అబద్ధాల సరఫరా  మోసాల సప్లై...

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేయకండి. సూర్యుణ్ణి ఒక చోట పెట్టి సూర్యకాంతిని ఇంటింటికీ సప్లై చేయగలదు. డాక్టర్లందర్నీ ఒక చోట పోగేసి ఊరూరా చికిత్స సరఫరా చేయగలదు. నలభై ఏళ్ల అనుభవం, భాగ్యనగరం, భ్రమరావతి లాంటి మహానగరాలు నిర్మించిన నైపుణ్యం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాంటివేం పెద్ద విషయం కాదనుకోండి...
నీళ్లకు గతిలేదు కానీ...
ఒకే చోట ఏసీ పెట్టి అమరావతికంతటికీ చల్లగాలి సరఫరా చేస్తా అంటున్నాడు చంద్రబాబు. వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు ఖచ్చితంగా చంద్రబాబే అన్న సామెతను నిజం చేసాడు. విద్యుత్తు, గ్యాసులాగే ఏసీని కూడా సరఫరా చేస్తాననే ఈ మహా మేధావికి సాటిరాగల నాయకుడు ఈభూమ్మేదే లేడు. మాటలతో కోటలు కట్టగలడు గనుకే అవ్వని పనులకు ఎన్నో అద్భుతాలు చెబుతుంటాడు చంద్రబాబు. పోలవరం పూర్తి కాకుండానే పంటలకు నీళ్లు సరఫరా చేస్తానంటాడు. విండ్ పవర్ తో వ్యవసాయం అంటాడు. సౌర విద్యుత్ తో రాష్ట్రంమంతా వెలుగులే అంటాడు. రెయిన్ గన్ లు పెట్టి రాయలసీమలో కరువు తరిమేశానంటాడు. ఊరుకోవాలే గానీ ఆకాశంలో మెరుపులు తెచ్చి మీ ఇంటికి తోరణాలు కడతా, చుక్కలు తెచ్చి వాకిట్లో ముగ్గులు పెడతా అని కూడా చెబుతాడు. 
వీటి గతి ఏమిటో...
ఎన్టీఆర్ సుజల స్రవంతితో తాగునీరు ఇంటింటికీ అని ప్రచారం చేసాడు. కొన్నిచోట్ల మొదలు పెట్టినట్టే పెట్టి తర్వాత వాటిని మూసేసాడు. రాష్ట్రంలో ఎక్కడా మంచినీటి సరఫరానేలేదు. పేదలకు నెలవారీ ఇచ్చే ప్రజా పంపిణీ వ్యవస్థను నాశనం చేసాడు చంద్రబాబు. చౌక ధరల డిపోల్లో సరకుల సరఫరా లేదు. పండగలప్పుడు చంద్రన్న కానుక అంటూ ఇచ్చే నాసిరకం సరుకుల్లోనూ బోలెడంత కమీషన్ల లాలూచీలు బయటపడుతున్నాయి. ఆసుపత్రుల్లో అత్యవసర మందులు కూడా అందుబాటులో లేవు. కుక్కకాటు వాక్సిన్, గర్భిణీల మందులు, కనీసం మలేరియా లాంటి సీజనల్ జ్వరాలకు ఇచ్చే మందులు కూడా సరఫరా చేయడంలేదు. ప్రభుత్వ ఆసుపత్రులకు కరెంటు సరఫరాకూడా సరిగ్గా లేదు దాంతో గవర్నమెంటు ఆసుపత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లలో సెల్ ఫోన్ వెలుగులో ఆపరేషన్లు జరిగిన ఘనమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అరోగ్యశ్రీ నిధుల సరఫరా ఆగి ఉచిత వైద్యసేవలకు గండి పడింది. ఫీజ్ రీయంబర్స్ మెంట్ నిధులు ఆగి విద్యార్థుల చదువులకు చీకటి కమ్మింది. ప్రభుత్వ డెయిరీలను నిర్లక్ష్యం చేయడంతో వాటి పాల సరఫరా ఆగిపోయింది. పచ్చ నాయకుల కబ్జాల్లో ఇరుక్కుని ప్రజలకు ఉచిత ఇసుక సరఫరా లేకుండా పోయింది. 
బాబుదంతా ఉత్తగాలి కబుర్ల సరఫరా మాత్రమే...అబద్ధాలను, దొంగ హామీలను...నెరవేరని మాటలనే బాబు అలవోకగా సరఫరా చేస్తాడు...అందుకే ఏపీ ప్రజలూ తస్మాత్ జాగ్రత్త. 
 

Back to Top