవరపు బాలరాజు(98), రత్నాల గణేష్ చౌదరి(99), కె.కె.రామయ్య(101,102), మండల రమణబాబు(104), డొంకాన మోహన్‌రావు(103), బొడ్డేపల్లి నాగవల్లి(116), పల్లి శ్రీనివాసరావు(115), బొంగు అప్పారావు(118), బొంగు దేవి(119), కూశెట్టి మోహనరావు(105), పైడిశెట్టి సంతోష్‌కుమార్(109), బెండి అరుణ్‌కుమార్(110), పులి గణపతి(111), టి.వీరాంజనేయులు(112), కొట్టి మల్లేష్(114)లకు మద్యం దుకాణాలు కేటాయించారు. ⇒ నరసన్నపేట టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోడలు భైరి మోహినికి 74 నెంబర్ దుకాణం, మరదలి కుమారుడు ధర్మాన రామప్రసాద్‌కు 71,72 నెంబర్ల దుకాణాలు దక్కగా... వియ్యంకుడు గుండ ఏలేశ్వరరావుకు 77, 78 నెంబర్ల దుకాణాలు లభించాయి. ⇒ జనసేన నేత డాక్టర్ దానేటి శ్రీధర్ భార్య రాధారాణికి బూర్జ మండలంలోని 40వ నెంబర్ దుకాణం దక్కింది. విశాఖలో పచ్చదండు పాగా.. విశాఖపట్నం జిల్లాలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ యాదవ్ మద్యం సిండికేట్‌కు నేతృత్వం వహించారు. వారి ఆధ్వర్యంలోని జనప్రియ, పుష్కరిణి సిండికేట్లకే దాదాపు అన్ని మద్యం దుకాణాల లైసెన్సులు దక్కడం గమనార్హం. ⇒ అనకాపల్లి జిల్లాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, ఆయన వియ్యంకుడు, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సోదరుడు, యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ నేతృత్వంలోని సిండికేట్ ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులను దక్కించుకుంది. నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి, పాయకారావుపేట, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో మద్యం దుకాణాలను ఈ సిండికేట్ హస్తగతం చేసుకుంది. ⇒ అల్లూరి సీతారామరాజు జిల్లాలో టీడీపీకి చెందిన గిరిజనేతర నేతలు గిరిజనుల హక్కులను కాలరాశారు. జిల్లాలో 40 మద్యం దుకాణాలను గిరిజనులకే కేటాయించగా... గిరిజనులను బినామీలుగా చేసి టీడీపీ గిరిజనేతర నేతలు మద్యం దుకాణాలను దక్కించుకున్నారు. నర్సీపట్నం కేంద్రంగా టీడీపీ వర్గీయులే ఆ 40 మద్యం దుకాణాలను హస్తగతం చేసుకోవడం గమనార్హం. ⇒ విజయనగరం జిల్లాలో నోటిఫై చేసిన 153 మద్యం దుకాణాలకు 5,237 దరఖాస్తులు దాఖలయ్యాయి. టీడీపీ నాయకులు, వారి బినామీలే షాపులను దక్కించుకున్నారు. అధికార పార్టీ అరాచకాలు ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు బరితెగించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఓ ప్రైవేట్ చానల్ అధిపతికి లాటరీ ద్వారా కమలాపురం నియోజకవర్గంలో నాలుగు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. ఆ చానల్ ప్రతినిధులను పిలిపించి బెదిరించారు. తమకు 50 శాతం వాటా ఇస్తేనే దుకాణాలు నిర్వహించుకోగలరని హెచ్చరించారు. ఇక జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి స్వయంగా పలువురికి ఫోన్లు చేసి బెదిరించినట్లు సమాచారం. కడపలో లాటరీ ద్వారా దుకాణాలు దక్కించుకున్న వారంతా తన వద్దకు రావాలని.. తనకు 50 శాతం వాటాగానీ 30 శాతం కమీషన్‌గానీ ఇవ్వాలని తేల్చిచెప్పారు. లేదంటే ఒక్కరు కూడా మద్యం దుకాణాన్ని నిర్వహించలేరని బెదిరించినట్లు తెలుస్తోంది. ⇒ అన్నమయ్య జిల్లాలో మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి సోదరుడు రాహుల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్‌రెడ్డి బంధువు కిరణ్, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సానపురెడ్డి సుజతోపాటు టీడీపీ సిండికేట్ సభ్యులే ఏకపక్షంగా లైసెన్సులు దక్కించుకున్నారు. సంబేపల్లి, కోడూరు, తంబళ్లపలత్లి, పీలేరు తదితర ప్రాంతాల్లో లాటరీ ద్వారా లైసెన్సులు పొందినవారిని పిలిపించి బెదిరిస్తున్నారు. ⇒ అనంతపురం జిల్లాల్లో టీడీపీ సిండికేట్ బెదిరింపులు యథేచ్ఛగా సాగాయి. ఆత్మకూరులో షాపు నెంబర్ 35 లైసెన్స్ స్వాతి అనే యువతికి లాటరీలో దక్కడంతో పరిటాల సునీత వర్గీయులు ఆమెను తీవ్రంగా బెదిరించారు. ఆమె డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించినా అధికారులు స్వీకరించేందుకు నిరాకరించడం గమనార్హం. దాంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పరిటాల వర్గీయులకు ఆ లైసెన్సును కేటాయించారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ఐదు మద్యం షాపులు బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులుకు దక్కాయి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు ఆయన సన్నిహితుడు. ⇒ కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు 3,046 దరఖాస్తులు అందాయి. కోడుమూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లో కొత్తగా దుకాణాలు దక్కించుకున్న వారిని అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ⇒ తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 125 షాపులకు లాటరీ నిర్వహించగా సింహభాగం టీడీపీ, జనసేన సిండికేట్ దక్కించుకుంది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 17 షాపులు సిండికేట్‌కు దక్కాయి. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 175 మద్యం షాపులకు 5,627 దరఖాస్తులు రాగా లాటరీలో మొదట షాపు దక్కిన దరఖాస్తుదారుడు డ్రాప్ అవడంతో మరో రెండు రిజర్వు టోకెన్లు తీశారు. ⇒ ఏలూరు జిల్లాలో 144 షాపులకు 5,499 దరఖాస్తులు అందాయి. ఆగిరిపల్లిలో మూడు షాపులను మంత్రి అనుచరుల సిండికేట్ దక్కించుకుంది. పోలవరం నియోజకవర్గం కుక్కునూరులో ఎస్టీ రిజర్వుడ్ కేటగిరీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌కు షాపు దక్కింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 8 మంది మహిళలకు వైన్‌షాపులు దక్కాయి. ⇒ కాకినాడ జిల్లాలో 155 మద్యం షాపులకు 3,332 దరఖాస్తులు వచ్చాయి. ప్రత్తిపాడు స్టేషన్ పరిధిలోని ఒక దుకాణానికి 37 మంది పోటీ పడ్డారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసిన వారిలో 20 మంది షాపులు దక్కించుకున్నారు. ⇒ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 182 మద్యం దుకాణాలకు 3,890 దరఖాస్తులు అందాయి. 24 దుకాణాలను మహిళలు దక్కించుకున్నారు. ⇒ గుంటూరు జిల్లాలో 127 మద్యం షాపులకు 4,448 టెండర్లు దాఖలయ్యాయి. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రధాన అనుచరుడు ప్రత్తిపాడు నియోజకవర్గంలో షాపు దక్కించుకున్నారు. ⇒ బాపట్ల జిల్లాలో మద్యం దుకాణాలను మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలోని సిండికేట్ ఏకపక్షంగా దక్కించుకుంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పీఏకి రెండు దుకాణాలు దక్కాయి. కొండపిలో మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పీఏకి ఒక దుకాణం లభించింది. మార్కాపురంలో టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అనుచరులు రెండు దుకాణాలు, జనసేన నేత ఒక దుకాణాన్ని దక్కించుకున్నారు. దర్శి టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి 50 శాతం కప్పం చెల్లించాలని హుకుం జారీ చేసినట్లు చెబుతున్నారు. మాచర్లలో తెలంగాణ వ్యాపారి తిప్పలు తెలంగాణకు చెందిన ఓ వ్యాపారికి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రెండు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గీయులు ఆయన్ని బెదిరించడంతో తెలంగాణలోని ప్రజాప్రతినిధి ద్వారా సిఫార్సు చేయించుకోవాల్సి వచ్చింది. అయినా సరే 50 శాతం వాటా ఇస్తేనే సమ్మతిస్తామని జూలకంటి వర్గీయులు చెప్పడంతో ఆ వ్యాపారి సమ్మతించక తప్పలేదు. ఆ రెండు మినహా మాచర్ల నియోజకవర్గంలోని అన్ని మద్యం దుకాణాలను ఎమ్మెల్యే జూలకంటి వర్గమే ఏకపక్షంగా దక్కించుకుంది. హిందూపురంలో కిడ్నాప్.. ధర్నా సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో మద్యం షాపు (నం.57) లాటరీలో దక్కించుకున్న రంగనాథ్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు సోమవారం పుట్టపర్తిలోని సాయి ఆరామం వద్ద ఆందోళన నిర్వహించారు. దీనిపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు సైతం చేశారు. రూ.15 లక్షలు ఇస్తామని.. షాపు వదిలిపెట్టాలని రంగనాథ్‌ను బెదిరింపులకు గురి చేసినట్లు సమాచారం. అయితే ఆడియో రికార్డింగ్ లీక్ కావడంతో వెనక్కి తగ్గిన కిడ్నాపర్లు రంగనాథ్‌ను వదిలేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని అనంతరం రంగనాథ్ పోలీసులతో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల కనుసన్నల్లోనే మద్యం దరఖాస్తుల ప్రక్రియ సాగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.